నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూలై 28: డీమానిటైజేషన్ (పెద్ద కరెన్సీ నోట్ల రద్దు) సందర్భంగా బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ప్రధాన నిందితుడు అంతతాలి యాదగిరి (49)కి మూడున్నర ఏండ్ల 6 నెలల జైలుశిక్షతోపాటు రూ.4.5 కోట్ల జరిమానా విధిస్తూ సికింద్రాబాద్ కోర్టు మంగళవారం సంచలన తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. 2017లో పాత కరెన్సీ నోట్లకు బదులుగా కొత్త నోట్లు ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న యాదగిరి సహా 17 మందిని పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు.
అనంతరం వారిని విడివిడిగా ప్రశ్నించి చార్జిషీట్ దాఖలు చేశారు. పాత కరెన్సీ నోట్లకు బదులుగా అక్రమంగా రూ.1.20 కోట్ల విలువైన కరెన్సీ నోట్లను బదిలీ చేశామని నిందితులు అంగీకరించారని తెలుపడంతోపాటు సాక్ష్యాధారాలను సమర్పించారు. అనంతరం కేసును విచారించిన న్యాయస్థానం 11 మందిని దోషులుగా తేల్చింది. మరో 10 మందికి రూ.60 వేల చొప్పున జరిమానా విధించింది. మిగిలిన నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.