హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : అక్రెడిటేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న జనగామ జిల్లా జర్నలిస్టులపై ఇంటెలిజెన్స్ పోలీసుల విచారణకు జిల్లా యంత్రాంగం ఆదేశించింది. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ వెబ్సైట్లో ఇప్పటివరకు జిల్లాలోని దాదా పు 360 మందికిపైగా జర్నలిస్టులు దరఖాస్తు చేసుకొని కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల జిల్లా మీడి యా అక్రెడిటేషన్ కమిటీ సమావేశంలో దరఖాస్తులను పరిశీలించి అందులో 288 మంది జర్నలిస్టుల దరఖాస్తులకు అన్ని అర్హతలు ఉన్నట్టు తేల్చి జాబితాను ఆమోదించింది.
నిబంధనల ప్రకారం వీరందరికీ ప్రభుత్వ గుర్తింపుకార్డు (అక్రెడిటేషన్) అందించాల్సి ఉండగా, గతంలో ఎప్పుడూలేని విధంగా 160 మంది జర్నలిస్టులకు సంబంధించిన జాబితాను వరంగల్ స్పెషల్ బ్రాంచ్ విభాగం (ఎస్బీ), ఇంటెలిజెన్స్ వర్గాలకు అందించిన జిల్లా యంత్రాంగం.. జర్నలిస్టులపై విచారణకు ఆదేశించడం చర్చనీయాంశమైంది. దరఖాస్తుదారుల వివరాలతో ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు జర్నలిస్టులకు ఫోన్లుచేసి వివిధ వివరాలు అని ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది.