క్యూర్ పరిధిలో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ‘చట్టం’ అందరికీ సమానం అన్న సూత్రానికి విరుద్ధంగా సాగుతోంది.. సామాన్యుడు రోడ్డు పక్కన చిన్న డబ్బా పెట్టుకుంటే బుల్డోజర్లు దింపే అధికారులు, అదే ఫుట్‌పాత్‌ను పార్కింగ్ స్థలంగా మార్చుకున్న బడా వాణిజ్య సముదాయాల జోలికి వెళ్లడం లేదు..గడిచిన కొద్ది రోజులుగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు పేరుతో సాగుతున్న ‘స్పెషల్ డ్రైవ్’ చర్చనీయాంశంగా మారాయి. రోడ్డు పక్కన తోపుడు బండ్లు, చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుని జీవించే వారిపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ముందస్తు నోటీసులు లేకుండానే బుల్డోజర్లతో వారి సామాగ్రిని ధ్వంసం చేస్తూ సామాన్యుల ఉపాధిని దెబ్బ తీస్తున్నారు. కానీ అదే రహదారిపై భారీ విస్తీర్ణంలో ఉన్న వాణిజ్య సముదాలు (కమర్షియల్ కాంప్లెక్స్‌లు), మల్టీప్లెక్స్‌లు షోరూంల సంగతి వచ్చే సరికి అధికారుల వేగం మందగిస్తోంది. అనేక భవనాలు తమ సెల్లార్ పార్కింగ్‌ను గోదాములుగా మార్చుకుని కస్టమర్ల వాహనాలను ఫుట్‌పాత్‌లపైనే పార్కు చేయిస్తున్నా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు.బడా వ్యాపారుల వద్ద ‘చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న యంత్రాంగం, పేదలపై మాత్రం బుల్డోజర్లతో విరుచుకుపడుతుండడం వెనుక భారీ స్థాయి మామూళ్ల దందాతో కూడిన ద్వంద్వ నీతి ఉందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
నిర్ధ్దాక్షిణ్యంగా కూల్చండి: జీహెచ్ఎంసీ
రద్దీగా ఉండే రోడ్లు, నడక దారులను ఆక్రమించి అక్రమంగా వెలిసిన దుకాణాలు, నిర్మాణాలు, తోపుడు బండ్లను నిర్ధ్దాక్షిణ్యంగా తొలగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఫుట్ పాత్ ల ఆక్రమణలపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం ఈ మేరకు తాజా సర్యులర్ (నెం. 999/టీపీఎస్ /హెచ్ఓ /జీహెచ్ఎంసీ/ 2026/ 236) విడుదల చేసింది. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు మార్జిన్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తక్షణమే తొలగించి, ఫుట్ పాత్లను వాటి అసలు స్థితికి తీసుకురావాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అక్రమారులపై కఠినంగా వ్యవహరించాలని, భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలు జరగకుండా పటిష్ట నిఘా ఉంచాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.

సిటీబ్యూరో, ఏప్రిల్ 17 ( నమస్తే తెలంగాణ ) : పేదవాడికి ఒక రూల్ బడాబాబులకు మరో రూలా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి పక్షపాతం లేకుండా ఆక్రమణలన్నింటినీ తొలగించాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. పేదలపై బుల్డోజర్లను పంపిస్తూ.. మాముళ్ల మత్తులో బడా వ్యాపారస్తుల విషయంలో చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో పుట్‌పాత్ వ్యాపారులపై ట్రాఫిక్ పోలీసులు ఇటూ జీహెచ్ఎంసీ విభాగాలు విరుచుకుపడుతున్నాయి. అయితే అదే రీతిలో పలు వ్యాపార సంస్థలు సైతం పుట్‌పాత్‌లను ఆక్రమించి పాదచారులకు, వాహనాలకు ఇబ్బందులు కల్గించే విధంగా ఇబ్బందులు కల్గిస్తున్నా అలాంటి విషయంలో ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి వ్యాపార సంస్థల నుంచి కొందరు ట్రాఫిక్ పోలీసులు నెలవారి మాముళ్లు కూడా తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
పలు వ్యాపార సంస్థలు తమ దుకాణాలకు వచ్చే వినియోగదారులు వాహనాలు పార్కింగ్ చేసుకునే సౌకర్యాలు కల్పించడం లేదు, అలాంటి వారు రోడ్లపైనే వాహనాలు పార్కింగ్ చేస్తుంటారు. ఇదంతా ఒక ఎత్తయితే మరికొందరు ఏకంగా పుట్‌పాత్‌లను ఆక్రమించేసి పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. వీటికి తోడు మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి తమ దుకాణాల ముందున్న పుట్‌పాత్‌లపై ఏకంగా వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ప్రధానంగా చార్మినార్, గోల్కొండ, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి తదితర జోన్లలో ఈ పరిస్థితి ఉంది. రోజు వారి జీవనోపాధి కోసం పుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేసుకునే వారిపై విరుచుకుపడుతున్న ప్రభుత్వం యంత్రాంగం పుట్‌పాత్‌లను వ్యవస్థీకృతంగా ఆక్రమించుకొని వ్యాపారం చేసే వారిపై చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
పుట్‌పాత్ ఆక్రమణలు తొలగించాలి
పుట్‌పాత్‌లు నాలాలపై ఉన్న ఆక్రమణలను గుర్తించి వెంటనే తొలగించాలని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు.శుక్రవారం వెంకటాపురం డివిజన్ భూదేవినగర్‌లోని పుట్‌పాత్ ఆక్రమణలపై ఎంఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు.పుట్‌పాత్ రోడ్లు ఆక్రమించి ఇష్టానుసారంగా అక్రమంగా వేసిన షెడ్లతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న ఫిర్యాదులు వెలుత్తుతుండటంతో ట్రాఫిక్ సమస్యను ఎంఎంసీ అధికారులు పరిష్కరిస్తున్నామన్నారు, భూదేవినగర్ నుంచి లోతుకుంట రైల్వే బ్రిడ్జి వరకు ఇరువైపులా వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించారు. కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు,టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దుకాణాలపై పెటీ కేసులు
సాధారణంగా పుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకునే వారిపై రోజు వారి ఛలాన్లు వేస్తుంటారు, అలాగే కొన్ని చోట్ల అటూ క్షేత్ర స్థాయి ట్రాఫిక్ పోలీసులు అమ్యామ్యాలు తీసుకోవడంతో పాటు చిరు వ్యాపారుల వద్ద నుంచి సామాన్లు కూడా తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే బడా వ్యాపార సంస్థలు, ఓ మోస్తరు వ్యాపార సంస్థలు పుట్‌పాత్‌లు ఆక్రమించినా చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటారు. కొన్ని చోట్ల నెల వారి మామూళ్లు ఆయా వ్యాపార సంస్థల నుంచి తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని చోట్ల కొందరు రాజకీయ నాయకులు పుట్‌పాత్‌లను ఆక్రమించుకొని వ్యాపారాలను చేస్తున్న ఘటనలున్నాయి. అలాంటి వారిపై స్థానికంగా ఉండే ట్రాఫిక్, జీహెచ్ఎంసీతో మిలాఖత్ అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
పుట్పాత్లన్ని పాదచారులు నడవడానికి వీలుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే పుట్‌పాత్‌లను పూర్తిగా క్లియర్ చేసే విషయంలో ట్రాఫిక్, జీహెచ్ఎంసీ విభాగాలు ద్వంద్వ ప్రమాణాలు పాటించకుండా ఒకే విధానంతో ముందుకు వెళ్లాల్సిన అవసరముందని ప్రజలు సూచిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి జీవనోపాధి కోసం వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కొత్తగా వచ్చిన వారంతా చిరు వ్యాపారాలను ఏర్పాటు చేసుకొని పుట్‌పాత్‌లను ఆక్రమించుకుంటున్నారని స్థానిక ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి వారికి తమ తమ చిరువ్యాపారాలకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించి పుట్‌పాత్‌లను క్లియర్ చేయాల్సిన అవసరముంది.
అయితే వ్యాపార సముదాయాల విషయంలో కఠిన చర్యలు తీసుకొని, పుట్‌పాత్‌లపై వారి వారి వ్యాపారాలను నిలువరించాల్సిన ట్రాఫిక్ పోలీసులు అసలు విషయాన్ని మరిచిపోతున్నారనే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలను నిర్వహించే దుకాణాలపై అప్పుడప్పుడు పెటీ కేసులు వేస్తూ పోలీసులు చేతులు దులుపుకుంటారు. ఒకటి రెండు సార్లు ఇలా పెటీ కేసులు వేసిన తరువాత ఆయా వ్యాపారులతో ఒక అవగాహనకు వచ్చి మాముళ్లను ఫిక్స్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి విషయాలతోనే ఒక్కొక్క చోట ఒకో విధానాన్ని పోలీసులు, జీహెచ్ఎంసీ అవలంభిస్తోండంటూ ప్రజలు మండిపడుతున్నారు.