fitbee | కొంతమందికి నడక, యోగా అలవాటు. కొంతమంది జిమ్‌కు వెళ్లి వర్కవుట్స్ చేస్తారు. కరోనా దెబ్బకు అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు ఏదైనా ఆన్లైన్లోనే. దురదృష్టం ఏమిటంటే.. కరోనాకు ముందు అయినా, తర్వాత అయినా స్త్రీ జీవితంలో ఎలాంటి మార్పూ లేదు. వ్యాయామం అనేది ఎప్పుడూ లేదు. కుటుంబ బాధ్యతలతోనే సరిపోతున్నది. దీంతో అనేకానేక శారీరక, మానసిక రుగ్మతలు ఆమెను వేధిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగానే ‘ఫిట్బీ ( fitbee )’ని స్థాపించారు హైదరాబాద్‌కు చెందిన ప్రతిమ ( Prathima ). తన ఆన్లైన్ జిమ్ గురించి ‘జిందగీ’తో ఆమె పంచుకున్న ముచ్చట్లు..
హైదరాబాద్‌లో స్థిరపడింది. నాన్న కె.ప్రభాకర్‌రెడ్డి విశ్రాంత ఐఏఎస్ అధికారి. తాను ఎన్నిచోట్ల పనిచేసినా, మమ్మల్ని మాత్రం పదో తరగతివరకు ఒకే స్కూల్లో చదివించాలన్నది ఆయన ఉద్దేశం. అందుకే కుటుంబాన్ని ఇక్కడే ఉంచారు. వారానికోసారి వచ్చి వెళ్లేవారు. ఖైరతాబాద్‌లోని నాసర్ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత బిట్స్ పిలానీలో సివిల్ ఇంజినీరింగ్ చేశాను. మొదటి నుంచీ నాకు సొంతంగా ఏదైనా చేయాలని ఉండేది. అప్పుడే స్నేహితులతో కలిసి ‘క్యాటపుల్ట్’ అనే స్టార్టప్ ప్రారంభించాను. చదువు అంటే మెడిసిన్, ఇంజినీరింగ్ మాత్రమే కాదు, బయట చాలా అవకాశాలు ఉన్నాయని విద్యార్థులకు చెప్పడమే మా ఉద్దేశం. రెండేండ్ల తర్వాత మిత్రులంతా తలో దారి చూసుకోవడంతో మూసేశాం. నేను అమెరికా వెళ్లి టెక్నాలజీ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశాను.
పెండ్లయ్యాక రెండేండ్లు ఉద్యోగం చేశాను. నా భర్త కూడా సాఫ్ట్వేర్ నిపుణుడే. తను సర్టిఫైడ్ ఫిట్నెస్ ట్రైనర్ కూడా. రోజూ వర్కవుట్స్ చేసేవాడు. మానసిక, శారీరక ఆరోగ్యం మీద ఫిట్నెస్ ప్రభావాన్ని కండ్లకు కట్టినట్టు చెప్పేవాడు. ట్రైనర్ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి, నా వరకు నేను వ్యాయామం మొదలుపెట్టాను. అంతెందుకు, మా నాన్నకు 71 ఏండ్లు. ఇప్పటికీ రోజూ వర్కవుట్స్ చేస్తూ ఫిట్‌గా ఉన్నారు. కానీ, ఫిట్నెస్ గురించి అవగాహన లేని మహిళల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న నన్ను చాలా రోజులు వేధించింది. దానికి సమాధానంగానే,‘ఫిట్బీ స్టూడియో (fitbee studio )’ ప్రారంభించాం. కొవిడ్‌తో ప్రపంచమంతా స్తంభించి పోయాక పూర్తిగా ఆన్లైన్ చేసేశాం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా పనిచేస్తున్నాం. ఇన్‌స్టాగ్రామ్‌లో మాకు 95 వేలమంది ఫాలోవర్లు ఉన్నారు.
మహిళలెప్పుడూ ఆరోగ్యం గురించి ఆలోచించరు. కాలేజీ అమ్మాయిల నుంచి ఉద్యోగినుల వరకు ఎవరూ రోజువారీ జీవితంలో వ్యాయామం అవసరాన్ని గమనించరు. అందువల్లే వయసుతో సంబంధం లేకుండా మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగి, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతున్నది. ఒబెసిటీ, పీసీఓఎస్, పీసీఓడీ, థైరాయిడ్ వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇవన్నీ గమనించే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు పోస్ట్‌లు పెట్టడం ప్రారంభించాను. ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో వస్తారు కాబట్టి వాళ్లకు తగ్గట్లు డైట్, వర్కవుట్స్ డిజైన్ చేస్తారు మా నిపుణులు. మా
క్లయింట్స్‌లో 50శాతం పీసీఓడీ, పీసీఓఎస్‌తో బాధపడేవారే. మరో 30శాతం అధిక బరువు, జీవన
శైలి సమస్యలు, ఒత్తిడి తదితర కారణాలతో వస్తారు. 15శాతం థైరాయిడ్ సమస్యలను తగ్గించుకోవడానికి చేరుతారు. 5శాతం మంది మాత్రం బరువు పెరిగేందుకు డైట్, వర్కవుట్స్ కావాలని అడుగుతారు.
ఎక్కువసేపు రాస్తుంటే వేళ్లు నొప్పిపెట్టడం మామూలు విషయం కాదు. ఇల్లు ఊడుస్తుంటే నడుము నొప్పి రావడం సహజం కాదు. కూరగాయలు తరుగుతున్నప్పుడు మెడలు గుంజుతుంటే తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, ఆరోగ్యవంతమైన శరీరం చిన్నవాటికే ఇబ్బంది పెట్టదు. ఈ సమస్యలన్నీ ఉన్నాయంటూనే, తాము ఆరోగ్యవంతులమని చెబుతుంటారు చాలామంది స్త్రీలు. రాబోతున్న పెద్ద సమస్యలకు ఇవన్నీ తొలి సంకేతాలు మాత్రమే. కాబట్టి, భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి. వ్యాయామం వల్ల పీసీఓడీ, పీసీఓఎస్ రుగ్మతల నుంచీ ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడుతున్నామని, గతంతో పోలిస్తే హుషారుగా ఉన్నామనీ ఫిట్బీలో చేరిన మహిళలు చెబుతున్నప్పుడు ఆనందంగా అనిపిస్తుంది.
ఒకప్పుడు పిల్లలకు చిరుతిళ్లు అంటే.. అమ్మమ్మ, నానమ్మలు వండే అప్పాలే. లేదంటే, ఇంట్లోనే అమ్మ చేసే పల్లీపట్టీలు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్ అలవాటు కావడంతో పోషకాహార సమస్యలు, అధికబరువు.. రెండూ ఒకేసారి దాడి చేస్తున్నాయి. పెద్దలతో సమానంగా పిల్లలూ కూల్‌డ్రింక్స్ తాగుతున్నారు. ఈ అలవాట్లన్నీ మారిస్తే తప్ప పిల్లలు ఆరోగ్యంగా ఎదగలేరన్న విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి. అలాగే ఇరవై నాలుగు గంటలూ పిల్లల్ని ఫోన్ల ముందు కూర్చోనివ్వకూడదు. వాళ్ల ఎత్తు, బరువుకు తగ్గ వ్యాయామాలు చేయించాలి. మా ఫిట్బీ యాప్ ప్లేస్టోర్‌లో ఉంది. దాన్ని ఉచితంగా వాడుకోవచ్చు. అందులో దాదాపు 150 వీడియోలు ఉన్నాయి. ఇంటిల్లిపాదీ కలిసి వ్యాయామం చేస్తుంటే పిల్లలకు కూడా ఆసక్తి పెరుగుతుంది. మహిళ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం క్షేమంగా ఉంటుంది.
✍ నిఖిత నెల్లుట్ల
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Kattula lakshmi | అప్పుడు తుపాకి పట్టి అక్కగా మారింది.. ఇప్పుడు అనాథలకు అమ్మ అయింది
వైకల్యం వారి ప్రతిభకు అడ్డం కాలేదు.. మోడలింగ్‌లో దూసుకెళ్తున్న కేరళ యువతులు
పిల్లలను ఎప్పుడు స్కూల్‌కు పంపించాలి.. విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ స్వీయ అనుభవం ఏంటంటే..
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
Ira singhal | దివ్యాంగురాలైనా ఆమె ఎంతోమందికి ఇన్స్పిరేషన్.. ఐఏఎస్ సాధించడమే కాదు..