Porika Rajkumar | తెలంగాణ సంస్కృతిలో బంజారాల ప్రస్థానం ప్రత్యేకమైనది. కట్టూబొట్టూ, ఆచార వ్యవహారాల్లో వారి శైలి విభిన్నంగా ఉంటుంది. ఆ విచిత్రాలనే సచిత్రాలుగా క్యాన్వాస్పై ప్రతిష్ఠిస్తున్నాడు ములుగు మండలం మదనపల్లికి చెందిన పోరిక రాజ్‌కుమార్. బంజారా సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలనే సంకల్పంతో కుంచెతో అద్భుతాలు ఆవిష్కరిస్తున్నాడు ఈ కళాకారుడు.
రాజ్‌కుమార్ తల్లిదండ్రులు సమ్మక్క, వాచ్చునాయక్. అతనికి చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం అంటే ఇష్టం. చెట్టు, పుట్ట బొమ్మలతోపాటు తాను పుట్టిపెరిగిన బంజారాల జీవనశైలికి అద్దంపట్టే చిత్రాలు గీయడం అలవాటు చేసుకున్నాడు. గిరిజన మహిళలను తన కుంచెతో అందంగా చిత్రీకరించేవాడు. బంజారా స్త్రీలు, వాళ్లు ధరించే దుస్తులు, ఆభరణాలు, గిరిజన పండుగలు తెలియజేస్తూ వందల్లో బొమ్మలు గీశాడు రాజ్‌కుమార్. బంజారా ఆడబిడ్డల జీవన సౌందర్యం ఆయన చిత్రాల్లో తొణికిసలాడుతుంది. ఒక్కో చిత్రం ఒక్కో కథను తెలియజేస్తుంది. జాతీయ, అంతర్జాతీయ కళావేదికల్లోనూ రాజ్‌కుమార్ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ క్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫెలోషిప్ అందుకున్నాడు. 2020లో నేషనల్ యూత్ ఐకాన్ అవార్డును, 2022లో చిత్రకళారత్న పురస్కారాన్ని స్వీకరించాడు. ‘నా చిత్రాలతో బంజారాల జీవనశైలిని లోకానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను’ అంటాడు రాజ్‌కుమార్.
… బోయినపల్లి శ్రీధర్‌రావు
“City College | సిటీ కాలేజీలోని ఈ ఆణిముత్యాల గురించి తెలుసా”