Navya Naveli Nanda | కుటుంబంనిండా సెలెబ్రిటీలే. అయినా గ్లామర్ ప్రపంచాన్ని పక్కనపెట్టి తన ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా అడుగేసింది నవ్యా నవేలీ నందా. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కూతురి కూతురు హోదాకే పరిమితం కాకుండా.. సమాజంలో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకుంది. మహిళల ఆరోగ్యం కోసం ‘ఆరా హెల్త్’ అనే సంస్థను స్థాపించింది. హైదరాబాద్‌కు చెందిన న్యారీ సంస్థతో కలిసి తెలంగాణలో అనేక కార్యక్రమాలు చేపట్టనున్నది. యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ వేదిక మీద నందా ముచ్చట్లు..
ఇంట్లో మొత్తం సినిమా వాతావరణమే ఉన్నా, చిన్నప్పటినుంచీ నాకు మాత్రం పెద్దగా ఆసక్తి లేదు. మనకు నచ్చిన పనినే కెరీర్‌గా ఎంచుకోవాలి. అప్పుడే, భవిష్యత్తు వైపు సంతృప్తిగా ప్రయాణిస్తాం. ముందునుంచీ నేను మహిళల హక్కులు, సాధికారత తదితర విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తాను. అందుకే ఈ దారిని ఎంచుకున్నా. ఒక మహిళగా తోటి మహిళలకు అండగా ఉండటం నా బాధ్యత కూడా. వ్యాపారం అంటే.. బాధ్యతతో కూడిన లాభాలు. ‘ఆరా హెల్త్’ అనేది మహిళల ఆరోగ్య సంరక్షణ వేదిక. మరో ముగ్గురు మహిళా ఆంత్రప్రెన్యూర్స్తో కలిసి ఈ సంస్థను స్థాపించాను. మా నలుగురిదీ భిన్నమైన నేపథ్యం. కానీ ఆలోచనలు మాత్రం ఒకేలా ఉంటాయి. సాధారణంగానే మహిళలకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ. కానీ చాలామంది తమ బాగోగులు పట్టించుకోరు. బయటికి మాట్లాడేందుకూ భయపడతారు. మహిళలకు వారి శరీరంపట్ల అవగాహన కల్పించి, సరైన పరిష్కార మార్గాన్ని చూపడం, తగిన ఉత్పత్తుల్ని అందించడమే మా లక్ష్యం.
ప్రారంభంలో ఏదైనా కష్టంగానే ఉంటుంది. ఏ రంగంలోనైనా ఎదురు దెబ్బలు సహజం. తట్టుకుని నిలబడగలిగితేనే అనుకున్నది సాధించగలం. ‘ఆరా హెల్త్’ను స్థాపించి రెండున్నర ఏండ్లు అవుతున్నది. దాదాపు 70 వేలమంది మహిళలు మా సంస్థలో భాగస్వాములు. అందరి సమష్టి కృషితోనే అనేక ఉత్పత్తులను అందించగలుగుతున్నాం. మహిళలకు ఉచిత న్యాయ సలహాలు, కౌన్సెలింగ్ ఇచ్చే న్యారీతో కలిసి పని చేయడం సంతోషకరమైన విషయం.
నా దృష్టిలో మహిళా సాధికారత అంటే.. ఎలాంటి ఒత్తిడీ లేకుండా నచ్చిన పని చేసుకుంటూ ఆనందంగా జీవించడమే. నేను ఒక కంపెనీ సీయీవోగా ఆలోచిస్తా. అదే సమయంలో భార్యగా, గృహిణిగా, తల్లిగా కూడా ఆలోచిస్తా. అందుకే మహిళలు తమకు నచ్చిన కెరీర్‌ను ఎంచుకుని, నచ్చిన విధంగా జీవించేందుకు ప్రోత్సహిస్తా. హైదరాబాద్‌కు ఇదే నా తొలి పర్యటన. హైదరాబాదీ బిర్యానీ తప్పకుండా రుచి చూస్తా. త్వరలోనే మళ్లీ వస్తా. మరికొంత సమయం కేటాయిస్తా.
Sai pallavi | వివాదాస్పద వ్యాఖ్యల కేసులో సినీనటి సాయిపల్లవి పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు