– వన్యప్రాణుల వేటకు అమర్చిన బైండింగ్ వైరు స్వాధీనం
– వివరాలు వెల్లడించిన పాల్వంచ సీఐ సతీష్
బూర్గంపహాడ్, ఆగస్టు 15 : వన్య ప్రాణుల వేట కోసం అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి చెరువుసింగారం వెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ మృతిచెందిన విషయం తెలిసిందే. నవీన్ మృతికి కారణమైన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పాల్వంచ సీఐ సతీష్ శనివారం తెలిపారు. ఈ నెల 11న రాత్రి నకిరిపేట అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు అక్రమంగా అడవి జంతువులను వేటాడేందుకు వైర్లను అమర్చారని సమాచారం అందగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్, డీఆర్వో, తోటి సిబ్బందితో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లి సదరు వ్యక్తుల ఆచూకీ కోసం వెతుకుతుండగా విద్యుత్ వైర్లు తగిలి నవీన్ మృతిచెందగా డీఆర్వో అనార్కలీ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఫిర్యాదు మేరకు నవీన్ మృతికి కారకులైన లక్ష్మీపురానికి చెందిన ఆవుల నాగిరెడ్డి, దాసరి నరేష్, తాటి వీరబాబు, నాగినేనిప్రోలు రెడ్డిపాలెంకు చెందిన కన్నెదారి అనంతయ్యపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
నమ్మదగిన సమాచారంతో శనివారం ఆవుల నాగిరెడ్డితో పాటు అతని ఇంట్లోనే ఉన్న మిగిలిన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితులు వన్య ప్రాణులను హతమార్చేందుకు ఉపయోగించిన బైండింగ్ వైరు, అక్కడ పాతడానికి ఉపయోగించిన కర్రలు, గడ్డపలుగు, ఖాళీ మందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా అటవీ జంతువులను వేటడానికి అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చి అమాయక జంతువుల ప్రాణాలు, మనుషుల ప్రాణాలు పోవడానికి కారణమైతే చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఐలు మేడా ప్రసాద్, నాగభిక్షం పాల్గొన్నారు.