హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీలో ఇటీవల ప్రవేశపెట్టిన ‘మీ టికెట్’ మొబైల్ యాప్ చాలా రకాల స్మార్ట్ ఫోన్లలో సపోర్ట్ చేయడం లేదని, పూర్తిగా హైఎండ్ ఫోన్లలో మాత్రమే ఆ యాప్ ఓపెన్ అవుతున్నదని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆర్టీసీ ఇటీవల మీ-సేవా సహకారంతో ‘మీ టిక్కెట్’ యాప్‌ను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ పరిధిలో జారీచేసే సిటీ ఆర్డినరీ నెలవారీ పాస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్, మెట్రో డీలక్స్ పాస్, గ్రీన్ మెట్రో లగ్జరీ నెలవారీ పాస్, పుష్పక్ ఏసీ బస్ పాస్‌లతో పాటు, టీ24 టిక్కెట్లను ఈ యాప్ ద్వారా తీసుకోవచ్చు. కానీ, ‘మీ టికెట్’ యాప్ కేవలం హైఎండ్ ఫోన్లలో మాత్రమే ఓపెన్ అవుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, నెలవారీ పాస్‌ల కోసం మళ్లీ బస్టాండ్ల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని చాలా మంది ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో యూపీఐ చెల్లింపుల ద్వారా టికెట్లు పొందడంలోనూ సమస్యలు ఎదురవుతున్నాయని, చేతిలో నగదు లేకపోతే టికెట్లు పొందేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని ప్రయాణికులు వాపోతున్నారు. మొబైల్ సిగ్నల్స్ సరిగా లేకపోవడమే ఇందుకు కారణమని, ముఖ్యంగా హైదరాబాద్ సిటీ దాటిన వెంటనే యూపీఐ చెల్లింపులకు సిగ్నల్స్ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్తున్నారు. ఎయిర్టెల్ సిమ్ వాడుతున్న వినియోగదారులు ఎక్కువగా ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలిసింది.
ఆర్టీసీలో ఇటీవల డ్రైవర్ పోస్టుల భర్తీకి అభ్యర్థులు 6 అడుగుల ఎత్తు ఉండాలని నిబంధన పెట్టినట్టు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా రోడ్డు రవాణా సంస్థపై తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. మోటర్ వాహన చట్టం ప్రకారం డ్రైవర్ పోస్టుకు అభ్యర్థుల ఎత్తు 5.3 అడుగులు (160 సెంటీమీటర్లు) ఉంటే సరిపోతుందని స్పష్టం చేశారు. ‘మీ టికెట్’ యాప్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని, ఆ యాప్‌తో సహా ఆర్టీసీలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని తెలిపారు.