సిటీ బ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): జలమండలిలో నిబంధనలు పాటించకుండా ఉద్యోగుల బదిలీలు చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల జరిగిన బదిలీలు సిబ్బంది హక్కులను హరించేలా ఉన్నాయని విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు తమకు నచ్చినట్లుగా రెండు నెలల నుంచి ఏడాదిలోపు పదవీ విరమణ చేస్తున్న వారిని కూడా వదలకుండా స్థాన చలనం కల్పించారని, వారి అభ్యర్థనలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని వాపోయారు. జలమండలి చరిత్రలో ఇలాంటి బదిలీలు మునుపెన్నడూ చేపట్టలేదని ఆరోపిస్తున్నారు.
అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న సీనియర్ ఉద్యోగులను ప్రస్తుతమున్న స్థానం నుంచి దూరంగా విసిరేసినట్లు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వ సంస్థలోనైనా ఉద్యోగుల బదిలీలకు ఆప్షన్లు ఇస్తారని, జలమండలిలో మాత్రం అలాంటివి అమలు చేయకుండా ఉన్నతాధికారులు తమకు నచ్చినట్లు, ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా స్థానచలనం కల్పించారని ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగుల సంక్షేమాన్ని పాటించాల్సిన మండలి ఉన్నతాధికారులు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. కరోనా కష్టకాలంలోను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కోటి మందికి నీటిని సరఫరా చేశామన్నారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నా కనీసం తమ హక్కులను కాపాడుకునే పరిస్థితి లేకుండా ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. బదిలీల్లో అనుసరించిన విధానాన్ని నిరసిస్తూ ఈనెల 20న జలమండలి ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ప్రొబేషనరీ పూర్తి కాకున్నా..
జలమండలిని మరింత విస్తరిస్తూ మూడు జోన్లుగా ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పడిన జోన్లు, ఆయా మున్సిపాలిటీల్లో సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు ట్రాన్స్ఫర్లు చేపట్టారు. ఇందులో భాగంగా వివిధ సర్కిళ్లలో ఉన్న సిబ్బందిని కొత్త సర్కిళ్లు, జోన్లకు బదిలీ చేశారు. ఈ ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టలేదని వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పదవీ విరమణకు కేవలం ఏడాది కాలం ఉన్న ఉద్యోగులకు స్థాన చలనం కల్పించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటున్నారు. కానీ ఓ ఉద్యోగి పదవీ విరమణకు కేవలం 2 నెలలు మాత్రమే సమయం ఉన్నా స్థానం చలనం కల్పించారు. అదే విధంగా పదవీ విరమణ సమయం ఏడాది లోపు ఉన్న సుమారు పది మంది ఉద్యోగులను బదిలీ చేశారు.
సీనియర్ ఉద్యోగులు అని చూడకుండా ఉద్దేశపూర్వకంగా వారిని వేధింపులకు గురిచేసే విధంగా స్థానచలనం కల్పించారనే ఆరోపణలు వస్తున్నాయి. రిటైర్మెంట్కు ముందు బదిలీ చేయడం వల్ల పింఛన్లు, ఇతర బెనిఫిట్స్ పొందేందుకు టెక్నికల్‌గా సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ ఉద్యోగి విధుల్లో చేరి కేవలం 7 నెలలు అవుతున్నదని, ఆయనకు కూడా స్థాన చలనం కల్పించారు. మరో ఉద్యోగిని ప్రొబేషనరీ పూర్తి కాకుండానే స్థాన చలనం కల్పించారని అంటున్నారు. కనీసం బదిలీల్లో ఆప్షన్లు కల్పిస్తే నచ్చిన ప్రాంతాలకు వెళ్లేవారని అభిప్రాయపడుతున్నారు. అధికారులు ఇష్టారీతిన వ్యవహరించడం వల్లనే కొంత మంది సిబ్బంది ఇప్పటికి జాయిన్ కాలేదని అంటున్నారు
ఉద్యోగుల హక్కులకు భంగం
జలమండలి ఉన్నతాధికారులు సిబ్బంది హక్కులను హరిస్తున్నారు. బదిలీల ప్రక్రియలో ఏకపక్షంగా వ్యవహరించి సిబ్బంది ప్రాథమిక హక్కులను కాలరాశారు. ఇప్పటికైన జలమండలిలో సిబ్బంది చాలా తక్కువగా ఉన్నది. ఒక్కొక్కరు ముగ్గురు నలుగురు చేయాల్సిన పని చేస్తున్నారు. పనిభారం ఎంత ఉన్నా కష్టపడుతున్న కిందిస్థాయి సిబ్బందికి ట్రాన్స్ఫర్లలో కనీసం ఆప్షన్లు ఇవ్వకుండా హక్కులను హరించారు. రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న సీనియర్ ఉద్యోగులను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. కనీసం ప్రొబేషనరీ పూర్తికాని వారిని వదలలేదు. వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేదంటే నిరసనలు తీవ్రతరం చేస్తాం.
– లక్షీనారాయణ, అసోసియేట్ ప్రెసిడెంట్, వాటర్ వర్క్స్ యూనియన్