e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home News రేవ‌తి వీర‌మ‌ణి.. ఒలింపిక్స్‌కు వెళ్తున్న ఈ వీర వ‌నిత స్టోరీ చ‌దివి తీరాల్సిందే!

రేవ‌తి వీర‌మ‌ణి.. ఒలింపిక్స్‌కు వెళ్తున్న ఈ వీర వ‌నిత స్టోరీ చ‌దివి తీరాల్సిందే!

రేవ‌తి వీర‌మ‌ణి.. ఒలింపిక్స్‌కు వెళ్తున్న ఈ వీర వ‌నిత స్టోరీ చ‌దివి తీరాల్సిందే!

చెన్నై: క‌ల‌లు అంద‌రూ కంటారు. కానీ కొంద‌రే ఆ క‌ల‌ల‌ను సాకారం చేసుకుంటారు. ఓ అమ్మాయి.. అందులోనూ ఏడేళ్ల‌కే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయింది.. ఓ వ్య‌వ‌సాయ కూలీ అయిన నాన్న‌మ్మ ద‌గ్గ‌ర పెరిగింది. క‌నీసం క‌ల‌లు క‌నే సాహ‌సం కూడా చేయ‌లేని ద‌య‌నీయ ప‌రిస్థితులు. జ‌త బూట్లు కొనే స్థోమ‌త లేక ఉత్త‌ కాళ్ల‌తో ప‌రుగు పెట్టింది. ఇప్పుడా ప‌రుగు ఒలింపిక్స్‌కు చేరింది. ఇండియా త‌ర‌ఫున 4×400 మీట‌ర్ల మిక్స్‌డ్ రిలే టీమ్‌లో పార్టిసిపేట్ చేస్తున్న‌ త‌మిళ‌నాడుకు చెందిన వీర వనిత రేవ‌తి వీర‌మ‌ణి స‌క్సెస్ స్టోరీ ఇది.

ఏడేళ్ల‌కే అనాథ‌గా మారి..

- Advertisement -

ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించానన్న వార్త విన‌గానే నాకు ఏమీ తోచ‌లేదు. ఆ స‌మ‌యంలో నా క‌ష్టాల జీవ‌న ప్ర‌యాణ‌మంతా నా క‌ళ్ల ముందు క‌ద‌లాడింది అని రేవ‌తి చెబుతోంది. నిజ‌మే మ‌రి.. ఆమె బాల్యం గురించి తెలిసిన వాళ్లెవ‌రూ ఆమె ఈ స్థాయికి చేరుతుంద‌ని ఊహించి ఉండ‌రు. ఏడేళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి అనాథ‌గా మారింది. ఆమెను కూలీనాలీ చేసుకుంటూ నాన్న‌మ్మ ఆర‌మ్మ‌ల్ పెంచింది. చిన్న వ‌య‌సులో ప‌రుగుపై ఆస‌క్తి పెంచుకుంది. కానీ బూట్లు కొనే స్థోమ‌త లేక ఉత్త కాళ్ల‌తోనే ప‌రుగెత్త‌డం ప్రారంభించింది.

తెర‌వెనుక హీరో

ప్ర‌తి స‌క్సెస్ స్టోరీలో తెర వెనుక పాత్ర ఒక‌టి ఉంటుంది. రేవ‌తి విష‌యంలో ఆ పాత్ర పోషించారు ఆమె కోచ్ కే క‌న్న‌న్‌. ఈయ‌న మ‌ధురైలోని స్పోర్ట్స్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆఫ్ త‌మిళ‌నాడులో కోచ్‌గా చేస్తున్నారు. 2014లో మ‌ధురైలోని ఎంజీఆర్ రేస్ కోర్స్ స్టేడియంలో జ‌రిగిన ఈవెంట్‌కు ఆయ‌న వ‌చ్చారు. ఆ రేసులో రేవ‌తిని తొలిసారి చూశారు. ఆమె రేసు గెల‌వ‌క‌పోయినా.. రేవ‌తిలోని మెరుపు వేగాన్ని గ‌మ‌నించారు.

అప్పుడు రేవ‌తికి 17 ఏళ్ల వ‌య‌సు. ఈ మ‌ట్టిలో మాణిక్యాన్ని సాన‌బెడితే మంచి వ‌జ్ర‌మ‌వుతుంద‌ని అప్పుడే క‌న్న‌న్ భావించారు. ఇదే విష‌యాన్ని ఆమె నాన్న‌మ్మ‌కు చెప్పారు. కానీ ఆమె మాత్రం అందుకు నిరాక‌రించింది. స్పోర్ట్స్ ప్రొఫెష‌న‌ల్ కోచింగ్ అంటే చాలా ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. మాతో అయ్యేది కాద‌ని తేల్చి చెప్పింది. అయినా ఆయ‌న ప‌ట్టు వ‌ద‌ల‌కుండా ప్ర‌య‌త్నించారు. చివ‌రికి ఆమె అంగీక‌రించ‌క త‌ప్ప‌లేదు.

ఉచితంగా కోచింగ్‌

రేవ‌తి ప‌రిస్థితేంటో క‌న్న‌న్‌కు బాగా తెలుసు. అందుకే ఆమెకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వ‌డానికి అంగీక‌రించారు. ప్ర‌తి రోజూ ఇంటి నుంచి ట్రైనింగ్ సెంట‌ర్‌కు రావ‌డానికి బ‌స్సుకు అయ్యే ఛార్జీలు రూ.40 కూడా భ‌రించారు. ర‌న్నింగ్‌కు క‌చ్చితంగా కావాల్సిన బూట్ల‌ను కొనిచ్చారు. ఉత్త కాళ్ల‌తో ప‌రుగెట్ట‌డం అల‌వాటున్న రేవ‌తికి ఆ బూట్లు వేసుకొని ప‌రుగెత్త‌డం మొద‌ట్లో క‌ష్ట‌మైంది. కానీ త‌ర్వాత ఎలాగోలా వాటితోనూ మెరుపు వేగంతో ప‌రుగెత్త‌డం ప్రారంభించింది.

2016లో ఆమె మొద‌టి స‌క్సెస్ చూసింది. కోయంబ‌త్తూర్‌లో జ‌రిగిన జూనియ‌ర్ నేష‌న‌ల్స్‌లో 100, 200, 4×100 మీట‌ర్ల రేసుల్లో గోల్డ్ మెడ‌ల్స్ గెలిచింది. ఇక అక్క‌డి నుంచి వెనుదిరిగి చూడ‌లేదు. అది చూసిన త‌ర్వాతే రేవ‌తి ఒలింపిక్స్‌కు వెళ్లే స‌త్తా ఉన్న అథ్లెట్ అని తాను భావించిన‌ట్లు కోచ్ క‌న్న‌న్ చెప్పారు. 2019 వర‌కూ క‌న్న‌న్ కోచింగ్‌లోనే రాటుదేలిన ఆమె.. ఆ త‌ర్వాత ప‌టియాలాలోని నేష‌న‌ల్ క్యాంప్‌కు వెళ్లింది.

అక్క‌డే 100, 200ల‌తోపాటు కోచ్ గలీనా బుకారినా ఆధ్వ‌ర్యంలో 400 మీట‌ర్ల‌పైనా ప‌ట్టు సాధించింది. 2019లో జ‌రిగిన ఇండియ‌న్ గ్రాండ్ ప్రి 5, 6ల‌లో రేవ‌తి 400 మీట‌ర్ల ఈవెంట్ల‌ను 54.44 సెక‌న్లు, 53.63 సెక‌న్ల‌లో పూర్తి చేసి గెలిచింది. ఇప్పుడు ఒలింపిక్స్ కోసం జ‌రిగిన చివ‌రి ట్ర‌య‌ల్స్‌లోనూ 4×400 మీట‌ర్ల రేసులో రేవ‌తే 53.55 సెక‌న్ల‌తో టాప్‌లో నిలిచింది. ప్ర‌స్తుతం ముధురైలో ద‌క్షిణ రైల్వేలో టికెట్ క‌లెక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్న ఆమె.. టోక్యో ఒలింపిక్స్‌లో ప‌త‌క‌మే ల‌క్ష్యంగా జ‌పాన్ విమానం ఎక్క‌బోతోంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రేవ‌తి వీర‌మ‌ణి.. ఒలింపిక్స్‌కు వెళ్తున్న ఈ వీర వ‌నిత స్టోరీ చ‌దివి తీరాల్సిందే!
రేవ‌తి వీర‌మ‌ణి.. ఒలింపిక్స్‌కు వెళ్తున్న ఈ వీర వ‌నిత స్టోరీ చ‌దివి తీరాల్సిందే!
రేవ‌తి వీర‌మ‌ణి.. ఒలింపిక్స్‌కు వెళ్తున్న ఈ వీర వ‌నిత స్టోరీ చ‌దివి తీరాల్సిందే!

ట్రెండింగ్‌

Advertisement