e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 24, 2022
Home జిందగీ గృహలక్ష్మికి..కాసుల పేరు!

గృహలక్ష్మికి..కాసుల పేరు!

మగువలు అలంకార ప్రియులు. ప్రకృతిలోని ప్రతి అందమైన వస్తువునూ, విలువైన లోహాన్నీ సిగలోనో, మెడలోనో, ముంజేతికో, ముచ్చటైన నడుముకో అలంకరించుకోవాలని ఆరాటపడతారు. ఆ రోజుల్లో మారకద్రవ్యంగా చలామణిలోఉన్న బంగారు కాసులూ సహజంగానే వారి మనసులను చూరగొన్నాయి. ఐశ్వర్య అధిదేవత అయిన లక్ష్మీదేవి రూపంతో ముద్రించిన కాసులు మరింత నచ్చాయి. దీంతో, లక్ష్మీ కాసుల హారాలు ఏడువారాల నగలలో చోటు సంపాదించాయి. ఆ కాసుల హారమే, మరిన్ని హంగులద్దుకుని నయా ట్రెండ్‌గా ఫ్యాషన్‌ ప్రపంచాన్ని ఏలుతున్నది.

అందానికి, హుందాతనానికి పెట్టింది పేరు ‘కాసులపేరు’. బంగారు కాసులు మారకంగా చలామణి అయిన రోజుల్లో వాటిని కూర్చి హారంగా ధరించేవారు మహిళలు. రానురానూ అదే సంప్రదాయంగా మారింది. అలా కాసుల పేరు అతివల ఆభరణాల్లో మొదటి స్థానంలో నిలిచింది. నేటికీ ఇల్లాలి నగల డబ్బాలో కాసుల పేరు ఉండటం ఓ గొప్ప. లక్ష్మీదేవి రూపమే కాకుండా రామ పరివారం, దేవీ దేవతల మూర్తులతోనూ కాసులను రూపొందించడం సంప్రదాయం.

- Advertisement -

శుభానికి, సౌభాగ్యానికి లక్ష్మీదేవి అధిదేవత. విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి… ఇలా అష్టలక్ష్మీ స్వరూపాలతో అలరారేదే లక్ష్మీ కాసుల మాల. ఈ హారం ధరిస్తే, సిరి లచ్చిమిలా మెరిసిపోవాల్సిందే. ఇక, రామపరివార కాసుల మాలలో ప్రతి కాసుపైనా శ్రీరాముని పట్టాభిషేక ఘట్టం ఉంటుంది. సీతా లక్ష్మణ సమేతుడైన రామచంద్రుడు దర్శనమిస్తాడు. కొన్ని డిజైన్లలో సాధారణ కాసుల మధ్యలో రామపరివారం లాకెట్‌ ఉంటుంది.

పేరుకు కాసులపేరే అయినా దీన్లో కాసులు తక్కువే. వజ్రాలు, పచ్చలు, కెంపులు.. మొదలైన జాతి రత్నాలను విరివిగా వాడుతారు. కాసులపేరులో పూలు, పండ్లు, లతలు.. ఇలా నచ్చిన డిజైన్లను జోడించుకుంటున్నారు ఆధునిక మహిళలు. పొడవాటిహారాలే కాకుండా, మెడకు దగ్గరగా నెక్లెస్‌ల రూపంలోనూ కాసుల చోకర్లను చేయించుకుంటున్నారు.

సంప్రదాయ వేడుకల్లో కాసులపేరుతో పాటు చెవులకు కాసుల చెంప సరాలు అలంకరించుకుంటే నిండుదనం వస్తుంది. అప్పట్లో చెంపసరాలంటే ముత్యాలు, బంగారు పూసలు, బుట్టలతో చేసినవే ఉండేవి. వాటికి భిన్నంగా చిట్టిచిట్టి కాసులతో డిజైన్‌ చేసిననీ వస్తున్నాయి. రెండు వరుసల్లో పూసలు, కింది వరుసలో రకరకాల రూపాలతో ఉన్న కాసులు ట్రెండీగానూ, సంప్రదాయంగానూ కనిపిస్తాయి.

కాసుల పేరును హారంలానూ, వడ్డాణంలానూ వాడుకోవచ్చు. కాసుల పేరు డిజైన్‌తోనే లోలాకులు, ముక్కెర, ఉంగరం, గాజులు.. అన్నీ కలిపి సెట్‌గా వస్తున్నాయి. ఒకే నగలో మెడ వద్ద చిన్నగా, పొడవైన హారంగా.. రెండు వరుసల కాసుల హారాలు కూడా వస్తున్నాయి. వీటికి ‘లేయర్‌ కాసులపేరు’ అని పేరు. వీటి కాసులు కాస్త చిన్నగా ఉంటాయి, మధ్యలో పెండెంట్‌ ఉంటుంది. ఏ సందర్భానికైనా అతికినట్టు సరిపోతుంది. అందుకే ఆధునిక మహిళలు వీటిని యాంటిక్‌ జువెలరీగా అభిమానిస్తున్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement