యాచారం, ఏప్రిల్ 17 : ఫార్మాసిటీ పరిహారంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అవినీతికి పాల్పడారని ఇటీవల ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి ఆరోపణలు చేయగా..వాటిని తిప్పికొడుతూ మండలంలోని మేడిపల్లిలో శుక్రవారం బహిరంగ చర్చావేదికలో పాల్గొంటానని.. దమ్ముంటే అక్కడికొచ్చి తనపై చేసిన అవినీతిని ప్రజల ముందు నిరూపించాలని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డికి బహిరంగ సవాల్ విసరడంతో శుక్రవారం ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొన్నది.
మేడిపల్లి గ్రామ పంచాయతీ వద్ద బహిరంగ చర్చావేదిక కోసం బీఆర్ఎస్ నాయకులు తెల్లవారుజామునే టెంట్, కుర్చీలను ఏర్పాటు చేయగా.. వాటిని హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీసులు తొలగించగా బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ సైదులు పర్యవేక్షణలో గ్రామంలో భారీగా మోహరించారు. ఒకపక్క బీఆర్ఎస్ శ్రేణులు మరోపక్క కాంగ్రెస్ నాయకులు గుమికూడారు. గ్రామంలోకి బీఆర్ఎస్ నాయకులు రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు, చర్చా వేదికలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా దిగడంతో గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.

ఇరు పార్టీల పరస్పర నినాదాలు
మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డిలను గ్రామంలోకి రాకుండా అడ్డుకునేందుకు మేడిపల్లి సర్పం చ్ భర్త సంపత్, మాజీ ఎంపీటీసీ శ్రీశైలం, ఉపసర్పంచ్ మధుకర్‌రెడ్డి తదితరులు కార్యకర్తలతో కలిసి చౌరస్తాలో తిష్ట వేశారు. మరోవైపు గ్రామంలోకి చేరుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు వస్తుండటంతో కాంగ్రెస్ నాయకు లు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మంచిరెడ్డి గో బ్యాక్ అం టూ నినాదాలు చేశారు. ప్రతీగా బీఆర్ఎస్ శ్రేణులు సైతం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వద్దురా నాయనా కాంగ్రెస్ పాలనా, మల్రెడ్డి డౌన్‌డౌన్, కాంగ్రెస్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేయడంతో పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. గ్రామంలో ఎప్పు డు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠత నెలకొన్నది.
యాచారంలో బీఆర్ఎస్ రాస్తారోకో
మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు. నాగార్జునసాగర్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మల్రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. మంచిరెడ్డిపై మోపిన అవినీతిని నిరూపించలేకనే అక్రమంగా అరెస్టు చేసినట్లు మండిపడ్డారు. పోలీసులు అధికార ఎమ్మెల్యేకు కొమ్ముకాస్తున్నారని దుయ్యబట్టారు.

బీఆర్ఎస్ నేతలపై పోలీసుల జులుం
గ్రామంలో ఒకచోట కాంగ్రెస్ నాయకులు మరో చోట బీఆర్ఎస్ నాయకులు పరస్పర నినాదాలు చేసుకుంటుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీఆర్ఎస్పై, మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టి బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పోలీసులు కర్కశత్వంగా వ్యవహరించడంతో బీఆర్ఎస్ కార్యకర్తల చొక్కాలు చిరగడంతోపాటు కొంతమందికి కాళ్లు చేతులకు స్వల్ప గాయాలయ్యాయి.
సహనం కోల్పోయిన కార్యకర్తలు పోలీస్ జులుం నశించాలి, పోలీస్ డౌన్ డౌన్ అంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రెచ్చిపోయి బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పాచ్ఛ భాష, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి వార్డు సభ్యుడు అనిల్, నాయకులు రమేశ్, నాగరాజు, మహేశ్, సాయికుమార్, సురేందర్‌రెడ్డి, కృష్ణ, ప్రవీణ్, కార్యకర్తలను ఈడ్చి పట్టి లాగి పోలీసు వ్యానులోకి బలవంతంగా ఎక్కించి మహేశ్వరం ఠాణాకు తరలించారు. కాంగ్రెస్ నాయకులనూ అరెస్టు చేయాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టడంతో వెంటనే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దర్నాకు దిగిన కాంగ్రెస్ నాయకులు సంపత్, శ్రీశైలం, మధుకర్‌రెడ్డి పాటు మరికొంత మందిని పోలీసులు అరెస్టు చేసి మాడ్గుల పీఎస్‌కు తరలించారు. కొందమంది కాంగ్రెస్ నాయకులను పీఎస్‌కు తరలించకుండానే మధ్యలోనే వదిలేసినట్లు సమాచారం.
రంగారెడ్డికి రాజకీయ సన్యాసం దగ్గరలోనే ఉన్నది..
చిల్లర రాజకీయాలు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు, వీధి వ్యాపారుల వద్ద చిల్లర ఏరుకునే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి రాజకీయ సన్యాసం తీసుకునే సమయం దగ్గరలోనే ఉన్నది. అధికారం లో ఉండి సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్లను గెలిపించుకోలేని దద్దమ్మ అని ఎద్దేవా చేశారు. ఆయన చిల్లర రాజకీయాలు ఇబ్రహీంపట్నంలో పనికి రావని హెచ్చరించారు. దమ్ములేక ఢిల్లీకి పారిపోయి పోలీసులతో ఇక్కడ సినిమా షో నడిపిస్తున్నాడని మండిపడ్డారు.
-క్యామ మల్లేశ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అరెస్టు

మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మేడిపల్లి వెళ్లేందుకు ఇబ్రహీంపట్నంలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి అధికంగా తరలివ చ్చారు. పోలీసులు అప్రమత్తమై కిషన్‌రెడ్డిని మేడిపల్లికి వెళ్లకుండా పార్టీ కార్యాలయంలోనే దిగ్బంధించారు. ఆయనతోపాటు క్యామ మల్లేశ్, సత్తు వెంకటరమణారెడ్డి, దండెం రాంరెడ్డి, ప్రతాప్‌రెడ్డిలను బయటికి వెళ్లకుం డా కట్టడి చేశారు. కాగా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకు డు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలతో మేడిపల్లికి చేరుకున్నారు. ఆయన వెంట యాచారం, మంచా ల, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, రాజూనాయక్, రాజేందర్‌రెడ్డి, స్వరూప, యాదయ్య, ఖాజు, జాని, శంకర్, చీరాల రమేశ్, శివకుమార్, శ్రీశైలం, యాదయ్యగౌడ్, గణేశ్, దాన య్య, బహదూర్, జగదీశ్, కిషన్‌నాయక్ వచ్చారు.
జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వెంటనే గ్రామపంచాయతీ వద్దకు వారు రాకుండా అడ్డుకున్నారు. మాపై అవినీతి ఆరోపణలు చేసిన మల్రెడ్డి దమ్ముంటే వచ్చి నిరూపించాలని ప్రశాంత్‌కుమార్‌రెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. గ్రామంలోకి వస్తున్న వారిని పాఠశాల సమీపంలో అడ్డుకోవడంతో పోలీసులు, నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొన్నది. బీఆర్ఎస్ నాయకులు గ్రామంలోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించడంతో పోలీసులు బలవంతంగా వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. ఒక్కొక్కరిని బలవంతంగా ఎత్తుకెళ్లి వ్యానులోకి ఎక్కించారు. ప్రశాంత్కుమార్రెడ్డిని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. తోపులాటలో ప్రశాంత్‌కుమార్‌రెడ్డికి స్వల్ప గాయాలైనట్టు బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.
బహిరంగంగా ఎదుర్కోలేకే అక్రమ అరెస్టులు
బహిరంగంగా బీఆర్ఎస్ నాయకులను ఎదుర్కొనే దమ్ములేకే.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీసులను తొత్తులుగా మార్చుకొని అక్రమంగా అరెస్టు చేశారు. గాంధీభవన్ వేదికగా అవినీతి ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే వాటిని నిరూపించేందుకు ఇక్కడికి ఎందు కు రాలేదని ప్రశ్నించారు. శాంతియుతంగా చర్చలో పాల్గొనేందుకు వస్తే పోలీసులు దౌర్జన్యంగా అడ్డుకొని అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం. పోలీసుల అక్రమ అరెస్టులు, బెదిరింపులకు భయపడేదేలేదు. వెంటనే ఫార్మాసిటీని రద్దు చేసి, సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇవ్వాలి. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలి. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఛీకొట్టినా మల్‌రెడ్డికి సిగ్గురాలేదు.
దమ్ములేక ఢిల్లీకి పారిపోయిండు..
సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నిస్తే ఈ ప్రాంత ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రెస్టేషన్‌కు పోయి అసత్యాలు మాట్లాడుతున్నారు. ఇబ్రహీంపట్నం ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. ఇక్కడ అలజడులు సృష్టించేందుకు చూస్తున్న అతడిపై ప్రజలు తిరగబడుతున్నారు. ప్రజాక్షేత్రంలో బహిరంగంగా సమాధానం చెప్పలేక ఢిల్లీకి పారిపోయాడని ఎద్దేవా చేశారు. మల్రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు వదిలిపెట్టేది లేదు.
-సత్తు వెంకటరమణారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్
చిల్లర రాజకీయాలు ఆపాలి

ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అసత్య ప్రచారాన్ని మానుకోకపోతే తిరుగబడే పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన్ను పోలీసులు ఫార్మాసిటీ బహిరంగ చర్చకు వెళ్లకుండా ఇబ్రహీంపట్నంలోని పార్టీ కార్యాలయంలోనే నిర్బంధించగా..అక్కడ ఆయన మాట్లాడుతూ..ఈనెల 12న గాం ధీభవన్ వేదికగా ఫార్మాసిటీ భూముల్లో అవకతవకలు జరిగాయని మీడియాలో సమావేశంలో మల్రెడ్డి ఆరోపించగా.. దానికి సవాల్‌గా శుక్రవారం మేడిపల్లిలో ఫార్మాసిటీ భూముల్లో జరిగిన అవకతవకలపై బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చామన్నారు.
ఈ బహిరంగ చర్చకు రాకుండా రాష్ట్రంలోనే లేకుండా పారిపోయి చిల్లర రాజకీయాలకు పాల్పడారని.. పోలీసుల ద్వారా తనను నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటివరకు సమయం ఇచ్చామని ఇకపై ఇబ్రహీంపట్నంలో అసత్య ప్రచారం, చిల్లర రాజకీయాలు మానుకోకపోతే సహించేది లేదని హెచ్చరించారు. ఇకనుంచైనా మల్రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఎన్ని నిర్బంధాలు చేసినా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ఉద్యమాలను కొనసాగిస్తూనే ఉంటుందన్నారు.