fashion | antique jewellery | పెండ్లంటే.. మొక్కుబడిగా ఒక్కరోజులో ముగిసిపోయే తతంగం కానేకాదిప్పుడు. సంగీత్, హల్దీ, మెహెందీ, తలంబ్రాలు, విందు.. ఇలా అయిదు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే వేడుక. ఆ సందడి మొత్తం పెండ్లి కూతురు అలంకరణ చుట్టే తిరుగుతుంది. ముస్తాబు అంటే.. నగలే! కాబట్టే బంగారం, వెండి, గిల్ట్, వన్‌గ్రామ్ గోల్డ్.. వీలైనన్ని ఆభరణాలు సిద్ధం చేసుకుంటారు. వధువు స్థాయిలో కాకపోయినా, బంధుమిత్రుల అలంకరణలోనూ ఆభరణాలది అగ్రస్థానమే.
పెండ్లి వేడుకలో యాంటిక్ నగలదే హవా. సంప్రదాయం, హుందాతనం వీటి ప్రత్యేకత. గోల్డెన్ నక్షి జువెలరీ, టెంపుల్ జువెలరీ అనీ పిలుస్తారు. పూర్తి బంగారంతో, అరుదైన పనితనంతో తయారవుతాయి. దేవతామూర్తులు, పువ్వులు, తీగలు, నెమళ్లు, ఏనుగులు.. ఇలా అనేక డిజైన్లలో లభిస్తాయి. పట్టుచీరలపై చక్కగా నప్పుతూ పెండ్లికూతురి అందాన్ని ఇనుమడిస్తాయి. పాపిట బిళ్ల, కమ్మలు, హారాలు, వడ్డాణం, గాజులు, వంకీలు.. ఒకటేమిటి అన్నిటా లక్ష్మీదేవి, వినాయకుడు, రామపరివార ప్రతిరూపాలు ప్రతిబింబిస్తాయి.
సంగీత్‌లో పెద్ద చోకర్, పెండ్లిలో మెడనిండా రాళ్లు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు, రిసెప్షన్లో ట్రెండీగా కనిపించే నెక్‌పీస్, మ్యాచింగ్ దుద్దులు, బ్రేస్లెట్లు.. ఇలా సందర్భానుసారంగా ఉంటుంది పెండ్లికూతురి అలంకరణల జాబితా. కానీ, ఇన్ని నగలు కొనాలంటే సామాన్యులకు అయ్యే పనికాదు. అందుకే వెండిపై బంగారు పూత, అల్లాయ్, మైక్రోగోల్డ్ ప్లేటెడ్.. ఇలా రకరకాల లోహాలు బంగారానికి ప్రత్యామ్నాయంగా వచ్చాయి. ఆన్‌లైన్‌లోనూ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఒక్క క్లిక్‌తో కొనేసుకోవచ్చు.
ఈతరం వధువులు సాదా బంగారం, వజ్రాలు, పోల్కీ, కుందన్ ఆభరణాలను ఎంచుకుంటున్నారు. బంగారంతో పోలిస్తే కుందన్ ధర తక్కువ. మెరుపు మాత్రం ఎక్కువే. రియల్ పోల్కీ, జాతిరాళ్లను కుందన్ నగల్లో పొదుగుతారు. ముఖ్యంగా తెల్ల కుందన్లు మహా అందంగా కనిపిస్తాయి. ఎర్ర రాళ్లు పొదిగిన నగలు త్వరగా మెరుగును కోల్పోవు. పగటి పెండ్లిళ్లలో ఈ తరహా నగలు కాంతులు వెదజల్లుతూ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. నెక్‌పీస్, హారం, వడ్డాణం, వంకీ, ముక్కుపుడక.. ఇలా ఆపాదమస్తకం కుందన్లు పొదిగిన నగలైతే మరీ చూడముచ్చటగా ఉంటుంది. అక్షతలతో పాటు ‘పెండ్లికూతురు మహాలక్ష్మిలా ఉంది’ అన్న ప్రశంసలూ కురుస్తాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అకేషన్లో ప్రత్యేకంగా కనిపించాలా? ఈ డిజైన్లు ట్రై చేయండి
PV sindhu |పద్మభూషణ్ అందుకున్నప్పుడు పీవీ సింధు కట్టుకున్న చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
chand bali | అందాన్ని రెట్టించడానికి చాంద్‌బాలీ ఆభరణాలు.. వీటిని మించిన ఫ్యాషన్ లేనే లేదు