Vidya Nambirajan | ఆడపిల్ల గ్యారేజ్ నిర్వహించడం ఏమిటి? సూటి ప్రశ్న. నిర్వహిస్తే తప్పేంటి? ఆమె తిరుగు ప్రశ్న. కార్ల మరమ్మతుల గ్యారేజ్‌ను సమర్థంగా నిర్వహించడం మాత్రమే కాదు, మెరికల్లాంటి మహిళలను మెకానిక్‌లుగా తీర్చిదిద్దుతున్నారామె. తన గ్యారేజ్‌లో ఆడ, మగ సమానం అని నిరూపిస్తున్నారు. ఆడపిల్లలకు ఆటోమొబైల్ రంగంలో శిక్షణ ఇస్తూ.. ఉన్నత లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు విద్యా నంబిరాజన్.
2019.. హైదరాబాద్‌లోని లక్ష్మీ హ్యుందాయ్ కంపెనీ. మెకానిక్‌ల కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అక్కడికి వచ్చిన అభ్యర్థుల్లో ఓ యువతి కూడా ఉంది. అందరూ ఆమె వంకే ఆశ్చర్యంగా చూడసాగారు. ఇంటర్వ్యూ నిర్వాహకులకూ కొత్తగానే అనిపించింది. ఆ ఆడపిల్ల సత్తా ఏపాటిదో చూద్దామని పలు పరీక్షలు పెట్టారు. అన్నిటినీ విజయవంతంగా పూర్తిచేసింది. చివరగా జనరల్ మేనేజర్‌తో ముఖాముఖి.
‘వెల్.. అన్ని రౌండ్లూ విజయవంతంగా పూర్తి చేశారు. కంగ్రాట్స్! ఇంతకీ మీరు ఇంటర్న్‌షిప్ ఎక్కడ చేశారు?’ అని అడిగారు జీఎం.
‘పారామౌంట్ గ్యారేజ్’ అందామె. మారు ప్రశ్నించకుండా ‘యూ ఆర్ సెలెక్టెడ్’ అన్నారు జీఎమ్. అదీ ‘పారామౌంట్ గ్యారేజ్ ( Paramount Auto Bay Services )’ ప్రత్యేకత. అక్కడ శిక్షణ తీసుకున్న యువతులు ఎందరో బడాబడా కంపెనీల్లో మెకానిక్‌లుగా రాణిస్తున్నారు.
నేరెడ్మెట్ క్రాస్‌రోడ్స్ సమీపంలోని మధురానగర్లోకి అడుగుపెట్టగానే ‘పారామౌంట్ గ్యారేజ్’ కనిపిస్తుంది. పచ్చని చెట్లు, గోడలకు ఇరువైపులా రంగురంగుల టైర్లు ఫొటోఫ్రేములుగా వేలాడుతూ ఆహ్వానం పలుకుతుంటాయి. గ్యారేజ్ లోపలికి వెళ్లగానే తరుణులు తారసపడతారు. బృందాలుగా విడివడి వివిధ కంపెనీల కార్ల విడిభాగాల గురించి లోతైన అధ్యయనం చేస్తుంటారు. ఆరితేరిన మెకానిక్లలా యంత్రాల లోపాలను సరిచేస్తుంటారు. వారంతా ఇంజినీరింగ్ విద్యార్థినులే. ‘పారామౌంట్ గ్యారేజ్’లో శిక్షణ తీసుకుంటున్న వారే. కండ్ల ముందే కారు యంత్ర భాగాలన్నీ చకచకా విడదీస్తారు. అంతే వేగంగా బిగించేస్తారు. అతివలకు అన్ని పనులు సులువుకాదు అని ముద్రవేసిన సమాజ వైఖరికి భిన్నంగా, వారిని మెకానిక్ మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు విద్యా నంబిరాజన్. పురుషాధిక్య మెకానిక్ రంగంలో ఒంటరిపోరాటం చేసి విజేతగా నిలిచిన వనిత ఆమె.
విద్య తండ్రి నంబిరాజన్ 1988లో ‘పారామౌంట్ ఆటోబే సర్వీసెస్’ గ్యారేజ్ ప్రారంభించారు. కొన్నేండ్లపాటు విజయవంతంగా దాన్ని నిర్వహించారు. ఆయన ఆరోగ్యం క్షీణించడం, కొడుకులు ఇద్దరూ విదేశాల్లో స్థిరపడటంతో.. కూతురు విద్యకు గ్యారేజ్ బాధ్యతలు అప్పగించారు. అప్పటికే విద్య ఎంబీఏ పూర్తిచేసి చెన్నైలో మార్కెటింగ్ సంస్థలో పనిచేస్తున్నారు. కారు నడపడం తప్ప, దాని మరమ్మతుల విషయంలో కనీస పరిజ్ఞానం లేదు. కొత్త బాధ్యతలు అందుకున్న ఆడకూతురుకు మద్దతు ఇవ్వకపోగా, చాలామంది ‘నీ వల్ల కాదు. నువ్వు చేయలేవు’ అని హేళన చేశారు. వారికి తగిన సమాధానం చెప్పాలనుకున్నారు విద్య. ఆమె బాధ్యతలు తీసుకునే నాటికి గ్యారేజ్‌లో 12 మంది ఉద్యోగులు ఉన్నారు. అందరూ మగవాళ్లే. అంతకుముందు తనెప్పుడూ గ్యారేజ్‌కు వచ్చినా వాళ్లంతా ‘దీదీ’ అని ఆప్యాయంగా పలకరించేవారు. కానీ, ఆవిడే తమ యజమాని కావడంతో, ఆడపిల్ల కింద పనిచేయడం ఏమిటని ఒక్కొక్కరూ గ్యారేజ్‌ను విడిచిపెట్టారు. అయినా విద్య వెనక్కి తగ్గలేదు. కొత్తగా ముగ్గురిని చేర్చుకున్నారు. కొన్నాళ్లకు మెకానిక్‌ల కుటుంబాల్లోని మహిళలకు గ్యారేజ్‌లోనే ఉపాధి కల్పించారు. గ్యారేజ్ నిర్వహణలో ఆమె పనితనం చూసి ఆశ్చర్యపోయేవారు. ఆమె అభివృద్ధి మింగుడుపడని కొందరు వ్యక్తులు గ్యారేజ్‌పై దుష్ప్రచారం చేసేవారు. వాటిని సమర్థంగా ఎదుర్కొని నిలబడ్డారు విద్య.
కాలానికి తగ్గట్టుగా గ్యారేజ్‌ని సాంకేతికంగా అభివృద్ధి చేశారు విద్య. మార్కెట్లోకి కొత్తగా ఏ యంత్రం వచ్చినా వెంటనే గ్యారేజ్‌లో ప్రత్యక్షమయ్యేది. అలా 2002లో హైదరాబాద్‌లో మొట్టమొదటి ఇంజిన్ స్కానర్‌ను తీసుకొచ్చారు. దాని కొనుగోలు కోసం ఉన్న నగలన్నీ తాకట్టుపెట్టారు. ఇంకొన్నాళ్లకు ఆటోమెటిక్ కార్ వాష్ మెషిన్ తెప్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో యంత్రంతో కారు వాష్ చేసిన తొలి గ్యారేజ్ ఇదేనంటారు విద్య. ఇలా ఎప్పటికప్పుడు కొత్త పరికరాలు తెప్పిస్తూ మెరుగైన సేవలకు కేరాఫ్‌గా ‘పారామౌంట్ గ్యారేజ్’ను నిలిపారు. ఇక్కడ అందిస్తున్న నాణ్యమైన సేవలకు ఐఎస్ఓ గుర్తింపుతోపాటు, జర్మనీలోని డాక్స్ సర్టిఫికెట్ దక్కింది. ఆమె పలు అవార్డులు కూడా అందుకున్నారు.
ఒక మహిళగా స్త్రీ సాధికారతకు కృషి చేస్తున్నారు విద్య. గ్యారేజ్‌లో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చేస్తున్న ఎందరో యువతులకు మెకానిజంలో ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నారు. విద్యార్థుల కోసం ఇంటినే ఇన్స్టిట్యూట్గా మార్చారు. ఆడ, మగ అనే తేడా లేకుండా అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. 2013-14 నుంచి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. మూడు నెలల నుంచి ఏడాదిపాటు ట్రైనింగ్ కొనసాగుతుంది. మెకానిజంతోపాటు వ్యక్తిత్వ వికాస తరగతులు, సాఫ్ట్‌స్కిల్స్ నేర్పుతున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ధ్రువపత్రం అందిస్తున్నారు. ఈ సర్టిఫికెట్‌కు 90 దేశాల సంస్థల్లో గుర్తింపు ఉందంటారు విద్య. అంతేకాదు తామే స్వయంగా వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పుకొచ్చారు. ‘పారామౌంట్’లో శిక్షణ పొందినవారిలో ఎందరో దేశ, విదేశాల్లో స్థిరపడ్డారు కూడా. గడిచిన ఎనిమిదేండ్లలో దాదాపు 800 మందికి శిక్షణ ఇచ్చారు. వీరిలో 200 మంది యువతులు ఉన్నారు. మొత్తంగా ఇప్పటివరకు 500 మందికి ఉద్యోగాలు కల్పించారు. తన తండ్రి పేరిట ‘నంబిరాజన్ ఫౌండేషన్’ స్థాపించి పేద విద్యార్థినులకు బీఈ, మెకానిజంలో డిప్లొమా కోర్సులు చదవడానికి
ఆర్థికసాయం చేస్తూ ప్రోత్సహిస్తున్నారు.
‘రాబోయే కాలమంతా ఎలక్ట్రిక్ వాహనాలదే. కారు సాఫ్ట్‌వేర్‌లో కేవలం ప్రోగ్రామింగ్ మాత్రమే నేర్పుతారు. అయితే, ఆ సాఫ్ట్వేర్ కారుకు ఎలా ఉపయోగపడుతుంది? దాని పనితనం గురించి తెలుసుకోవాలని కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కూడా మెకానిజం వైపు చూస్తున్నారు. సాంకేతికత ఆధారంగా వివిధ విభాగాలు ఎలా పనిచేస్తున్నాయి? ఏ సమస్యలను ఎలా పరిష్కరించాలో నేర్పుతున్నాం. సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, మెకానిక్‌గానూ రాణించవచ్చని యువతులకు భరోసా ఇస్తున్నాం. నా జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. వాటన్నిటినీ దాటుకుంటూ ప్రయాణం సాగించాను. మహిళలు కూడా గ్యారేజ్‌లు నిర్వహించేలా చేయడమే నా లక్ష్యం.’
– విద్యా నంబిరాజన్, పారామౌంట్ గ్యారేజ్ నిర్వాహకురాలు
…✍ రవికుమార్ తోటపల్లి
ఫొటోలు : నరేందర్ నంగునూరి
“ఈ నంబర్‌కు వాట్సాప్ చేస్తే చాలు.. ఆడబిడ్డల సమస్య తీర్చేస్తారు”