తిప్పర్తి, ఏప్రిల్ 17: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, మిల్లర్లు కొర్రీలతో పంటను అమ్ముకునే పరిస్థితి లేదంటూ జిల్లాలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యంలో తాలు పేరుతో కోత విధిస్తున్నారని, ధాన్యపు రాశులను శుభ్రం చేస్తున్నా ఏవో సాకులు చూపుతూ మిల్లుల వద్ద మళ్లీ ధాన్యం కోత విధిస్తేనే తప్ప దిగుమతి చేసుకునేది లేదంటూ మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవడం కష్టతరంగా మారిందని తిప్పర్తి మండలం రామలింగాల గూడెం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామలింగాలగూడెం ఐకేపీ సెంటర్లో కొర్వేనిగూడెం, రామలింగాలగూడెం, కంకణాలపల్లి, చర్లగూడెం రైతులు సుమారు 120 ధాన్యపు రాశులను ఇప్పటి వరకు పోశారు.
ప్రారంభంలో రెండు లారీల ధాన్యం కాంటాలు కాగా మిల్లుల వద్ద ఒక లారీలో 27బస్తాల ధాన్యం, మరో లారీలో 18 బస్తాల ధాన్యాన్ని తాలు పేరుతో మిల్లర్లు కోత విధించారు. సెంటర్ నిర్వాహకుల సూచనల మేరకు రైతులు ట్రాక్టర్ ఫ్యాన్‌తో, జేసీబీతో గంటకు రూ.2వేలతో పాటు 6గురు కూలీల సాయంతో ధాన్యాన్ని శుభ్రం చేశారు. కాంటాల అనంతరం మిల్లుల వద్దకు లారీలు చేరుకోగానే మిల్లర్లు మళ్లీ ధాన్యంలో తాలు శాతం ఉందంటూ కొర్రీలు పెడుతున్నారు. శుభ్రం చేసిన ధాన్యంలో తాలు ఎలా ఉంటుందని మిల్లర్లను ప్రశ్నించినా కటింగ్ చేస్తే తప్ప దిగుమతి చేసుకునేది లేదంటూ కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో లేని సమస్యలు ఇప్పుడెందుకు వస్తున్నాయని రైతన్నలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తాలు పేరుతో తరుగు 500 బస్తాలకు 26 బస్తాల కోత
నల్లగొండ సిటీ ఏప్రిల్ 17 :కనగల్ మండలం జీయడవల్లి గ్రామానికి చెందిన రైతు పర్శనబోయిన సైదులు ధాన్యాన్ని అధికారులు కాంటా వేశారు. రైతుకు చెందిన సుమారు 500 బస్తాలు కాంటా వేసి మిల్లుకు తరలించారు. తీర చూస్తే రైతు కాంటా వేసిన ధాన్యం నుంచి తాలు పేరుతో 500 బస్తాల్లో 26 బస్తాలు కొత విధించినట్లు రైతు సైదులు తెలిపారు. ఇంత కోత పెట్టడం ఏంటంటూ రైతు కన్నీరు మున్నీరయ్యాడు.
తాలు పేరుతో 26 బస్తాలు కోత..
తాలు పేరుతో మిల్లర్లు భారీగా కొత విధిస్తున్నారు. గత రెండు రోజుల క్రితం నేను ఐకేపీలో 500 బస్తాలు కాంటా వేశా. తిరిగి ఐకేపీ నిర్వాహకులు ధాన్యంలో తాలు ఉందంటూ 26 బస్తాలు కోత విధించారు. ఎంత తాలు ఉన్నా 50 కిలోల వరకూ ఉంటుంది. కానీ ఒకే సారి 26 బస్తాలు కోత విధించడం ఇదే మెదటి సారి. గత ప్రభుత్వం హయాంలో బస్తాకు కిలో చొప్పున తీసుకునే వారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు అన్నీ కష్టాలే.. ఇప్పటికైనా అధికారులు మాకు న్యాయం చేయాలి.
-పర్శనబోయిన సైదులు రైతు, జీయడవల్లి
పంట అమ్ముడు కష్టమైతున్నది..
నాకు ఐదెకరాల పొలం ఉంది. మరో 9 ఎకరాలు కౌలు పట్టి చేస్తున్నా. పండిన ధాన్యాన్ని ఈ సెంటర్లోనే పోశా. ఐకేపీ నిర్వాహకుల సూచన మేరకు జేసీబీ, ట్రాక్టర్ ఫ్యాన్‌తో గంటకు రూ.2 వేలు చెల్లించి,8 మంది కూలీల సాయంతో తాలు లేకుండా ధాన్యం పట్టించా. అయినప్పటికీ మిల్లుకు లారీ పోగానే.. తాలు ఉంది.. కటింగ్ చేస్తే తప్ప దిగుమతి చేయమంటూ కొర్రీలు పెట్టి 8 బస్తాల ధాన్యం కట్ చేశారు.
-కమ్మంపాటి కృష్ణయ్య, రామలింగాలగూడెం
ఇంకా తాలు ఉందుంటున్నారు..
జేసీబీలు పెట్టి రాశి పట్టినా మి ల్లుకు పోయినంక కట్ చేస్తున్నా రు. ఇదేంది సార్.. మేము ధా న్యం పట్టినంక ఎట్లా కట్ చేస్తరంటే మీ ఇష్టం.. కట్ చేస్తేనే ది గుమతి అయితది లేదంటే మీ వడ్లు మీరు తీసుకెళ్లురి అంటున్నరు. చాల కష్టంగా ఉంది వడ్లు అమ్ముకునుడు.
-జాన్‌రెడ్డి, కోర్వేనిగూడెం
మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి..
రైతులంతా ధాన్యం శుభ్రం చేసి మిల్లులకు పంపిస్తున్నా మిల్లర్లు మాత్రం కొర్రీలు పెడుతున్నా రు. విత్తన వడ్లు ఇచ్చేటప్పుడు బస్తాకు కిలో నుంచి 2కిలోల తాలు వస్తుంది. రైతులు పండిం చి, శుభ్రంచేసి మిల్లుకు పంపినప్పటికీ తాలు ఉందని కటింగ్ పెడుతున్నరు. అధికారులు ధాన్యం మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి.
-నర్సింగ్ జానయ్య, కోర్వేనిగూడెం
ధాన్యం దిగుమతి చేసుకోవాలి..
రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తమ సొంత ఖర్చుతో ట్రాక్టర్ ఫ్యాన్, జేసీబీతో పాటు కూలీలను పెట్టి ధాన్యం శుభ్రం చేస్తున్నారు. అయినప్పటికీ మిల్లర్లు ఇంకా తాలు ఉదంటూ కొర్రీలు పెట్టడం సరికాదు. వెంటనే మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకొని రైతులకు న్యాయం జరిగేలా చూడాలి.
-ముత్తినేని శ్యాంసుందర్, సర్పంచ్ రామలింగాలగూడెం