మనలో చాలామందిమి హైస్కూల్ రోజుల్లో ‘రిప్ వాన్ వింకిల్’ కథనం ఏ ఉపవాచకాల్లోనో చదివే ఉంటాం. ఆ కథను ఒక్కసారి గుర్తుచేసుకొని ముందుకుపోదాం.
పని తప్పించుకుని కొండకోనల్లోకి పలాయనం చిత్తగించిన రిప్కు అక్కడ ముక్కూమొహం తెలియని ఓ బుడతకీచు గుంపు ఎదురవుతుంది. వాళ్లతో జూదమాడి, వాళ్లిచ్చిన మందుకొట్టి ఇరవయ్యేండ్లపాటు గుర్రుకొట్టి నిద్రపోతాడు రిప్. మెళుకువ వచ్చి లేచి, బారెడు గడ్డం, మూరెడు మీసం పెరిగి ఉండడం చూసుకొని విస్తుపోతాడు. కాస్త నోరున్న భార్యామణి ఏమంటుందోనని బిక్కుబిక్కుమంటూ ఇంటికి చేరిన రిప్..ఆమె కన్నుమూసిందని తెలిసి ఊపిరిపీల్చుకుంటాడు. అన్నేండ్లపాటు అయిపు లేకుండా పోయిన రిప్, అప్పటికైనా తిరిగొచ్చినందుకు అంతా ఆనందించడంతో శుభం కార్డు పడుతుంది!
అయితే, తాను గుర్రుకొట్టి పడుకున్న సమయంలో, సమాజం తలకిందులైపోవడంలోని మర్మం గ్రహించలేక తపనపడుతూనే గడిపేశాడు ముసలి రిప్ తాత అంటూ కథ ముగించేశాడు గడసరి రచయిత! పైపైన చూస్తే, ‘ఫీల్‌గుడ్ స్టోరీ’ లా కనబడే కథ ఇది. కానీ, చాలా లోతైన, సంక్లిష్టమైన శిల్పంతో కూడిన అన్యార్థక (అలెరీ) కథానిక ఈ రచన! మార్పులను అర్థం చేసుకోలేక అవస్థపడే సామాన్యుల ప్రవర్తన గురించిన వ్యాఖ్యానమే ఈ కథనం సారాంశం.
ఉపవాచకాల్లో అలాంటి కథనాలు చదవడమే తప్ప కవికాలాదులు, తదితర వివరాలు తెలుసుకొనే ఆసక్తి ఆ వయసులో మనకి ఎలానూ ఉండదు. అప్పట్లో మనకి పాఠాలు చెప్పేవాళ్లయినా అలాంటి వివరాలు చెప్పివుంటే, వాషింగ్టన్ ఇర్వింగ్ పేరు మనకి ఎన్నడో తెలిసి ఉండేది!
ఒక్కమాటలో చెప్తే.. కథనాల్లో చరిత్రనూ, చరిత్రలో కథనాలనూ చెప్పడమే తొలి తరం అమెరికన్ కథానిక రచయిత ఇర్వింగ్ అనుసరించిన విశిష్ట శిల్పరీతి. పందొమ్మిదో శతాబ్ది పెయింటర్ హెన్రీ ఇన్మన్ చిత్రించిన ‘మేల్కొన్న రిప్ వాన్ వింకిల్’ బొమ్మలో క్లిష్టమైన అంతరార్థాలు కూరిపెట్టాడంటారు. నిజం చెప్పాలంటే, ఇర్వింగ్ కథానికను రంగుల్లో చిత్రించాడు ఇన్మన్ అంతే! అదెంత లోతయిందో ఇదీ అంతే లోతయింది! అమెరికా దక్షిణ దిక్కున ఉండే దేశాల్లో స్థిరపడిన జర్మన్, ఇంగ్లిష్, స్కాట్, స్కాచ్, ఐరిష్, డచ్, పోర్చుగీస్ జనజాతులు అమెరికన్ విప్లవాన్ని చూసి ఎంతగా దిగ్భ్రాంతులయ్యారనే విషయమే ఇర్వింగ్ చారిత్రక కథనంలోనూ, ఇన్మన్ చిత్రంలోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రికామీ రిప్ కొండకోనల్లో నిద్రపోయిన సమయంలోనే ఉంది కీలకమంతా. రిప్, 1766లో నిద్రించి 1786 లో మేల్కొన్నాడని కథకుడు ఎక్కడా వాచ్యంగా చెప్పడు! కానీ, తాను కొండకోనల్లోకి పరారయ్యే నాటికి ఊరి కూడలిలో ఉండిన అశ్వారూఢ చక్రవర్తులవారి విగ్రహం మాయమై, సైనిక దుస్తుల్లో ఉన్న బట్టతల పెద్దమనిషి (జార్జ్ వాషింగ్టన్) విగ్రహం అక్కడికెలా వచ్చి నిలిచిందన్నది రిప్ను వేధించే ప్రశ్నల్లో ఒకటని మాత్రం అంటాడు.
అమెరికన్ విప్లవ పరిణామ దశలో అమెరికన్ వలసలన్నింట్లోనూ అమలు చేయవలసిన చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంట్‌కు 1766లో దత్తం చేసింది.ఇరవయ్యేండ్లపాటు సాగిన విప్లవ పరిణామాల నేపథ్యంలో, పకడ్బందీగా రాజ్యాంగ చట్టం రూపొందించే నిమిత్తం యానాపొలిస్లో ఏర్పాటు చేసిన కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్ 1786లో జరిగింది. అమెరికాలో కట్టుదిట్టమైన ఫెడరల్ పాలన మొదలు కావడానికి అదే మొదటిమెట్టు!
ఈ విప్లవాత్మక దశ పొడవునా, నానాపాట్లూ పడిన దక్షిణ అమెరికా ప్రజానీకం ‘ఎక్కడికెళ్తోందీ దేశం, ఏమైపోతోందీ?’ అని దిగ్భ్రమ చెందుతూనే ఉంది. దీనిని కథాంశంగా ఎన్నుకున్న రచయిత ఓ గుండెలు తీసిన బంటయి ఉంటాడనడంలో సందేహం లేదు! జర్మన్ జానపద గాథల ప్రేరణతో, ఓ చారిత్రకాంశాన్ని సమ్మిళితం చేసి, ప్రతీకాత్మకంగా చెప్పిన కథానిక ఇది.
సర్వసాధారణంగా కథానిక ఇతివృత్తం వాస్తవికంగా మొదలై, పాత్రలూ సంఘటనల పరంపర సాగుతుండగా సంఘర్షణ తలెత్తి, అది పతాక సన్నివేశానికి చేరి, అక్కడి నుంచి క్రమంగా ముగిసిపోవాలి. అయితే, కథానికలన్నీ మానవ జీవిత కథల మాదిరిగా మధ్యలోనే మొదలవుతాయి, మధ్యలోనే అంతమవుతాయి. ఈ ప్రక్రియ గురించి ఇప్పుడు మనకున్నంత స్పష్టత ‘రిప్’ కథ రాసే కాలానికి వాషింగ్టన్ ఇర్వింగ్‌కు లేదు! ఎందుకంటే, ఆ కథ 1819లో రాశాడాయన.
ఇర్వింగ్ విశిష్టత ఎక్కడుందంటే, ఈ కథను ఓ వ్యక్తి చరిత్రగా కాకుండా, కొన్ని జనజాతుల రాజకీయ చరిత్రగా రాశాడు. సామాన్య పాఠకులకు వినోదం కలిగించే రీతిలోనూ, ఊహాతీతమైన కల్పనలతోనూ దానిని గొప్ప కళాఖండంగా తీర్చిదిద్దాడు! ఇర్వింగ్ రాసిన ‘పరాకు లోవ కథనం’ (ద లెజెండ్ ఆఫ్ ద స్లీపీ హాలో) లాంటి రచనల్లో కడుపు పగిలే హాస్య, శృంగార, భయానకాది రసాల సమ్మేళనాన్ని అమెరికన్ వాసన దుమ్మెత్తించే జానపద గాథలో కలపడంలో రచయిత ప్రదర్శించిన కళాత్మకత అసమానం, అనుపమానం! ఆయనలా చేశాడు కనుకనే నూరేండ్ల తర్వాత కూడా మనం దానిని చర్చించుకుంటున్నాం! ఆధునిక అమెరికన్ కథానిక ఇలాంటి మిశ్రమాల నుంచే రూపుదిద్దుకున్నది. కావాలంటే, ఇర్వింగ్ తర్వాతి కాలపు రచయితలు ఎడ్గార్ ఆలన్ పో లాంటివాళ్లు రాసిన కథానికలు చూడండి.
-మందలపర్తి కిశోర్
81796 91822