వేములవాడ, మార్చి 1 : గల్ఫ్ దేశాల్లో యుద్ధ జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధంతో బాంబుల మోతలు మోగుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌తో కలిసి అమెరికా దాడులు చేస్తుండగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దుబాయ్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఇరాక్ లాంటి దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలతోపాటు విమానాశ్రయాలు, ఇతర సముదాయాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ యుద్ధ విమానాలతో బాంబుల దాడి చేస్తుండగా, ఆయా దేశాలతోపాటు సమీప దేశాల్లోని వలస జీవులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. నిత్యం బాంబుల మోతలతో దేశాలు దద్దరిల్లుతుండగా, పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు వెళ్లిన లక్షలాది మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసులు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక వణికిపోతున్నారు. అయితే అకడి దేశాలు సమర్థవంతంగా సైనిక చర్యలను ఎదురొంటున్నాయని చెబుతున్నా.. సమీప ప్రాంతాల్లోనే బాంబులు పడడం చూసి వణికిపోతున్నారు. ఏదైనా మిసైల్, యుద్ధ రాకెట్లు దూసుకొస్తున్న సమయంలో అధికారులు సైరన్ మోగిస్తుండడంతో వెంటనే అప్రమత్తమై బంకర్లతోపాటు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. మరో వైపు ఇక్కడ వలస కార్మికుల కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. టీవీలు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను చూసి భయపడిపోతున్నారు. ఎప్పటికప్పుడు తమ వాళ్లకు ఫోన్లు చేసి క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. అప్రమత్తంగా ఉండాలని ధైర్యం చెబుతున్నారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని భారతీయులను సురక్షితంగా స్వదేశం రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఒమన్ దేశంలోని ముసందం రాష్ట్రంలో మేము పనిచేస్తున్నం. ఈ రాష్ట్రం దుబాయ్ రసల్ కీమాకు చాలా దగ్గరగా ఉన్నది. ప్రత్యక్షంగా మా దేశంపై ఎలాంటి దాడులు లేవు. కానీ, దుబాయ్ లక్ష్యంగా పడుతున్న బాంబుల శబ్దాలు మాకు వినిపిస్తున్నయి. ఆదివారం తెల్లవారుజామున మాకు అత్యంత సమీపాన ఉండే సముద్ర తీరాన షిప్ యార్డ్‌లో బాంబు పడ్డది. మేం భయపడ్డం.
ఇరాన్ సైన్యం అమెరికా సైనిక స్థావరాలు, ఎంబసీ లక్ష్యంగా దాడులు చేస్తున్నది. ఖతార్ దేశంలోని సొనాయి ప్రాంతంలో మేం ఉన్నం. సుమారు 7కిలోమీటర్ల దూరంలో అమెరికా ఆర్మీ బేస్ క్యాంపు లక్ష్యంగా ఇప్పటికే రెండు రోజుల్లో పదిసార్లు వైమానిక దాడులు చేసిన్రు. దాడి జరిగిన ప్రతిసారి భారీ శబ్ధ్దాలు వస్తున్నయి. దాడులను ఖతార్ సైన్యం కూడా నియంత్రిస్తున్నది. అయినా దాడులు జరుగుతూనే ఉన్నయి. ప్రభుత్వం ప్రజలను సైరన్ ద్వారా అప్రమత్తం చేస్తున్నది. బయటకు వెళ్లడానికి వీలు లేకుండా ఆదేశాలు జారీ చేసిన్రు. ప్రభుత్వం అప్రమత్తం చేసే సైరన్ వచ్చిన ప్రతిసారి బయటకు రోడ్ల మీదికి వస్తున్నం. అందరం కలిసి ఒకచోట ధైర్యంగా ఉంటున్నం. ఇంతకు ముందు కూడా ఇరాన్ ఇజ్రాయిల్ దాడుల సమయంలోనూ బాంబుదాడులు జరిగినయి.
కొడుకుతో ఫోన్లో మాట్లాడిన
నా నడిపి కొడుకు శ్రీనివాస్ దుబాయిలో ఉన్నడు. అక్కడే ఉద్యోగం చేస్తున్నడు. అక్కడ బాంబులు పడుతున్నయని మా చుట్టుపక్కలోళ్లు చెప్పిన్రు. టీవీలల్ల కూడా వార్తలు వచ్చినయి. కొడుకు ఎట్లున్నడోనని మస్తు భయపడ్డ. వెంటనే ఫోన్ చేసిన. బాగానే ఉన్ననని చెప్పిండు. అక్కడి ప్రభుత్వం కూడా బాగానే చూసుకుంటున్నదని చెప్పిండు. అప్పుడు మనసు నిమ్మలమైంది. కానీ, బాంబులతో దాడి చేసుకున్నట్టు టీవీల్ల వార్తలను చూస్తే మస్తు బాధ అయితంది. ఎంతో మంది సచ్చిపోతరు కదా!
దుబాయ్ అమెరికా బేస్ క్యాంపు లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తున్నది. మా కార్యాలయం కూడా సముద్ర తీరానికి సమీపంలో ఉన్నది. శనివారం నుంచి మాకు అత్యంత సమీపంలోనే బాంబుల దాడులు జరుగుతున్నయి. దుబాయ్ సైన్యం కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నది. ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసి బయటకు రాకుండా ఆదేశాలు జారీ చేసిన్రు. అందరం ఒకచోట ఉండి ధైర్యంగా ఉంటున్నం.