మియాపూర్ , ఆగస్టు 16 : శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్ మిత్రహిల్స్‌లో పార్కు స్థలాన్ని వేలం వేయటాన్ని వ్యతిరేకిస్తూ కాలనీ వాసులు, చిన్నారులు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. వేలం వద్దు పార్కు స్థలం ముద్దు అనే నినాదాలతో ప్లకార్డులు చేతబట్టి నిరసన చేపట్టారు. కాలనీ వాసుల ఆందోళనకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపి.. వారితో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి విలువైన పార్కు స్థలాన్ని వేలం వేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయడం సరికాదన్నారు. తక్షణమే ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని, పూర్తి స్థాయిలో పార్కును అభివృద్ధి చేసి కాలనీ వాసులకు అందుబాటులో తేవాలని డిమాండ్ చేశారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే వందలాది మంది కాలనీ వాసులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే గాంధీ నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పార్కు స్థలం రక్షణకు న్యాయపరంగా ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అర్బన్ ఓబీసీ అధ్యక్షులు సీతారామరాజు, కాలనీ అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి, సుబ్బరాజు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.