హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూశారు. దీర్ఘకాలికంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న 83 ఏండ్ల దొర నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. నిమ్స్‌లోనే దొర శుక్రవారం తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. దొర మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. దొర మరణవార్త తెలుసుకున్న డీజీపీ శివధర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్‌కుమార్, నగర సీపీ వీసీ సజ్జనార్ దవాఖానకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. దొర తరచూ నిమ్స్‌లో డయాలసిస్ చేయించుకునే వారు. శుక్రవారం ఉదయం కూడా డయాలసిస్ అనంతరం బంజారాహిల్స్‌లోని ఇంటికి వెళ్లిన దొర ప్రమాదవశాత్తు బాత్రూమ్లో పడిపోయినట్టు తెలిసింది. అపస్మారక స్థితికి చేరిన ఆయనను కుటుంబసభ్యులు వెంటనే నిమ్స్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.
1965 బ్యాచ్‌కు చెందిన హెచ్‌జే దొర 1943లో ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పోలీసు రంగానికి తన సేవలందించారు. తన సుదీర్ఘ కెరీర్లో వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టేందుకు, హింసను తగ్గించేందుకు విశేష కృషి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన అందించిన విశిష్ట సేవలకు గాను ప్రభుత్వం ‘పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ’తో సత్కరించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ పతకాన్ని అందుకున్నారు. ఐపీఎస్ శిక్షణ అనంతరం ఆయన హైదరాబాద్‌లో డీసీపీగా తన ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా ఎస్పీగా, సీబీఐలో కూడా ఎస్పీగా పనిచేశారు. స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా, సీఐడీ అధిపతిగానూ సేవలందించారు. ఆయన 1996లో ఉమ్మడి రాష్ట్ర డీజీపీగా నియమితులై సుమారు ఆరేండ్ల పాటు 2002 వరకు కొనసాగారు. డీజీపీగా ఉద్యోగ విరమణ చేసిన అనంతరం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. కొంతకాలం సీఐఎస్ఎఫ్ డైరెక్టర్‌గా జనరల్‌గా కూడా ఉన్నారు. ఆయన ఒలింపిక్స్, వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1989 నుంచి 1992 వరకు ఏపీఎస్ఆర్టీసీ వైస్‌చైర్మన్‌గా, ఎండీగా కూడా సేవలందించారు. ‘ఇంపాక్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఆన్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఐపీఎస్ ఆఫీసర్స్’, ‘ఎన్టీఆర్‌తో నేను’ అనే రెండు పుస్తకాలు రాశారు. జర్నీ త్రూ టర్బులెంట్ టైమ్స్ శీర్షికతో తన ఆత్మకథను కూడా రాసుకున్నారు.
ఉమ్మడి రాష్ట్ర డీజీపీతోపాటు పోలీసుశాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన హెచ్‌జే దొర మరణం పట్ల తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పోలీస్ శాఖలో అనేక సంస్కరణలకు ఆయన ఆద్యుడని కొనియాడారు. ఈ మేరకు శుక్రవారం సంతాప సందేశాన్ని విడుదల చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ఆయన ఎంతగానో కృషిచేశారని, ఆయన మృతితో శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.