Southwest Monsoon | హైదరాబాద్, జూన్2 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ఈనెల 4న కేరళ తీరాన్ని తాకనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత రెండు, మూడు రోజుల్లో తెలంగాణలో ప్రవేశిస్తాయని వెల్లడించింది. ఈసారి మాత్రం సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపింది. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఎల్‌నినో ప్రభావం ఉన్నదని, ఈనెలలో బలహీనంగా ఉన్నా.. సెప్టెంబర్‌లో మాత్రం బలపడే అవకాశం ఉన్నదని వివరించింది.
మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసినట్టు తెలిపింది. ఇదిలా ఉండగా, మంగళవారంతో రాష్ట్రంలో తీవ్రమైన వేసవికాలం ముగిసినట్టు తెలంగాణ వెదర్‌మ్యాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం నుంచి వానకాలంలోకి ప్రవేశించనున్నట్టు వెల్లడించారు.