‘నమస్తే మేడం, నా పేరు లక్ష్మి. మీ కౌన్సెలింగ్ తర్వాత మా ఆయన మారిపోయాడు. నాతో మంచిగానే ఉంటున్నాడు. జీతం డబ్బులు కూడా నాకే ఇస్తున్నాడు. అత్తామామలూ ప్రేమగా చూస్తున్నారు. థ్యాంక్ యూ’.. ఓ ఆడబిడ్డ మహిళా కమిషన్‌కు తెలియజేసిన కృతజ్ఞత ఇది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ( Telangana State Women’s Commission )కు ఆమె పంపిన ఓ వాట్సాప్ ఫిర్యాదు.. పాలన వ్యవస్థను ఆమె దగ్గరికి తీసుకెళ్లింది. సమస్యను పరిష్కరించింది. ఈ ఒక్క సంఘటనే కాదు, చాలా సందర్భాల్లో 94 90 55 55 33 వాట్సాప్ నంబర్.. తెలంగాణ మహిళకు రక్షణ కవచమై నిలుస్తున్నది.
ఒక వాట్సాప్ ఫిర్యాదు చాలు. వెంటనే స్పందిస్తారు. ఓదారుస్తారు. ధైర్యమిస్తారు. సలహా అందిస్తారు. పరిష్కారం చెబుతారు. అన్నీతామై అండగా నిలుస్తారు. సమస్యలు, సంక్షోభాలు, సవాళ్లు.. మహిళ జీవితానికి కొత్తేం కాదు. కానీ, ఆ పోరాటంలో ఆమెకు అండగా నిలబడేందుకు సాక్షాత్తు మహిళా కమిషనే ముందుకు రావడం ఓ వినూత్న ప్రయత్నం. బాధిత మహిళలు 94 90 55 55 33 నంబరుకు తమ సమస్యను మెసేజ్ చేస్తే సరిపోతుంది. వెంటనే స్పందన వస్తుంది. ఈ ఏడాది మార్చి నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాట్సాప్ ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ మహిళా కమిషన్.
గృహహింస, లైంగిక వేధింపులు, వరకట్న గొడవలు, అత్యాచార యత్నాలు.. ఏ సమస్య ఉన్నా వాట్సాప్ చేయొచ్చు. తక్షణ సహాయానికి, సత్వర న్యాయానికి మహిళా కమిషన్ తనవంతు కృషి చేస్తుంది. మారుమూల పల్లెల్లో వాట్సాప్ నంబరు గురించి అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ టీచర్లనూ ఉద్యమంలో భాగస్వాములను చేసింది కమిషన్.
ఆ నంబరును ఏ చిట్టీ మీద రాసి గుర్తుపెట్టుకున్నదో? మేడ్చల్ జిల్లా నుంచి ఓ పెద్దవ్వ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ‘కొడుకు మంచిగ సూడట్లె. నా ఇంట్ల నన్నే ఉండనీయకుంట తాళమేసుకొని పోయిండు. కొలువు ఏడ జేస్తడో ఎర్కలే. నాకింత బువ్వ లేకుంట జేసిండు. ఉన్న నీడ లేకుండ జేసిండు’ అని కమిషన్ ముందు తన గోడు వెళ్లబోసుకుంది. ‘నీ కొడుకు ఎక్కడున్నా పట్టుకొస్తాం’ అని ఆ అవ్వకు ధైర్యం చెప్పింది కమిషన్. వెంటనే అధికారులు ఆమె కొడుక్కి ఫోన్ చేశారు. ‘నేను వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నా. రాలేను’ అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ‘నువ్వు ఎక్కడున్నా రావాల్సిందే. ఫలానా రోజున, ఫలానా సమయానికి మహిళా కమిషన్ ముందు హాజరు కావాల్సిందే’ అని ఆర్డర్ వేశారు. దెబ్బకు దిగొచ్చాడు. ‘అమ్మ నిన్నెంత మంచిగ చూసుకున్నదో, అమ్మనూ నువ్వు అంతే మంచిగ చూసుకోవాలి’ అని హితవు చెప్పింది కమిషన్. ఆ బిడ్డ అర్థం చేసుకున్నాడు. కథ సుఖాంతమైంది.
రంగారెడ్డి జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన సంఘటన ఇది. ఓ ఇంట్లో, చిన్న విషయాలకే భార్యాభర్తలు గొడవపడ్డారు. భార్యకు తెలియకుండా బిడ్డను ఎత్తుకుని వెళ్లిపోయాడు భర్త. ఆ తల్లి వారం రోజులపాటు తెలిసిన ఊళ్లన్నీ వెతికింది. ఎవరో సలహా ఇస్తే మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆ విషయం తెలియగానే బిడ్డను తీసుకుని మరీ హైదరాబాద్‌లోని కమిషన్ కార్యాలయానికి వచ్చాడు భర్త. కౌన్సెలింగ్ తర్వాత, ఇక నుంచి బాగా చూసుకుంటానని మాటిచ్చి భార్యాబిడ్డలను ఇంటికి తీసుకెళ్లాడు. ఓ డెంటల్ కాలేజీ స్టూడెంట్ను కీచక ప్రొఫెసర్ బెదిరించేవాడు. పరీక్షల్లో పాస్ మార్కులు వేయనని వేధించేవాడు. మహిళా కమిషన్ కన్నెర్ర తర్వాతే దారికొచ్చాడు. ఓ ప్రవాస భర్త భార్యను పుట్టింట్లో వదిలిపెట్టి, ఎవరికీ చెప్పకుండా అమెరికా వెళ్లిపోయాడు. రెండేండ్లు ఎదురు చూసినా రాలేదు. ఆ ఇల్లాలు మహిళా కమిషన్‌ను ఆశ్రయించడంతో.. అతను ఓ మెట్టు దిగొచ్చాడు.
సమస్య ఏదైనా సరే బాధిత మహిళలు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 మధ్య మహిళా కమిషన్ నంబరుకు ఫోన్ చేయొచ్చు. సావధానంగా విని పరిష్కారం సూచిస్తారు మహిళా కమిషన్ కౌన్సెలర్లు. ఇ-మెయిల్, ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తారు. ‘వాట్సాప్ నంబరును ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాత ఫిర్యాదుల సంఖ్య పెరిగింది’ అని చెబుతారు కమిషన్ కార్యదర్శి జి. కృష్ణకుమారి. ఈ నాలుగు నెలల్లోనే 1000 ఫిర్యాదులు వచ్చాయి. వాట్సాప్ ఫిర్యాదు అందగానే.. సమస్యను పరిశీలించి సంబంధిత వ్యక్తులకు ఫోన్ చేస్తారు సిబ్బంది. నిర్దిష్ట సమయానికి కమిషన్ ముందు హాజరుకావాలని సూచిస్తారు. తొలిదశలో విడివిడిగా మాట్లాడతారు. తర్వాత సామూహిక కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. ఎవరి తప్పులు ఏమిటన్నది విశ్లేషిస్తారు. ఆ తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలో సూచిస్తారు. మహిళా కమిషన్ ప్రతి సమస్యనూ ఒక మహిళ జీవితంగా భావిస్తుంది. ఆ జీవితాన్ని నిలబెట్టే ప్రయత్నమే చేస్తుంది.
పోలీసుల దగ్గరికి వెళ్లే ముందు.. ఒక్కసారి మహిళా కమిషన్‌ను సంప్రదించండి. మహిళలకు సత్వర న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ వాట్సాప్ సర్వీస్ తీసుకొచ్చాం. కమిషన్‌కు అందే మెసేజ్‌లలో 90 శాతం సలహా కోసం వచ్చేవే. మిగతా 10 శాతం మాత్రం కేసు నమోదు చేసి, విచారించాల్సిన అవసరం ఏర్పడుతుంది. చాలా సందర్భాల్లో ఆలూమగలు తమ తప్పు అంగీకరిస్తున్నారు. మళ్లీ కలిసిపోతున్నారు. ప్రతి మహిళా తన కుటుంబంతో సంతోషంగా ఉండాలని కమిషన్ ఆకాంక్ష.
– సునీతా లక్ష్మా రెడ్డి, అధ్యక్షులు, తెలంగాణ మహిళా కమిషన్
…✍ నాగవర్ధన్ రాయల
హైదరాబాదీ రుచులను ఆన్లైన్లో పరిచయం చేస్తున్న ఇందిర”