Sugar test without Blood | దేశవ్యాప్తంగా దాదాపు ఎనిమిది కోట్లమంది మధుమేహ బాధితులు ఉన్నారు. వాళ్లంతా తమను తాము పరీక్షించుకునేందుకు, ఒంటికి తూట్లు పొడుచుకుంటూనే ఉన్నారు. బాల్యంలోనే మధుమేహం బారినపడితే అదో నరకమే! ఆ బాధను పంటి బిగువున భరించి విసిగి వేసారింది వర్షిత దువ్వూరి ( Varshitha Duvvuri ). వ్యాధిని ఎలాగూ వదిలించుకోలేం. కనీసం రక్త పరీక్షలనైనా తప్పించుకోవాలని అనుకుంది. ఆ వైపుగా అధ్యయనం ప్రారంభించింది. ప్రయోగాలు చేసింది. రక్తపు బొట్టు రాలకుండానే.. శరీరంలో చక్కెర స్థాయిని కనుగొనే సాంకేతికతను ఆవిష్కరించింది.
మధుమేహం కారణంగా గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఏడులక్షల మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా. ఈ ఉపద్రవానికి అడ్డుకట్ట వేయగల శక్తి తనకు లేకపోయినా, పరీక్షల పేరుతో ఒంటికి తూట్లు పెట్టే సూదిగాట్ల బాధ నుంచి అయినా విముక్తి కలిగించాలని భావించింది దువ్వూరి వర్షిత. ఆ అంతర్మథన ఫలితమే ‘ఈజీలైఫ్’ గ్లూకోమీటర్. హైదరాబాద్‌కు చెందిన వర్షిత బాల్యం నుంచే మధుమేహ బాధితురాలు. రోజూ సూదితో గుచ్చుకుని రక్తంలో మధుమేహ స్థాయిని తెలుసుకొనేది. చక్కెర రోగుల్లో ఓ పట్టాన రక్తం గడ్డకట్టదు. దీంతో ఐదారు రక్తపు చుక్కలు వృథా అయ్యేవి. మధుమేహ తీవ్రత పెరిగిన ప్రతిసారీ.. నిత్యం మూడు నాలుగుసార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఒకవైపు చేతివేళ్ల నొప్పి, మరోవైపు తొడ కండరాల నొప్పి. ఎలాగైనా ఈ సూదుల నరకానికి స్వస్తి పలకాలనుకుంది. ఐఐటీ సీటును వదిలేసుకుని మరీ బయో టెక్నాలజీ వైపు అడుగులు వేసింది. గ్లూకోమీటర్స్పై కొన్నాళ్లు ప్రయోగాలు చేసింది. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ విద్యార్థి విమల్ తారసపడ్డాడు. ఆ యువకుడితో తన ఆలోచనలు పంచుకుంది. ఇద్దరూ కలిసి ‘వివాలైఫ్ ఇన్నొవేషన్స్’ అనే స్టార్టప్ ప్రారంభించారు. తొలిదశలో ఎన్నో వైఫల్యాలు. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని ‘నాన్ ఇన్వేసివ్ గ్లూకోమీటర్’కు రూపం ఇచ్చారు. దీంతో చిన్న గాటు కూడా పడకుండానే మధుమేహ పరీక్ష చేసుకోవచ్చు.
ఇప్పటివరకూ రక్తంలో గ్లూకోజ్ పరిమాణాన్ని తెలుసుకోవడానికి ఎన్నో పరికరాలు వచ్చాయి. వాటిలో అప్డేటెడ్ వెర్షన్.. గ్లూకోమీటర్స్. వీటిని జేబులో పెట్టుకొని తీసుకెళ్లొచ్చు. కాకపోతే, ప్రతి పరీక్షకూ రక్తం చిందాల్సిందే. వర్షిత, విమల్ తయారుచేసిన గ్లూకోమీటర్ వీటన్నిటికంటే అత్యాధునికం. నొప్పి ఉండదు. బాధ తెలియదు. పరీక్ష సులభం. ఫలితాలు కచ్చితం. అందుకేనేమో దీనికి ‘ఈజీలైఫ్ గ్లూకో మీటర్’ అని పేరు పెట్టారు.
వర్షిత, విమల్ ఆవిష్కరించిన గ్లూకోమీటర్ మొబైల్ యాప్‌కు అనుసంధానమై ఉంటుంది. మొబైల్‌ను యూఎస్బీతో కనెక్ట్ చేసి, వేలిముద్ర వేస్తే చాలు.. క్షణాల్లో రక్తంలో చక్కెర స్థాయి తెలిసిపోతుంది. దాన్ని బట్టి.. ఎలాంటి ఆహార నియమాలు పాటించాలన్నది నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. తదుపరి పరీక్షలకు సంబంధించిన హెచ్చరికలూ వస్తుంటాయి. ఈ ఆవిష్కరణకు ‘ఎంపవర్ -2021’, యాక్సెలరేటింగ్ విమెన్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ పోటీలలో ద్వితీయస్థానం దక్కింది. ఇటీవల విమెన్ గ్లోబల్పిచ్ -2021 అవార్డును గెలుచుకుంది వర్షిత. నీతి ఆయోగ్ 2021 టాప్-9 హెల్త్‌కేర్ స్టార్టప్‌లలో స్థానం సంపాదించింది వివాలైఫ్ ఇన్నొవేషన్స్.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్లూకోమీటర్స్ ఖరీదైనవి. వాటికి ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుకే ‘ఈజీలైఫ్ గ్లూకోమీటర్’ను అందుబాటులోకి తీసుకురావాలన్నది వర్షిత, విమల్ ఆలోచన. అదే జరిగితే వ్యాధి నిర్ధారణ రంగంలో ఓ సంచలనమే. కాబట్టే, వివాలైఫ్ ఇన్నొవేషన్స్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు వరుసలు కట్టారు. ఇప్పటికే, లెన్స్‌కార్ట్ వ్యవస్థాపకుడు పీయూష్ బన్సాల్‌తో భారీ ఒప్పందం కుదిరింది. పీల్స్ గ్రూప్ వ్యవస్థాపక సీయీవో అనూప్ పిట్టల్, ప్రముఖ ఇన్వెస్టర్ భానుప్రకాశ్ కూడా పెట్టుబడులు పెట్టారు. విస్తరణకు, బ్రాండింగ్‌కు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ మెంటర్‌గానూ వ్యవహరిస్తున్నారు భానుప్రకాశ్. ఓ పెద్ద మార్పు వైపుగా ఇది తొలి అడుగు.
మా గ్లూకోమీటర్ వల్ల రోగులకు ఎంతో మేలు జరుగుతుంది. అతి త్వరలో దీన్ని మార్కెట్లో విడుదల చేస్తాం. రాబోయే రోజుల్లో గుండె, కండ్లు, శ్వాసకోశ వ్యవస్థ, క్యాన్సర్ పరీక్షలకు కూడా రక్తపుబొట్టు అవసరం లేని సాంకేతికతను అందిస్తాం. ఆ ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టాం. నా ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
– వర్షిత
…✍ డప్పు రవి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆస్ట్రేలియా స్థానిక ఎన్నికల్లో గెలిచిన తెలంగాణ ఆడబిడ్డ.. ఆమె విజయ రహస్యమిదే..
gauthami jeji | బొల్లి మచ్చలు ఉన్నాయని కుంగిపోలేదు.. మోడలింగ్‌లో అదరగొడుతుంది..
Keerthi priya | రైతన్నలకు అండగా సూర్యాపేట యువతి.. ఇంతకీ ఆమె ఏం చేస్తోందంటే..
nalli fashions | తాతల నుంచి చేస్తున్న చీరల వ్యాపారానికి ఈమె బ్రాండ్ క్రియేట్ చేసింది
Vijayalakshmi | చదివింది పదో తరగతే కానీ.. చేసేది కోట్ల బిజినెస్
Gray hair | చిన్నవయసులోనే తల నెరిసిన వారికి ఈమె ఓ ఇన్స్పిరేషన్.. ఎందుకంటే?