e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home జిందగీ Tokyo Olympics : ఈ ఏడుగురు వ‌నితల్లో స్వ‌ర్ణం తెచ్చేదెవ‌రో

Tokyo Olympics : ఈ ఏడుగురు వ‌నితల్లో స్వ‌ర్ణం తెచ్చేదెవ‌రో

సింధు ఈసారి స్వర్ణం గెలుస్తుందా?
మేరీకోమ్‌ మళ్లీ మెరుస్తుందా?
దీపా కర్మాకర్‌ త్రుటిలో చేజార్చుకున్న పతకాన్ని జిమ్నాస్ట్‌ ప్రణతి అందుకుంటుందా? షూటర్ల గురి కుదురుతుందా?

ఆర్చర్లు అచ్చెరువొందే ప్రతిభను కనబరుస్తారా?
ఎన్నో ప్రశ్నలు..! మరెన్నో ఆశలు..!!

నాలుగేండ్ల క్రీడా సంబురం ఏడాది ఆలస్యంగా మొదలైంది. 32వ ఒలింపిక్స్‌కు టోక్యో వేదికైంది. 130 కోట్ల మంది ఆకాంక్షలను మోసుకుంటూ జపాన్‌ చేరుకున్నారు భారతీయ క్రీడాకారులు. 18 విభాగాల్లో దాదాపు 120 మంది ఆటగాళ్లు తమ ప్రతిభను చాటనున్నారు. వీరిలో 53 మంది అతివలు అస్త్రశస్ర్తాలకు పదునుపెట్టి బరిలోకి దిగుతున్నారు. మునుపెన్నడూ లేనన్ని పతకాలు మనవాళ్లు కైవసం చేసుకోవాలని ఆశిద్దాం. మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాలని కోరుకుందాం. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లకు ఆల్‌ ది బెస్ట్‌.అందరూ ఆరితేరిన వారే! అయినా, పక్కాగా పతకం తెచ్చే సత్తా ఉన్న మేటి క్రీడాకారిణుల్లో కొందరి ప్రస్థానం ..

వెయిట్‌ లిఫ్టింగ్‌ ‘మణి’పూస

- Advertisement -

రియో ఒలింపిక్స్‌లో నిరాశపర్చిన సైఖోమ్‌ మీరాబాయి, ఆ తర్వాత బరిలోకి దిగిన ప్రతిసారీ విజయాన్ని అందుకుంది. వరుస విజయాలతో ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకుందీ మణిపూర్‌ మణిపూస. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున బరిలోకి దిగుతున్న ఏకైక వెయిట్‌ లిఫ్టర్‌ కూడా తనే. మీరాది మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాంగ్‌పోక్‌ కాక్చింగ్‌ అనే పల్లెటూరు. ఆరుగురు తోబుట్టువుల్లో ఆఖరి అమ్మాయి. చిన్నప్పటి నుంచీ ఆటల్లో ఆరితేరింది. స్కూల్‌డేస్‌ నుంచి ఆర్చర్‌ కాలన్నది కల. కానీ, చాను ఎనిమిదో తరగతిలో ఉండగా.. తన రాష్ర్టానికే చెందిన వెయిట్‌ లిఫ్టర్‌ కుంజరాణి దేవి విజయగాథను పాఠ్యపుస్తకాల్లో చదివింది. మర్నాటి నుంచే విల్లంబులు అటకెక్కించి బరువు లెత్తడం మొదలుపెట్టింది. అమ్మ ప్రోత్సాహంతో ఉత్సాహంగా శిక్షణ తీసుకుంది. తన బరువు పెరగకుండా ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ.. తను ఎత్తే బరువును మాత్రం పెంచుకుంటూ పోయింది. 2014 నుంచి నేటి వరకు మీరా బరువు 48 నుంచి 49 కిలోల మధ్యే ఉందంటే ఆ పరిశ్రమ ఎంతటిదో గుర్తించవచ్చు. 2018లో వెన్నునొప్పి మొదలైంది. అంతకుముందు అవలీలగా ఎత్తిన బరువులో సగం కూడా ఎత్తలేకపోయింది. తన కెరీర్‌ ఏమవుతుందో అన్న బెంగ పట్టుకుంది. పట్టుదలతో ప్రయత్నించింది. శారీరక సమస్యల నుంచి బయటపడింది. మళ్లీ పాత పటిమను సొంతం చేసుకుంది. 130 కోట్ల భారతీయుల ఆశలను, ఆకాంక్షలను భుజానికెత్తుకొని పతకం లక్ష్యంగా టోక్యో చేరుకుంది మీరా.

పతకంపైనే ‘గురి’

హర్యానాకు చెందిన మను భాకర్‌ వయసు 19 ఏండ్లు. మొదటిసారి ఒలింపిక్స్‌ బరిలోకి దిగుతున్నది. 10 మీటర్లు, 25 మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌ షూటింగ్‌లో గురి పెడుతున్నది. మను తన మనసులో ఉన్నది చేసేస్తుంది. దేని గురించీ పెద్దగా ఆలోచించదు, ఆరాటపడదు. పోరాటం ఒకటే తెలుసు ఆమెకు. ఫలితం సంగతి పట్టించుకోదు. ఈ మానసిక వైఖరే, తనకు లక్ష్యంపై చెదరని గురి కుదిరేలా చేసిందని అంటుందామె. పద్నాలుగేండ్లు వచ్చేవరకూ మను షూటింగ్‌ గురించి ఆలోచించింది లేదు. బాక్సింగ్‌, కరాటే, ఫుట్‌బాల్‌, స్కేటింగ్‌ ఇలా రకరకాల క్రీడల్లో ఆసక్తి కనబరిచేది. అనుకోకుండా షూటింగ్‌పై గురి కుదిరింది. నాటి నుంచి ఆమె పిస్టోల్‌ గురీ తప్పలేదు. వరుస ఈవెంట్లలో విజయాలు సాధిస్తూ దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకుంది. ‘నాకు షూటింగ్‌ అంటే చాలా ఇష్టం. ఎక్కడ షూటింగ్‌ జరిగినా వెళ్లడం, గురి చూడటం.. ఈ రెండే తెలుసు. ఏ విషయం గురించీ అతిగా ఆలోచించకపోవడమే నా ప్లస్‌ పాయింట్‌. బహుశా నా సక్సెస్‌కు ఇదే కారణం కావచ్చు’ అంటుంది మను. షూటింగ్‌ తర్వాత మనుకు ఇష్టమైంది సోషల్‌ మీడియా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు దాదాపు 50వేల మంది ఫాలోవర్లున్నారు. ఒలింపిక్స్‌ నేపథ్యంలో కొంతకాలంగా సోషల్‌ మీడియాకు విరామం ఇచ్చిన మను, శుభవార్తతో మళ్లీ తన ఫాలోవర్లను పలకరిస్తానని చెబుతున్నది.

మెరుపు కళ

ప్రణతి నాయక్‌ది పశ్చిమ్‌ బెంగాల్‌లోని మారుమూల గ్రామం. మిడ్నాపూర్‌ జిల్లా కర్‌కాయ్‌ అనే పల్లెటూళ్లో పుట్టింది. దిగువ మధ్యతరగతి కుటుంబం. తండ్రి శ్రీమంత నాయక్‌ బస్సు డ్రైవర్‌. తల్లి ప్రతిభాదేవి గృహిణి. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. వారిలో ఒకరు ప్రణతి. చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుగ్గా ఉండేది. కూతురు ఆసక్తిని గమనించి తల్లిదండ్రులూ ప్రోత్సహించారు. ఆ పల్లెలోనే ఉండిపోతే తన కూతురికి భవిష్యత్తు ఉండదని భావించాడు తండ్రి. కోల్‌కతాకు తీసుకెళ్లి జిమ్నాస్టిక్స్‌ క్లబ్‌లో చేర్పించాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూతురి శిక్షణకు ఆటంకం రాకుండా చూసుకున్నాడు. కొన్నాళ్లకే ప్రణతి జిమ్నాస్టిక్స్‌లో మెరుపు తీగలా విన్యాసాలు చేయడం మొదలుపెట్టింది. జిల్లా, రాష్ట్రస్థాయిలో పతకాల పంట పండించింది. 2013లో జాతీయ స్థాయిలో బంగారు పతకం గెలుచుకుంది. 2019 ఆసియన్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. తర్వాత కొవిడ్‌ కారణంగా ఎలాంటి మెగా ఈవెంట్లూ సాగకపోవడంతో ఒలింపిక్స్‌ క్వాలిఫైయింగ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. 2019 ఆసియన్‌ చాంపియన్‌షిప్‌ ఫలితం ఆధారంగా టోక్యో ఒలింపిక్స్‌లో బెర్త్‌ కన్‌ఫర్మ్‌ చేసుకుంది ప్రణతి. ‘నాకు ఎనిమిదేండ్లు ఉన్నప్పుడు నాన్న నన్ను కోల్‌కతాకు తీసుకొచ్చారు. నాకోసం మా కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. ఈ క్రీడలో నన్ను ఉన్నతంగా తీర్చిదిద్దిన గురువు లఖన్‌ శర్మ రుణం తీర్చుకోలేను. ఇప్పుడు నాకు 26 ఏండ్లు. కోల్‌కతాకు వచ్చిన నాటి నుంచి గత ఏడాది లాక్‌డౌన్‌ వరకు .. మా ఊరికెళ్లి అమ్మ దగ్గర వరుసగా 20 రోజులు ఎప్పుడూ ఉన్నది లేదు. ఏండ్లుగా పడుతున్న శ్రమకు తగిన ఫలితం అందుకునే సమయం వచ్చింది. ఒలింపిక్స్‌లో పతకం గెలువడమే ధ్యేయంగా టోక్యోలో అడుగుపెట్టాను. అమ్మానాన్నల ఆశీర్వాదంతో ఘన విజయం సాధిస్తాననే నమ్మకం ఉంద’ని చెప్పుకొచ్చింది ప్రణతి.

పవర్‌ పంచ్‌

హర్యానాకు చెందిన పూజాకు పద్దెనిమిదేండ్లు వచ్చేదాకా బాక్సింగ్‌లో ఓనమాలు కూడా తెలియవు. కళాశాలలో ఒక అధ్యాపకుడి భార్య ఒత్తిడి మేరకు బాక్సింగ్‌ గ్లోవ్స్‌ మొదటిసారి ధరించింది. తొలిసారి రింగ్‌లోకి వెళ్లింది. తొలి పంచ్‌ విసిరింది. తన పవర్‌ ఏంటో అప్పుడుగానీ తెలిసి రాలేదు. తక్షణం బాక్సింగ్‌తో ప్రేమలో పడింది పూజా. బాక్సింగ్‌ క్వీన్‌ అనిపించుకోవాలని అక్కడికక్కడ నిర్ణయించుకుంది. అదే మాట చెబితే ససేమిరా అన్నారు తల్లిదండ్రులు. దూకుడైన ఆట కావడంతో కూతురికి గాయాలవుతాయని వారి భయం. అయితే, ఇంట్లో చెప్పకుండా శిక్షణ తీసుకుంది పూజా. జూనియర్‌ పోటీల్లో పతకం గెలిచింది. విషయం ఇంట్లోవాళ్లకు తెలిసింది. కూతురి పట్టుదల అర్థమైంది. మద్దతివ్వక తప్పలేదు. అనతికాలంలోనే ఆటపై పట్టు సాధించింది పూజా. 2012 ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం, 2015లో కాంస్యం గెలుచుకుంది. అయితే, తీవ్ర గాయాలు ఆమె కెరీర్‌కు అడ్డుగా నిలిచాయి. దాదాపు ఏడాదిన్నరపాటు గాయాలతో సతమతమైంది. మళ్లీ పుంజుకొని 2019లో ఆసియన్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకం సాధించింది. 2021 ఆసియన్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లోనూ పసిడి పతకం అందుకున్న పూజా, టోక్యోలో విజయ
దుందుభి మోగిస్తుందని అంచనా వేస్తున్నారు.

‘స్వ‌ర్ణ’ సింధుగా రావమ్మా!

పి.వి.సింధు, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి మిషన్‌ టోక్యో.. తెలుగుతేజం సింధు నిర్దేశించుకున్న లక్ష్యమిది. ఇందుకోసం కొన్ని నెలలుగా అవిశ్రాంతంగా సాధన చేస్తున్నది. కొత్త కోచ్‌ సారథ్యంలో ఆటపై మరింత పట్టు సాధించానని చెబుతున్నది సింధు. ఐదేండ్ల కిందట రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి అందరి నీరాజనాలు అందుకున్న సింధు పసిడి పతకమే ధ్యేయంగా టోక్యోకు ప్రయాణమైంది. ఈసారి కూడా సింధు పతకం గెలిస్తే, సింగిల్‌ ఈవెంట్స్‌లో వరుస ఒలింపిక్‌ మెడల్స్‌ సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఖ్యాతి గడిస్తుంది. ఇంతకు ముందు ఈ ఘనతను రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ సాధించాడు. తన పోరాటం రికార్డుల కోసం కాదంటున్నది సింధు. కరోనా కారణంగా మేజర్‌ ఈవెంట్లు రద్దయి పోటీలకు దూరంగా ఉంటున్నా ఆమె ప్రాక్టిస్‌ ఆపలేదు. రెండేండ్లలో సింధు ర్యాంకింగ్‌ ఐదు నుంచి ఏడుకు పడిపోయింది. అయినా, మునుపెన్నడూ లేనంత ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నది. ప్రాక్టిస్‌లో భాగంగా ఏకకాలంలో ఇద్దరేసి ఆటగాళ్లతో తలపడి మరింత రాటుదేలింది. ‘2018 వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలువడం, 2019 అదే టోర్నీలో చాంపియన్‌గా నిలబడటం.. నా దృక్పథాన్ని మార్చాయి. ప్రతి మ్యాచ్‌నూ ఫైనల్‌గా భావించి ఆడుతాను. అన్నిటినీ మించి టోక్యోలో ఫలితం గురించి ఆలోచించకుండా మెరుగైన ఆట ప్రదర్శిస్తాను’ అని చెప్పుకొచ్చింది సింధు. ఈ ఆరడుగుల రాకెట్‌ ఈసారి ‘ఫైనల్‌ ఫోబియా’ను అధిగమించి స్వర్ణ సింధుగా తిరిగి రావాలని ఆకాంక్షిద్దాం.

పదునైన ‘కత్తి’

మన దేశం నుంచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి ఫెన్సర్‌గా రికార్డు సాధించింది భవానీ దేవి. చెన్నైకి చెందిన 27 ఏండ్ల భవాని విద్యాభ్యాసం సర్కారు బడిలో సాగింది. ప్రభుత్వం ప్రారంభించిన ‘స్పోర్ట్స్‌ ఇన్‌ స్కూల్‌’ కార్యక్రమంలో భాగంగా కత్తుల విన్యాసంలో పట్టు సాధించింది. రాష్ట్ర, జాతీయస్థాయి ఈవెంట్లలో మెరుగైన ప్రతిభను కనబరుస్తూ ఒలింపిక్స్‌కు చేరుకుంది. భవానీది నిరుపేద కుటుంబం. తండ్రి ఆనంద సుందరమ్‌ గుడి పూజారి. తల్లి రమణి గృహిణి. ఐదుగురు సంతానంలో భవాని ఒకరు. ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా, కూతురిని క్రీడాకారిణిగా చూడాలని భావించింది ఆమె తల్లి. బిడ్డకు ఫెన్సింగ్‌ కిట్‌ కొనివ్వడానికి తన నగలు అమ్మింది. అలా తల్లి ప్రోత్సాహంతో భవాని ముందడుగు వేసింది. 2014లో జరిగిన సబ్‌ జూనియర్‌ నేషనల్‌ చాంపియన్‌షిప్‌లో మొదటిసారి గోల్డ్‌ మెడల్‌ సాధించింది. 2017 ఐస్‌లాండ్‌లో జరిగిన ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం కొల్లగొట్టింది. 2019లో కామన్‌వెల్త్‌ ఫెన్సింగ్‌ క్రీడల్లోనూ స్వర్ణపతకాన్ని ముద్దాడింది. ఈ పోటీల్లో పాల్గొంటున్న తరుణంలోనే భవాని తండ్రి కన్నుమూశారు. తండ్రి పోయాడన్న కొండంత బాధలోనూ పోరాడి విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌ కోసం గత మార్చిలో హంగేరీకి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయానికి తల్లి కొవిడ్‌తో ఐసీయూలో ఉంది. మ్యాచ్‌ వదులుకొని తల్లి దగ్గరే ఉండాలనుకుంది భవాని. కానీ, ఆ తల్లి కూతురికి ధైర్యం చెప్పింది. ‘నేను వైరస్‌ను గెలుస్తా.. నువ్వు ఆటలో గెలువు’ అని కూతురిని సాగనంపింది. క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌లో విజయకేతనం ఎగురవేసి ఒలింపిక్స్‌ బెర్త్‌ పక్కా చేసుకుంది భవాని. ఈ ఫెన్సర్‌ స్వర్ణ పతకంతో తిరిగి రావాలని కోరుకుందాం.

షూట్‌ ఎట్‌ సైట్‌

టోక్యోకు వెళ్లిన రైఫిల్‌ షూటర్స్‌ టీమ్‌లో పదిహేను మంది ఉన్నారు. అయినా, అందరి కండ్లూ 22 ఏండ్ల ఎలావెనిల్‌ వలరివాన్‌పైనే. మొదటిసారి ఒలింపిక్స్‌కు వెళ్తున్న ఈమె
పతకంతోనే తిరిగొస్తుందని భారీ అంచనాలు ఉన్నాయి. తమిళనాడులోని కడలూరు పట్టణంలో పుట్టింది ఎలావెనిల్‌. తండ్రి శాస్త్రవేత్త, తల్లి ఉపాధ్యాయురాలు. ఎలావెనిల్‌కు మూడేండ్లు ఉన్నప్పుడే వారి కుటుంబం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో స్థిర పడింది. చిన్నప్పుడు చదువు తప్ప వేరే వ్యాపకం ఉండేది కాదామెకు. తండ్రిలా శాస్త్రవేత్తగా ఎదగాలని కోరుకునేది. కానీ, తండ్రి స్నేహితుడి కూతురు రైఫిల్‌ షూటర్‌. ఆమెతో పరిచయం ఎలావెనిల్‌ మార్గాన్ని పూర్తిగా మార్చేసింది. తనతో షూటింగ్‌ ప్రాక్టిస్‌కు వెళ్లేది. ఆమె దగ్గర అదనంగా ఉన్న రైఫిల్‌ తీసుకొని తనూ గురి చూడటం మొదలుపెట్టింది. మొదట్లో గమ్మత్తుగా అనిపించింది. నాలుగు రోజులయ్యాక షూటింగ్‌ ఆమెను మత్తులా ఆవహించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహమూ తోడవ్వడంతో నిరంతరం సాధనలోనే ఉండేది. ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత గగన్‌ నారంగ్‌ గురువుగా లభించిన తర్వాత, ఎలావెనిల్‌కు లక్ష్యంపై స్పష్టమైన గురి ఏర్పడింది. శాస్త్రవేత్త కావాలన్న కోరికను పక్కనపెట్టి, క్రీడా కారిణిగా మారింది. సైన్స్‌ గ్రూప్‌ను వదిలి డిగ్రీలో ఆర్ట్స్‌ ఎంచుకుంది. ఆటపై పూర్తి పట్టు సాధించాక ఏ ఈవెంట్‌కు వెళ్లినా పతకంతో తిరిగొచ్చేది. 13 ఏండ్ల వయసులో తొలి పతకం సాధించింది. జాతీయస్థాయి పోటీల్లోనూ పతకాలు కొల్లగొట్టింది. 2018లో జరిగిన జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో బంగారు పతకం సాధించింది. 2019లో అంతర్జాతీయ షూటింగ్‌లోనూ పసిడి పతకాన్ని ముద్దాడింది. టోక్యోలో సైతం విజయం సాధిస్తానని చెబుతున్నది ఎలావెనిల్‌. తన విజయాన్ని భారత సైన్యంలో కెప్టెన్‌గా సేవలందిస్తున్న సోదరుడికి కానుకగా ఇస్తానని అంటున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

Tokyo Olympics: టోక్యోలో రోడ్ల‌పై బ‌తుకీడుస్తున్న వాళ్ల‌ను వెళ్ల‌గొట్టిన నిర్వాహ‌కులు

టోక్యో ఒలింపిక్స్ ఖ‌ర్చు ఎంత‌? జ‌పాన్ ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేల‌వుతుందా?

Tokyo Olympics: త‌మ్ముడి కోసం అన్న త్యాగం.. బాక్సర్ అమిత్ ఇన్‌స్పైరింగ్ స్టోరీ

టోక్యో ఒలింపిక్స్‌లో టీమిండియా.. వీటిలో మెడ‌ల్స్ ప‌క్కా

ఆమె ఇప్ప‌టికీ జీవించి ఉన్న ఓల్డెస్ట్ ఒలింపిక్ చాంపియ‌న్‌.. ఎవ‌రామె? వ‌య‌సెంత‌?

రేవ‌తి వీర‌మ‌ణి.. ఒలింపిక్స్‌కు వెళ్తున్న ఈ వీర వ‌నిత స్టోరీ చ‌దివి తీరాల్సిందే!

Tokyo Olympics: చ‌రిత్ర సృష్టించ‌నున్న 12 ఏళ్ల సిరియా ఒలింపియ‌న్‌

okyo Olympics: ఫిజియో థెర‌పిస్ట్ కావాల‌ని అడ‌గ‌డం కూడా నేర‌మేనా?: వినేష్ పోగాట్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana