e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home జిల్లాలు అప్ర‌తిహ‌త.. అక్ష‌ర య‌జ్ఞం

అప్ర‌తిహ‌త.. అక్ష‌ర య‌జ్ఞం

అప్ర‌తిహ‌త.. అక్ష‌ర య‌జ్ఞం

నాడు ఉద్యమంలో… నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో..
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారం
సమస్యలు పరిష్కరిస్తూ.. ప్రజలను చైతన్యపరుస్తూ..
జిల్లా సమగ్రాభివృద్ధిలో తనవంతు పాత్ర
దశాబ్ది ప్రయాణంలో అపూర్వ విజయాలు..
నేడు పదకొండో వసంతంలోకి తెలంగాణ ఆత్మగౌరవ పత్రిక

మన నీటి వాటాలో అన్యాయం జరిగిన వేళ.. మనకు దక్కాల్సిన నిధులు దారి మళ్లిన వేళ.. ఉద్యోగాలు దక్కని వేళ.. తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన ‘నమస్తే తెలంగాణ’ పెను సంచనాలు సృష్టించింది. పత్రికా రంగంలో ఓ కొత్త ఒరవడికి నాంది పలికింది. సకల జనులను ఏకం చేసి సమైక్యవాదుల కుట్రలు, కుతంత్రాలకు ఎదురొడ్డి పోరాడేలా చైతన్యాన్ని నింపింది. యావత్‌ ప్రజానీకం కలలు గన్న తెలంగాణ రాష్ర్టాన్ని సాకారం చేయడంలో తన వంతు పాత్రను పోషించింది. ఉద్యమ గొంతుకగా వచ్చిన ‘నమస్తే తెలంగాణ’ రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది. ఉద్యమ ప్రస్థానంలో అమరులైన యోధుల కుటుంబాలకు ఆపన్నహస్తం అందించింది. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ తెలంగాణ ప్రజల నమ్మకమైన నేస్తంగా నిలుస్తోంది. ఎన్నో ఆటుపోట్లకు ఎదురొడ్డి.. విజయ పరంపర దిశగా అప్రతిహతంగా సాగుతున్న ‘నమస్తే తెలంగాణ’ పదేండ్ల ప్రస్థానాన్ని ముగించుకుని పదకొండో వసంతంలోకి అడుగిడుతోంది. – యాదాద్రి భువనగిరి, జూన్‌ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)

ఆలేరుకు గోదావరి నీళ్లు రావడన్నమన్నది కలలోనైనా జరిగేనా!..అని ఎగతాళి చేసిన వాళ్లూ ఉన్నారు. సీఎం కేసీఆర్‌ భగీరథ ప్రయత్నంతో మండుటెండల్లోనూ గోదావరి నీళ్లతో చిందేస్తున్న జల వనరుల దృశ్యాలను పతాక శీర్షికలకు ఎక్కించి.. విమర్శించిన నోళ్లతోనే ప్రశంసలు కురిపించేలా చేసింది.

సంస్థాన్‌ నారాయణపురం మండలం ఐదుదొనాలతో పాటు పలు తండాల గిరిజనులు ఎదుర్కొంటున్న రహదారి ఇబ్బందుల నేపథ్యంలో.. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచి ఏండ్లనాటి రోడ్డు సమస్యకు పరిష్కారం చూపింది.

ఏండ్లతరబడిగా భూ సమస్యలు పరిష్కారం కాక పట్టాదారు పాసుపుస్తకాలు రాక రైతుల పడుతున్న గోసను తీర్చేందుకు ‘ధర్మ గంట’ వేదికగా నిలిచింది. అవినీతి అధికారుల భరతం పట్టడంతోపాటు..భూ సమస్యలను పరిష్కరించి రైతుల మోముల్లో నవ్వులను పూయించింది.

వలిగొండ మండలంలో పంటలు వర్షం నీటిలో మునిగిపోయాయని.. ఓ పచ్చ పత్రిక అవాస్తవ కథనాలతో గగ్గోలు పెట్టింది. అధికారుల సవివరణలతో వాస్తవాలను బయటపెట్టి సదరు పత్రిక కుయుక్తులకు అడ్డుకట్ట వేసింది.
– ఒకే ఒక్క నమస్తే తెలంగాణ

2011 జూన్‌ 6న పురుడు పోసుకున్న ‘నమస్తే తెలంగాణ’ ఓ పసికందు. ఎన్నో సవాళ్లకు ఎదురీది ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నిలిచి గెలిచింది. సూర్యోదయానికన్నా ముందే వార్తలతో ప్రజల ముంగిళ్లలో వాలి.. వారి ప్రేమాభిమానాలతోపాటు నమ్మకాన్నీ చూరగొన్నది. జిల్లా సమగ్ర అభివృద్ధిలోనూ కీలకంగా వ్యవహరించింది. ప్రజల్లో ఎప్పటికప్పుడు చైతన్యం తీసుకురావడంతోపాటు అధికారుల వైఫల్యాలను సైతం నిస్సంకోచంగా ఎత్తి చూపింది. బంగారు తెలంగాణలో భాగంగా సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా.. ఆ ఫలాలను పొంది దశదిశ మార్చుకున్న జీవిత గాథలను సైతం ప్రచురించింది. ఖండాంతరాలకు యాదాద్రి ఖ్యాతిని చాటేలా సీఎం కేసీఆర్‌ అంకుఠిత దీక్షతో తలపెట్టిన లక్ష్మీనరసింహుని దేవాలయ పునర్నిర్మాణ పనులపై ఎన్నో ప్రత్యేక కథనాలనూ పాఠకులకు అందించింది. గత పదేండ్ల కాలంలో ఎన్నో విజయాలను, మరెన్నో మధుర స్కృతులను మిగిల్చిన ‘నమస్తే తెలంగాణ’ 11వ వసంతంలోనూ అదే ఒరవడిని కొనసాగించేందుకు సన్నద్ధంగా ఉంది.

  • యాదాద్రి భువనగిరి, జూన్‌ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ‘నమస్తే’ దారి చూపింది..
    సంస్థాన్‌నారాయణపురం మండలంలోని కడీలబాయితండా పంచాయతీ పరిధిలో ఉన్న ఐదు దోనాలతండా. యాభై వరకు గడపలు ఉన్న ఈ తండాలో ఫ్లోరైడ్‌ నీటినే తాగుతూ గిరిజనులు జీవచ్చవాల్లా బతుకుతుండగా, తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరథ ద్వారా స్వచ్ఛ జలాన్ని అందించింది. తెలంగాణ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుని గిరిజనుల ఏండ్లనాటి తాగు నీటి సమస్యను పరిష్కరించిన వైనాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకువచ్చింది. ‘చేదబావి పాయె.. చెలిమె కష్టం పాయె.. కేసీఆర్‌ నీళ్లొచ్చినయ్‌’ శీర్షికన గత ఏడాది జూలై 31న ‘నమస్తే తెలంగాణ’ మినీలో ప్రచురితమైన కథనం సీఎం కేసీఆర్‌ను ముచ్చటగొలిపేలా చేసింది. ఇదే సందర్భంలో తండాలో అనాదిగా నెలకొన్న రోడ్డు సమస్యకు పరిష్కారం లభించింది. తండాకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని వెంటనే రోడ్డు మరమ్మతులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి ఐదుదోనాలతండాను సందర్శించి రూ.4లక్షలతో త్వరితగతిన రోడ్డుకు మరమ్మతులు చేయించారు. ప్రస్తుతం గిరిజనులకు రహదారి ఇబ్బంది తీరగా, ‘నమస్తే తెలంగాణ’ ప్రభుత్వానికి, గిరిజనులకు వారధిగా ఉండి సమస్యకు పరిష్కారాన్ని చూపించింది.

యాదాద్రి వైభోగంపై ప్రత్యేక కథనాలు..
అంతర్జాతీయ ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో పూర్తిగా కృష్ణశిలలతో వెయ్యేండ్లపాటు చెక్కు చెదరకుండా పునర్నిర్మితమవుతున్న ప్రధానాలయం పనులు సింహభాగం పూర్తయ్యాయి. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ప్రతి పైసాను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వస్తూ యాదాద్రి రూపురేఖలనే మారుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సీఎం కేసీఆర్‌ 2014 అక్టోబర్‌ 17న యాదగిరిగుట్ట క్షేత్రాన్ని సందర్శించారు. ఆ రోజే కేసీఆర్‌ తన మదిలోని ఆలోచనను వెల్లడించి విశ్వఖ్యాతి చెందేలా క్షేత్రాన్ని పునర్నిర్మించనున్నట్లు ప్రకటించారు. చినజీయర్‌ స్వామి సలహా, సూచనలతో ఈ క్షేత్రానికి యాదాద్రిగా నామకరణం చేశారు. ఇప్పటివరకు సీఎం కేసీఆర్‌ పద్నాలుగు మార్లు యాదాద్రిని సందర్శించి పనుల వేగవంతానికి చర్యలు తీసుకున్నారు. 2015 జూలై 5న దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ యాదాద్రిని సందర్శించి సీఎం కేసీఆర్‌ సంకల్పాన్ని మెచ్చుకున్నారు. త్వరలోనే స్వయంభువుల దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, ‘నమస్తే తెలంగాణ’ ఎన్నో ప్రత్యేక కథనాలను ప్రచురించి విశ్వవ్యాప్తం చేయడంలో తనవంతు కృషి చేసింది.

అక్రమాలు వెలుగులోకి..
సంస్థాన్‌నారాయణపురం గ్రామపంచాయతీలో జరిగిన అక్రమాలను 2021 ఫిబ్రవరి19న ‘నమస్తే తెలంగాణ’ మినీలో ‘మొక్కల పైసలు మెక్కేశారు..’ శీర్షికన ప్రచురితమైన కథనం ద్వారా వెలుగులోకి తెచ్చింది. పల్లె ప్రకృతి వనం, నర్సరీల ఏర్పాటుకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.2లక్షలను పంచాయతీ కార్యదర్శి సుభద్ర జ్యోతి తన సొంత ఖాతాలోకి మళ్లించుకుని డ్రా చేశారు. నిధులు డ్రా చేసుకున్నప్పటికీ ఎటువంటి పనులను చేపట్టలేదు. అలాగే ట్రీగార్డుల ఏర్పాటుకై రూ.1.60 లక్షలను కాంట్రాక్టర్‌ ఒకరికి ఇప్పించగా, ట్రీగార్డులను సైతం ఏర్పాటు చేయలేదు. దీనిపై జిల్లా అధికారులు విచారణ నిర్వహించారు. ఈ మేరకు డీపీవో ఇచ్చిన నివేదికను అనుసరించి జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేశారు.

పదవేదైనా జోరు కారుదే…
పల్లె, పట్నం అనే తేడా లేదు. అసెంబ్లీ, ఎమ్మెల్సీ అనే అనుమానం లేదు. ఈవీఎం, బ్యాలెట్‌ అనే సంశయం అవసరమే లేదు. ఏ ఎన్నికైనా.. పదవేదైనా జోరు కారుదే ఉంటున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2014లో జరిగిన ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించింది. ఆలేరు ఎమ్మెల్యేగా గొంగిడి సునీతామహేందర్‌రెడ్డికి, భువనగిరి ఎమ్మెల్యేగా పైళ్ల శేఖర్‌రెడ్డిలను అఖండ మెజార్టీతో గెలిపించారు. ఆ తర్వాత జరిగిన ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్‌, మున్సిపాలిటీ.. ఇలా అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ ప్రభంజనమే కొనసాగి గులాబీ నేతలే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. 2018 శాసనసభ ఎన్నికల్లోనూ గొంగిడి సునీతామహేందర్‌ రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డిలను రెండోసారి జిల్లా ప్రజానీకం గెలిపించింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. సీఎం కేసీఆర్‌ నాయకత్వానికే జై కొడుతున్నారు. ఉద్యమ పత్రికగా ‘నమస్తే తెలంగాణ’ ఉద్యమ నేతల గెలుపునకు తనవంతుగా దోహదపడింది.

పదేండ్ల ప్రస్థానంలో ప్రజా గొంతుకై…
‘నమస్తే తెలంగాణ’ అక్షర యాత్రకు నేటితో పదేండ్లు నిండగా, తెలంగాణ ఆవిర్భావానికి ముందు.. ఆ తర్వాత ప్రజా గొంతుకై ఎన్నో ప్రజోపయోగ కథనాలను పాఠకులకు అందించింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు, కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, పెట్టుబడి సాయం, రైతుబీమా వంటి పథకాలతోపాటు ధరణి, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, సాగు నీటి ప్రాజెక్టులు ఇలా.. ఎన్నెన్నో కథనాలతో జిల్లా ప్రజానీకంలో చైతన్యాన్ని విరబూయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మిషన్‌ భగీరథ పథకాన్ని అమలు చేయాలని సంకల్పించి ఫ్లోరైడ్‌ ప్రాంతం నుంచే సీఎం కేసీఆర్‌ తన సంకల్పాన్ని మొదలు పెట్టారు. 2015 జూన్‌ 8న చౌటుప్పల్‌ వద్ద పైలాన్‌ను సీఎం కేసీఆర్‌ స్వయంగా ఆవిష్కరించగా, ప్రభుత్వ సంకల్పాన్ని ‘నమస్తే’ యావత్‌ రాష్ట్ర ప్రజానీకం ముందుంచింది. చౌటుప్పల్‌ మండల కేంద్రంలోని గోల్డెన్‌ ఫారెస్టు భూముల అన్యాక్రాంతంపై 2013లో ప్రచురించిన కథనంతో సాధికారత కమిటీ ఏర్పాటవ్వగా, నేటికీ ఆ భూములు ప్రభుత్వ రక్షణలోనే ఉండటం.. ‘నమస్తే’ సాధించిన విజయంగా చెప్పవచ్చు. 2019లో ‘నమస్తే’ మోగించిన ‘ధర్మగంట’తో న్యాయం జరిగిన బాధిత కుటుంబాలు నేటికీ పత్రిక స్ఫూర్తిని కొనియాడుతున్నాయి.

కాళేశ్వర జలాలకు జీవం పోసిన సీఎం కేసీఆర్‌..
ప్రాణహిత-చేవెళ్ల పథకంలో భాగంగా జిల్లాకు గోదావరి జలాలను అందిస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని అటకెక్కించగా, సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో 2016 సంవత్సరంలో రీ డిజైన్‌ చేసి కాళేశ్వరం ప్రాజెక్టులో చేర్చి ఈ పథకానికి జీవం పోశారు. 15, 16 ప్యాకేజీల కింద గంధమళ్ల, నృసింహ(బస్వాపూర్‌) రిజర్వాయర్లకు నీరందించేందుకు శరవేగంగా చర్యలు చేపట్టింది. రూ.610.29 కోట్లతో 11.39 టీఎంసీల సామర్థ్యంతో బస్వాపూర్‌ రిజర్వాయర్‌ను నిర్మించి ఇక్కడి నుంచే జిల్లాలోని పలు ప్రాంతాలకు నీరందించేలా రూపకల్పన చేశారు. ప్రస్తుతం పనులు చివరి దశలో ఉండగా, జూలై నెలాఖరు నాటికి బస్వాపూర్‌ రిజర్వాయర్‌లోకి కాళేశ్వరం నీళ్లను రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికంటే ముందే కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి ఆలేరు నియోజకవర్గానికి గోదావరి నీళ్లను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం తుర్కపల్లి, బొమ్మలరామారం, గుండాల మండలాలకు నీరు పారి మండుటెండల్లోనూ చెరువులు గోదావరి జలాలతో చిందేస్తున్నాయి. ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలు రావడం అన్నది కల.. అని ఎంతో మంది హేళన చేయగా, ‘నమస్తే తెలంగాణ’ గోదావరి జలాల రాక అంశాన్ని పతాక శీర్షికల్లో చేర్చి వారి కుట్రలను భగ్నం చేసింది. కరువు నేలపై గలగల పారుతున్న గోదావరి జలాలను చూసి గతంలో విమర్శించిన వారే వేన్నోళ్లా ప్రభుత్వాన్ని పొగుడుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అప్ర‌తిహ‌త.. అక్ష‌ర య‌జ్ఞం

ట్రెండింగ్‌

Advertisement