గ్రేటర్లో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతున్నది. నగరంలో ఎండలు ఠారెత్తడంతో నగరవాసులు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు రోజంతా వినియోగిస్తున్నారు. గురువారం అత్యధికంగా 99.33మెగాయూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. అంటే దాదాపు వంద మెగాయూనిట్లకు వినియోగం చేరడంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. గత సంవత్సరం ఇదే రోజున 80.90మెగాయూనిట్లు నమోదైనట్లు తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు ఇదే తరహాలో కొనసాగితే మరి కొద్దిరోజుల్లోనే 5వేల యూనిట్లు దాటుతుందని అధికారులు చెబుతున్నారు. ఒకవైపు ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు ఎలక్ట్రిక్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ కుక్కర్ల వాడకం కారణంగా మరింత వాడకం పెరుగుతున్నదని వారు పేర్కొన్నారు. ఈ నెల16న రాత్రి పది గంటలకు 4,674మెగావాట్ల డిమాండ్ నమోదైంది. గత సంవత్సరం ఇదే రోజున 3,830మెగావాట్ల డిమాండ్ నమోదైందని, ఈసారి 800మెగావాట్ల అత్యధిక డిమాండ్ నమోదైందని అధికారులు తెలిపారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ):గ్రేటర్లో డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు పెరిగాయి. పటాన్చెరు, అమీన్పూర్, జీడిమెట్ల, హబ్సిగూడ, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్‌లోడ్ పడుతోంది.రామంతాపూర్ ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్ దగ్గర రెండురోజుల క్రితం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ భారీ శబ్దంతో పేలింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో వచ్చి మంటలు ఆర్పేశారు.
ఇటీవల మియాపూర్ మార్తాండనగర్‌లో ట్రాన్స్ఫార్మర్ పేలి అగ్నిప్రమాదం సంభవించింది. అందులో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. ఇలా వరుస ఘటనలతో విద్యుత్ అధికారుల్లో టెన్షన్ నెలకొంది. ట్రాన్స్ఫార్మర్లు పేలడం వల్ల ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే కాకుండా పునరుద్ధరించడానికి చాలా సమయం పడుతున్నది. దీంతో వినియోగదారుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నదని, అయితే క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరాలో లోపాలు సవరించడానికి కావలసిన సామాగ్రి, సిబ్బంది లేకపోవడం కారణంగా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. మరోవైపు 1912 టోల్‌ఫ్రీ నెంబర్‌తో పాటు ఎక్స్ వేదికగా విద్యుత్ అంతరాయాలపై ఫిర్యాదులు వస్తున్నాయి.
పేలుతున్న ట్రాన్స్ఫార్మర్లు..
దక్షిణ డిస్కం సమ్మర్ యాక్షన్ ప్లాన్ చేసే ముందు ఈసారి 110 మెగా యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేసి అందుకు తగ్గట్లుగా ప్రణాళిక రూపొందించారు. అయితే ఏప్రిల్ మూడో వారంలోనే 100 మెగా యూనిట్లకు వినియోగం చేరడంతో సమ్మర్ ప్లాన్ సఫలం అయ్యే పరిస్థితి లేదు. ముఖ్యంగా వేసవి ప్రణాళికలో గత సంవత్సరం పెట్టిన పనులే పూర్తి చేయకపోగా, ఈసారి కూడా చాలా ముఖ్యమైన అధికలోడ్ను తట్టుకునే పనులు ముట్టుకోలేదు. కేవలం కొన్ని డీటీఆర్, పీటీఆర్లు ఏర్పాటు చేయడం మినహ సబ్స్టేషన్లపై ఒత్తిడి తగ్గించే విషయంలో అనుకున్న రీతిలో సామాగ్రి లేక పనులు మొదలేకాలేదు. ఈ ప్రభావం ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరిగి వినియోగం అదే స్థాయిలో పెరుగుతున్న క్రమంలో విద్యుత్ సరఫరాపై పడుతోంది. దీంతో ట్రాన్స్ఫార్మర్లు పేలుతున్నాయి, ఇన్సులేటర్లు, వైర్లు కరుగుతున్నాయి.
వీటిని మార్చేందుకు అవసరమైన పరిస్థితులు డిస్కం వద్ద లేవని, క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు పై అధికారులకు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని విద్యుత్ సిబ్బంది చెప్పారు. ప్రస్తుతం నగరంలో రోజురోజుకూ వినియోగం పెరుగుతున్న క్రమంలో అందుకు తగినట్లుగా ఏర్పాటు చేయడానికి అధికారుల క్షేత్రస్థాయి సందర్శనలు కూడా కేవలం తూతూమంత్రంగా సాగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ సమ్మర్ ప్లాన్ అమలును పట్టించుకోకపోవడంతో పాటు నగరంలో ఎక్కడైతే ఎక్కువ డిమాండ్ నమోదవుతుందో ఆ ఏరియాలో ఎటువంటి సమస్యలు వస్తున్నాయో విశ్లేషించడం లేదని, దీని మూలాన సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నదని, ఇదిలా ఉంటే భాగ్యనగరం అంధకారంగా మారే అవకాశముందని ఒక సీనియర్ విద్యుత్ అధికారి అభిప్రాయపడ్డారు.
