Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక కారు అదుపు తప్పడంతో ముగ్గురు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అజాంగఢ్ జిల్లా, ఫుల్పుర్ పోలీస్ స్టేషన్ పరిధి, జగదీష్ పూర్ గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం 5.00 గంటలకు జరిగింది. తొమ్మిది మంది వ్యక్తులు సోమవారం రాత్రి ఫుల్పుర్ పరిధిలో రాజ్భార్ గణేష్ మండపంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు.
అనంతరం అక్కడి నుంచి సరాయ్ మీర్ ప్రాంతానికి కారులో బయల్దేరారు. మొత్తం తొమ్మిది మంది ప్రయాణిస్తున్న కారు జగదీష్ పూర్ గ్రామ సమీపంలో.. అతివేగం కారణంగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులోని తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మరణించారు. మరోవ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్తలంలో బాధితుల ఆర్తనాదాలతో పరిస్థితి హృదయ విదారకంగా ఉంది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. బాధితుల్ని రక్షించే చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.