Urea Bags | తాండూర్, సెప్టెంబర్ 23 : నెలలు గడుస్తున్నా యూరియా బస్తా కోసం అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. తాండూర్ మండలవ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో యూరియా అవసరం పెరిగింది. దీంతో పలు గ్రామాల్లో మంగళవారం ఎరువుల దుకాణాలు, సొసైటీల వద్ద బారులు తీరారు. పరిమితంగానే యూరియా ఇవ్వడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాండూరు మండల కేంద్రంలోని కిష్టంపేట రైతువేదిక వద్ద ఉదయం నుంచి రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
యూరియా రావడంతో సమాచారం అందుకున్న రైతులు భారీగా తరలివచ్చి క్యూలైన్లో నిలబడ్డారు. సొసైటీకి వచ్చిన యూరియా బస్తాలు 260 మాత్రమే.. కానీ దాదాపు 1500 మందిపైనే రైతులు రైతు వేదిక వద్దకు రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు సైతం అక్కడికి చేరుకున్నారు. ఎట్లాంటి గొడవలు జరగకుండా అందరినీ క్యూ లైన్లో నిలబెట్టి యూరియా సక్రమంగా అందేలా చర్యలు తీసుకున్నారు.
గొర్లపల్లి పెంటమ్మకు అస్వస్థత..
కాగా కాసిపేట గ్రామానికి చెందిన గొర్లపల్లి పెంటమ్మ అనే మహిళ యూరియా కోసం లైనులో వేచి ఉన్న క్రమంలో జరిగిన తోపులాటలో అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెకు సపర్యలు చేయడంతో కోలుకున్నది. వ్యవసాయ అధికారులు మాత్రం ఈ రోజు స్టాకు ఉన్న మేరకు
260 యూరియా బస్తాలు కోసం ఉదయం రైతులకు టోకెన్లు ఇచ్చారు. వారికి మాత్రమే యూరియా బస్తాలు పంపిణీ చేశారు.
లైన్లో వేచి ఉండి టోకెన్ అందని మిగిలి ఉన్న రైతులతోపాటు నూతనంగా క్యూ కట్టి లైన్లో ఉన్న రైతులకు వచ్చే లోడ్ కోసం ఈ రోజు మధ్యాహ్నం నుంచి టోకెన్లు ఇవ్వడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. రెండు రోజుల్లో మళ్లీ యూరియా వస్తుందని తాండూర్ సీఐ దేవయ్య రైతులకు నచ్చచెప్పారు. సీఐ దేవయ్య వ్యవసాయ శాఖ జిల్లా ఇన్ఛార్జి ఏడీ సురేఖతో ఫోన్లో మాట్లాడారు.
రైతులు గ్రామాల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి మండల కేంద్రానికి తరలివచ్చి ఒకేచోట గుమిగూడి ఇబ్బందులు పడకుండా చూడాలని కోరడంతో స్పందించిన ఏడీ సురేఖ ఇక నుంచి మండలానికి వచ్చే యూరియా లోడ్లను గ్రామాల వారిగా రైతులకు టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఏడీ హామీ ఇచ్చారని సీఐ తెలిపారు.
Hyderabad Metro | మరోసారి ఆగిపోయిన మెట్రో రైలు.. ఆందోళనకు గురైన ప్రయాణికులు
Fire Accident | మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలో తప్పిన పెను ప్రమాదం
Harish Reddy | నెలరోజులైనా తెరచుకోని రామగుండం ఎరువుల కర్మాగారం: బీఆర్ఎస్ నేత హరీశ్ రెడ్డి