అప్పుడే సాగునీటి గోస మొదలైంది. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో పొలాలు ఎండిపోవాల్సిన దుస్థితి దాపురించింది. గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్‌లో పుష్కలంగా నీరున్నా.. కాలువల ద్వారా నీరిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పలుచోట్ల పూడికతో నిండి అధ్వానంగా మారగా, మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో సీజన్‌కు ముందే కాలువలకు మరమ్మతులు చేయించి సకాలంలో నీరందించగా, కాంగ్రెస్ వచ్చాక పరిస్థితి తారుమారైంది. రెండేండ్లుగా సరిపడా నీరందించక సాగు దయనీయంగా మారుతున్నది. మరో నాలుగు రోజుల్లో నీటిని విడుదల చేయకపోతే యాసంగి పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి కెనాళ్లలో పూడిక తీసి నీటిని విడుదల చేయాలని రైతాంగం కోరుతున్నది.
గంగాధర, మార్చి1 : గంగాధర మండలం మల్లాపూర్, గోపాల్రావుపల్లి గ్రామాల్లో ఏటా యాసంగిలో 200 ఎకరాలకు పైనే రైతులు వరి సాగుచేస్తుంటారు. కేసీఆర్ పాలనలో నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి క్రమం తప్పకుండా నీటిని విడుదల చేయడంతో ఏరంది లేకుండా సేద్యం చేసుకున్నారు. నారాయణపూర్ నుంచి కొడిమ్యాల మండలం మైసమ్మ చెరువుకు నీటిని విడుదల చేసి, మళ్లీ అక్కడి నుంచి వేములవాడ రూరల్ మండలం ఫాజుల్‌నగర్ చెరువుకు వెళ్లే గ్రావిటీ కెనాల్‌కు ఏర్పాటు చేసిన డీ4 కెనాల్ ద్వారా మల్లాపూర్, గోపాల్రావుపల్లిలో చెరువులు, కుంటలు నింపేవారు. దిగువకు విడుదల చేసేవారు. మరోవైపు భూగర్భజలాలు పెరిగి బావులు, బోర్లలో సమృద్ధిగా నీరు ఉండడంతో కరువన్నదే లేకుండా రైతులు రెండు పంటలు సాగు చేశారు. కానీ, రెండేండ్లుగా ఒక పంటకే పరిమితం కావాల్సిన దుస్థితి కావాల్సి వస్తున్నది.
మైసమ్మ చెరువు నుంచి వేములవాడ రూరల్ ఫాజుల్‌నగర్ చెరువుకు వెళ్లే గ్రావిటీ కెనాల్‌కు ఏర్పాటు చేసిన డీ4 కెనాల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కొద్దిరోజుల కింద పూడ్చివేశారు. అధికారులు ఏళ్లుగా కాలువ మరమ్మతులు చేయించకపోవడంతో పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగి ఆనవాళ్లు కోల్పోగా, నారాయణపూర్ రిజర్వాయర్ నీళ్లు దిగువకు రాలేని పరిస్థితి నెలకొన్నది. రెండేండ్లుగా యాసంగిలో నీరందక పంటలు ఎండిపోవాల్సిన దుస్థితి దాపురించిందని, కాంగ్రెస్ వచ్చి మళ్లీ కరువు తీసుకువచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో నారాయణపూర్ రిజర్వాయర్‌కు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లాపూర్, గోపాల్రావుపల్లి గ్రామాల్లోని పంటలకు సాగు నీరు అందకుండా పోతున్నదని వాపోతున్నారు. మరో నాలుగు రోజుల్లో పంటలకు నీరందకుంటే పంటలు ఎండిపోయి పెట్టుబడి చేతికి రాదని ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ సర్కారు రైతులపై కనికరం చూపాలని వేడుకుంటున్నారు.
మాది గోపాల్రావుపల్లి. ఊళ్లే నాకు రెండెకరాల భూమి ఉంది. వరి వేసిన. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి మల్లాపూర్, గోపాల్రావుపల్లి గ్రామాలకు వచ్చే కాలువ అక్కడక్కడ పూడికతో నిండి చివరికి నీళ్లు వస్తలేవు. చాలా ఇబ్బందైతంది. రూ.5 లక్షలు పెట్టి బావి తవ్విస్తే చుక్క నీరు పడలే. మొత్తం నష్టపోయిన. పంట ఎండిపోయి, అప్పుల పాలైన. నాసోంటి కష్టం ఏ రైతుకూ రావద్దు.
నేను రెండెకరాలల్లో వరేసిన. నారాయణపూర్ నుంచి నీళ్లు వస్తలేవు. కాలువ పూడికతో నిండిపోయింది. నీళ్లు విడుదల చేసినా ఇచ్చినా మా దాక అచ్చే పరిస్థితి లేదు. ఎండలు ముదరడంతో పొలం ఎండిపోతంది. గతంలో 5 లక్షలు పెట్టి బాయి తవ్విచ్చినా చుక్క నీరు పడలే. ఈ సారి నీళ్లు వస్తాయనే ఆశతో 60 వేలు పెట్టి పూడిక తీయించినా లాభం లేదు. ఏం చేసుడో తెలువక పొలాన్ని ఎడ్లకు మేతగా వదిలేసిన. కేసీఆర్ సారు ఉన్నప్పుడు ఇట్ల కరువు లేకుండేది. కాంగ్రెస్ సర్కారు అచ్చింది కరువు తెచ్చింది.
నాకు నాలుగున్నరెకరాల భూమి ఉంది. సాగు నీళ్లు అందుతయో.. లేదోనని..? రెండున్నర ఎకరాల్లో వరి వేసిన. వాటికీ నీళ్లు చాలక ఎకరం ఎండిపోయింది. బాయి ఎండిపోతే పూడిక తీయించి, సైడ్ బోర్ వేయించినా నీళ్లు రాలె. పైసలు మాత్రం ఖర్చయినై. పొలం ఎండి పోతే గొర్లు, బర్లను మేపుడు అయితది. కొడిమ్యాల మండలం నుంచి వచ్చే కాలువను బాగు చేసి నీళ్లు ఇస్తే పంటలు ఎండిపోవు. అధికారులు, ప్రజాప్రతినిధులు దయచూపాలె.