Surya Next Film Heroin | తమిళ హీరో సూర్య పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో. రజినీ, కమల్ తర్వాత తెలుగులో ఆ స్థాయి క్రేజ్ తెచ్చుకున్న నటుడు సూర్య. ‘గజిని’ సినిమాతో తెలుగు బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఎంటో నిరూపించాడు. అప్పట్లో తెలుగు స్టార్ హీరోల సినిమాకు వచ్చే కలెక్షన్లకు సమానంగా సూర్య డబ్బింగ్ సినిమాలకు వచ్చేవి. ఈయన సినిమాలకు తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు ఉండేది. థియేటర్లో సూర్య సినిమా విడుదలవుందంటే ఇక్కడ కూడా సందడి నెలకొనేది. అయితే గత కొంత కాలం నుండి ఈయన నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వడం లేదు.
‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమాలు తప్పితే ఈ మధ్య కాలంలో సూర్య నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. కాగా ఇవి రెండు ఓటీటీలోనే విడుదలయ్యాయి. కమర్షియల్‌గా ఈయన హిట్టు కొట్టి చాలా కాలమే అవుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య, విభిన్న చిత్రాల దర్శకుడు బాలా దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. దాదాపు 19ఏళ్ళ తర్వాత వీళ్ళ కాంబోలో రెండవ సినిమా తెరకెక్కుతుంది. కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత సూర్య.. మాస్ డైరెక్టర్ శివతో సినిమా చేయనున్నాడు. శౌర్య, శంఖం, వివేకం, పెద్దన్న వంటి సినిమాలతో మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు శివ.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్గా పూజాహెగ్డే నటించనుందని టాక్. ఇప్పటికే మేకర్స్ పూజాను సంప్రదించగా.. కథ నచ్చడంతో తను కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.