కుమ్రం భీం ఆసిఫాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంలో పోడు వ్యవసాయం చేస్తున్న రైతులపై అటవీ శాఖ అధికారులు అక్రమ కేసులు పెట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తోత్తులుగా అధికారులు పనిచేస్తున్నారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అధికారుల వేధింపులకు నిరసనగా ఆదిమ, గిరిజన భూరక్షణ పోరాట కమిటీ, రాజ్ గోండ్ సేవా సమితి, గోండ్వాన పంచాయతీ రాయి సెంటర్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి మద్దతు పలికారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. ఆదివాసీల కోసం జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో గిరిజన హక్కులు సాధించిన అమరజీవి కుమ్రం భీం పోరాటాన్ని గుర్తు చేశారు. ఆదివాసీ గ్రామాలకు రహదారి నిర్మాణం కోసం అటవీ శాఖ అధికారులు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసుల కోసం ఎప్పుడు అండగా ఉంటా అని, ఇప్పటికైనా అధికారులు స్వేచ్ఛగా గిరిజనుల హక్కులకు అడ్డు రాకుండా శాంతి యుతంగా ఉండాలన్నారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వివిధ గిరిజన పోరాట సమితి, సంఘాలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.