Metro Sisters | నీరసంగా ఉన్నా ఓపిక తెచ్చుకుని నాలుగు అడుగులు వేస్తాం. కానీ, కాలికి చెప్పులు లేకపోతే మాత్రం ఎంతోదూరం నడవలేం. చెప్పులు ఓ అవసరం. మనిషి అవసరాలు తెలిసినవారే మంచి వ్యాపారవేత్తలు అనిపించుకుంటారు.. ‘మెట్రో’ సిస్టర్స్ లాగా! మూడుతరాల వ్యాపారాన్ని నాలుగు దిక్కులకూ విస్తరించారు.. ఫరా మాలిక్, అలిషా మాలిక్.
తాత స్థాపించాడు.
తండ్రి విస్తరించాడు.
కూతుళ్లు విశ్వవ్యాప్తం చేస్తున్నారు.
వారసత్వంగా వచ్చిన మెట్రో బ్రాండ్ పాదరక్షల వ్యాపారాన్ని అక్కాచెల్లెళ్లు ఫరా మాలిక్, అలిషా మాలిక్ కొత్త విజయాలవైపు నడిపిస్తున్నారు. ‘తాతయ్యను మేం గౌరవిస్తాం. కానీ వ్యాపార వ్యూహాల్లో మాత్రం పూర్తిగా విభేదిస్తాం’ అంటున్నారీ తోబుట్టువులు. పెద్దాయన హయాంలో మెట్రో పూర్తిగా కుటుంబ వ్యాపారంగా ఉండేది. బాలీవుడ్ తారలు, సంపన్న పార్సీలు, ఎయిర్ హోస్టెస్‌లు పాదరక్షల కోసం నేరుగా ‘మెట్రో’ స్టోర్‌కే వెళ్లేవారు. ముంబైలో అంత ఇమేజ్ ఉన్నా ఇతర ప్రాంతాలకు విస్తరించడానికి మాత్రం మాలిక్ తెజానీ వెనుకాడేవారు. తర్వాత ఆ వ్యాపారం ఆయన కొడుకు రఫీక్ చేతికి వచ్చిది. కొత్తగా ఫ్రాంచైజీ వ్యవస్థను ప్రవేశపెట్టారు రఫీక్. ప్రస్తుతం మూడోతరం చేతికి పగ్గాలు వచ్చాయి. తండ్రి సామ్రాజ్యానికి ఫరా, అలిషా వారసులు అయ్యారు.
అప్పట్లో ఫరా అమెరికాలో చదివేవారు. ‘నేను ఇండియాకు రాను. నాకు బిజినెస్ ఇష్టం లేదు’ అని కచ్చితంగా చెప్పేశారు. కూతురి ప్రతిపాదనను రఫీక్ సున్నితంగా తిరస్కరించారు. ‘ఒక్క ఏడాది చాలు. దీనివల్ల వ్యాపారం గురించి అవగాహన వస్తుంది. ఆ తర్వాత నచ్చితే కొనసాగు. లేకపోతే నీ ఇష్టం’ అని స్పష్టంగా చెప్పడంతో ఫరా ఇండియాకు తిరిగొచ్చారు. కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టారు. ఆమె మళ్లీ వెనుదిరిగి చూడలేదు. తమ ఉత్పత్తులను చిన్నచిన్న పట్టణాలకూ తీసుకెళ్లారు. ప్రజల ఆదాయాలు పెరగడంతో ఖరీదైన పాదరక్షలకు గిరాకీ ఏర్పడింది. మెట్రోకు లాభాల పంట మొదలైంది. ఇప్పుడు ఆమె మెట్రో సంస్థకు ఎండీ కమ్ సీయీవో.
కొంతకాలం తర్వాత, అక్కకు తోడుగా చెల్లి అలిషా మాలిక్ వ్యాపారంలో అడుగుపెట్టారు. తనిప్పుడు మెట్రో బ్రాండ్స్ వైస్ ప్రెసిడెంట్‌గా.. మార్కెటింగ్, ఈకామర్స్, ఆన్లైన్ సేల్స్ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె చేరిన కొత్తలో ఈకామర్స్ మేనేజర్ రాజీనామా చేశాడు. దీంతో ఆ బాధ్యత కూడా అలిషా మీదనే పడ్డది. తనకు ఆన్లైన్ వ్యవహారాలంటే అస్సలు పడేది కాదు. పెద్ద కూతురి మీద ప్రయోగించిన బాణాన్నే చిన్న కూతురి మీదా వదిలారు రఫీక్. ‘నేర్చుకోవడానికి, ఎదగడానికి ఇదో మంచి అవకాశం బిడ్డా!’ అని ప్రోత్సహించారు. అప్పటి నుంచీ ఆమె నేర్చుకుంటూనే ఉన్నారు. తాను నేర్చుకున్నవిద్యనంతా మెట్రో విజయానికి ధారపోస్తూనే ఉన్నారు.
అక్కాచెల్లెళ్ల నేతృత్వంలో మెట్రో ఎదుగుదలను చూసి ముచ్చటపడిన ఇండియన్ వారెన్ బఫెట్ భరత్ ఝున్‌ఝున్‌వాలా భారీగా పెట్టుబడులు పెట్టారు. దీంతో ఆ బ్రాండ్‌కు కస్టమర్లలోనే కాదు, కార్పొరేట్ కారిడార్స్లోనూ విశ్వసనీయత పెరిగింది. అదనంగా ‘మోచీ’ బ్రాండ్‌ను కూడా ప్రారంభించారు. అంతర్జాతీయ ఉత్పత్తులకు తమ స్టోర్స్‌లో స్థానం కల్పించారు. ఆన్లైన్లో దూకుడు పెంచుతూ.. అమెజాన్ వంటి ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. అక్కడితో ఆగలేదు ఇద్దరూ. గత ఏడాది ఐపీవో ద్వారా 1367.5 కోట్ల రూపాయలు సమీకరించారు. ఒక చిన్న దుకాణం నుంచి అంతర్జాతీయ బ్రాండ్ వరకూ మెట్రో గెలుపు యాత్రను తలుచుకున్నప్పుడుల్లా ఆ సోదరీ మణుల కండ్లలో కొత్త వెలుగు. అది విజయగర్వం కాదు, అంతులేని ఆత్మవిశ్వాసం. ‘అనుభవాల పాఠాలే మమ్మల్ని నడి పిస్తున్నాయి’ అంటారు ఇద్దరూ.
“వ్యాపారంలో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి.. ముఖేశ్ అంబానీ గారాలపట్టి చెప్పిన విజయసూత్రాలివే..”
అన్నదాతలకు అండగా నిలబడిన హైదరాబాదీ ఆడబిడ్డ.. ఆమె ఏం చేస్తుందంటే..”
“Kanna Ooru | ఒక్క జిల్లా నుంచి ఎస్సై జాబులు కొట్టారు.. కన్న ఊరు రుణం తీర్చుకుంటున్నారు”
Sangeetha Kala Sisters | ఆ సిస్టర్స్‌కి రామకథలే అన్నపానీయాలు”