కొండాపూర్, మే 28 : నెల రోజులుగా ఓ వ్యక్తికి చికిత్స పేరుతో కుటుంబ సభ్యుల నుంచి లక్షల్లో వసూళ్లు చేసిన వైద్యులు, చివరకు రోగి పరిస్థితి విషమంగా ఉందంటూ చేతులెత్తేశారు. మదీనగూడలోని అర్చన దవాఖానలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దాంతో, సదరు దవాఖాన తీరుపై రోగి కుటుంబసభ్యులు రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం అర్చన ఆస్పత్రిలో రోగికి అందించిన చికిత్స వివరాలపై ఆరా తీశారు.
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం మనియార్‌పల్లి గ్రామానికి చెందిన సంతోష్(32)కు పురుషాంగం వద్ద చిన్న గడ్డ అవ్వడంతో చందానగర్‌లోని చెన్నారెడ్డి దవాఖానకు వచ్చారు. అక్కడి డాక్టర్లు సర్జరీ చేసి ఆ గడ్డను తొలగించారు. రెగ్యులర్ చెకప్ కోసం రెండు రోజుల తర్వాత దవాఖానకు వస్తే క్రియాటిన్ ఎక్కువగా ఉందని.. వెంటనే మదీనగూడలోని అర్చన ఆస్పత్రిలో చేరాలని సూచించారు. దాంతో, కుటుంబసభ్యులు సంతోష్‌ను ఏప్రిల్ 14వ తేదిన అర్చన దవాఖానలో చేర్చారు. అక్కడ డాక్టర్ వెంకటేశ్వర్రావు కట్టా పర్యవేక్షణలో సంతోష్‌కు క్రియాటిన్ ఎక్కువగా ఉందని డయాలసిస్ చేపట్టారు.
క్రియాటిన్ ప్రభావం గుండె, ఊపిరితిత్తులపై పడి ఇన్ఫెక్షన్ అయ్యిందని చెప్పి చికిత్స పేరిట రూ.15 లక్షల వరకు డబ్బులు కట్టించుకున్నారు. చివరకు.. సంతోష్ పరిస్థితి విషమంగా ఉందని, రెండు రోజులుగా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందజేస్తున్నామని అర్చన ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు సంతోష్ భార్య రజిత తెలిపారు. చికిత్స కోసం మరింత డబ్బు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని దవఖాన యాజమాన్యం తీరుపై ఆమె మండిపడ్డారు.
సంతోష్‌కు చికిత్స పేరుతో ఇప్పటికే రూ.145 లక్షలు కట్టించుకొని ఇప్పుడేమో విషమంగా ఉందని యాజమాన్యం చేతులెత్తేసిందని రజిత మండిపడ్డారు. దవాఖాన తీరుపై బంధువులు రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డిఎంహెచ్‌ఎ డాక్టర్ పూర్ణిమ తన బృందంతో కలిసి అర్చన ఆస్పత్రికి వచ్చి.. సంతోష్‌కు అందించిన చికిత్సకు సంబంధించిన వివరాలను డాక్టర్ల నుంచి సేకరించారు. చికిత్స కోసం కుటుంబసభ్యులు కట్టిన బిల్లులపై ఆరా తీశారు. సమగ్ర విచారణ జరిపి దవాఖానపై చర్యలు తీసుకుంటామని పూర్ణిమ తెలిపారు. చికిత్స పేరుతో తమ నుంచి అర్చన ఆస్పత్రి అక్రమంగా వసూలు చేసిన డబ్బుల తిరిగి తిరిగి చెల్లించాలని సంతోష్ కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. మంచిగా ఉన్న వ్యక్తిని వివిధ చికిత్సల పేరుతో విషమ స్థితికి తీసుకువచ్చిన అర్చన దవాఖానపై, వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు ఆందోళన చేపట్టారు.