మంగపేట, జూలై 28 : ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రం నుంచి కోమటిపల్లికి వెళ్లే రోడ్డు పక్కన మంగళవారం టోర్నడో తరహా గాలులు భారీ విధ్వంసం సృష్టించా యి. భారీ వర్షంతోపాటు బలమైన ఈదురు గాలులకు భారీ వృక్షాలు కూకటి వేళ్లు సహా నేలకొరిగాయి. కొన్ని చెట్లు రోడ్డుప పడటంతో మంగపేట-కోమటిపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటవీ అధికారులు, స్థానికులు రోడ్డుపై పడిన ఆ వృక్షాలను తొలగించారు. 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భారీ వృక్షాలు వేళ్లతోపాటు పడిపోగా, పక్కనే ఉన్న ప్లాంటేషన్లోని జామాయిల్ చెట్లు సగానికి విరిగిపోయాయి. ఆకాశం నుంచి మేఘాన్ని పోలిన సుడిగాలి చెట్ల మీదికి రావడం చూశామని, గాలుల ధాటికి చెట్లు విరిగి పడుతున్న శబ్దాలు విని భయపడినట్టు సమీప పొలాల్లో ఉన్న రైతులు తెలిపారు.