హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ ఆల్‌టైమ్ రికార్డులను సృష్టిస్తున్నది. శుక్రవారం 18,228 మెగావాట్లతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటి వరకు 18,139 మెగావాట్లు అత్యధిక పీక్ డిమాండ్ కాగా, శుక్రవారం రాష్ట్రం దీన్ని కూడా అధిగమించింది. రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం అమాంతం పెరుగుతున్నది. శుక్రవారం 337 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమైంది. ఎండలు తీవ్రం కావడం, పంటలు ఎండుతుండటంతో విద్యుత్తు వినియోగం గంట గంటకు పెరుగుతున్నది.
ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో అధిక లోడ్ నమోదవుతున్నది. డిమాండ్ పెరుగుతుండటంతో డేంజర్‌బెల్స్ మోగుతున్నాయి. మన దగ్గర విద్యుత్తు అందుబాటులో లేకపోవడం, అంతటా విద్యుత్తుకు డిమాండ్ ఉండటంతో ఇంధన ఎక్స్చేంజీలో విద్యుత్తు కోసం పోటీ నెలకొంటున్నది. తెలంగాణ అధికారులు యూనిట్‌కు రూ.13 పెట్టి విద్యుత్తు కొంటున్నారు. గత వారం వరకు యూనిట్‌కు రూ.10 పెట్టి కొనగా ఇప్పుడదీ రూ. 13కు చేరింది.
రోజుకు నాలుగు వేల మెగావాట్ల విద్యుత్తును బహిరంగ మార్కెట్లో కొంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇంధన ఎక్స్చేంజీలోనూ విద్యుత్తు దొరకడంలేదు. వెయ్యి మెగావాట్లు అడిగితే 500 మెగావాట్లు మాత్రమే ఇస్తున్నారు. ఇక మరో 10-15 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంటున్నారు. ఈ పదిహేను రోజులు దాటితే గండం గడిచినట్టేనని పేర్కొంటున్నారు.
