గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 18, 2021 , 00:17:32

అమ్మకు ఆత్మీయతతో..

అమ్మకు ఆత్మీయతతో..

  • 102 వాహనాలతో గర్భిణులు, బాలింతలకు తప్పిన తిప్పలు
  • భువనగిరి, రామన్నపేట, చౌటుప్పల్‌, ఆలేరు, మోత్కూరు, తుర్కపల్లి మండలాలకు వాహనాల కేటాయింపు

రామన్నపేట, జనవరి 17 : మహిళల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీటవేస్తూ మాతాశిశు సంరక్షణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా జిల్లాలో ఆరు 102 వాహనాలను ఏర్పాటు చేసి ఉచితంగా సేవలు అందిస్తున్నది. వాహనాలను భువనగిరి, రామన్నపేట, మోత్కూరు, ఆలేరు, తుర్కపల్లి, చౌటుప్పల్‌ దవాఖానలకు కేటాయించారు. వాహనాల్లో ఒకేసారి 12మందిని తీసుకుపోయే సౌకర్యం కల్పించారు. ఈ వాహనాల ద్వారా గర్భిణులకు పరీక్షలు, ప్రసవంకోసం దవాఖానలో చేర్చడంతో పాటు ప్రసవం అనంతరం తల్లీబిడ్డను క్షేమంగా ఇంటికి చేరవేస్తూ వారికి ఆరోగ్యంపై మరింత భరోసా కల్పిస్తున్నది. శిశువులకు టీకాలు వేయించేందుకు కూడా 102 వాహనాన్ని వినియోగించుకుంటున్నారు. వాహనంలో డెలివరీ కిట్‌తో పాటు, ఫస్ట్‌ఎయిడ్‌ కిట్‌, ఏఎన్‌ఎంను అందుబాటులో ఉంచారు. ఒక్కోవాహనం కేటాయించిన మండలాల పరిధిలోని గర్భిణులు, బాలింతలను నెలకు సరాసరి 300 మందిని గ్రామీణ ప్రాంతాలనుంచి పరీక్షల కోసం ఏరియా దవాఖాన, పీహెచ్‌సీలకు తీసుకెళ్తున్నారు.

రోజుకు 12గంటల సేవలు.. 

ప్రభుత్వం సమకూర్చిన 102 వాహనాలు వివిధ దవాఖానలకు రోజుకు 12గంటలు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటున్నాయి. మహిళలు గర్భం దాల్చినప్పటినుంచి ప్రసవం అయి ఇంటికి వెళ్లే వరకు ఈ వాహనాలు ఉచితంగా సేవలు అందిస్తున్నాయి. గర్భిణులు చెకప్‌కు వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా వాహనాన్ని ఉపయోగించుకోవచ్చు. చెకప్‌ అనంతరం ఇంటి దగ్గర దింపి వెళ్తుంది.

చాలా ఉపయోగకరంగా ఉంది..

ప్రభుత్వం తీసుకువచ్చిన 102 వాహనం చాలా ఉపయోగకరంగా ఉంది. నెలనెలా చెకప్‌కు వెళ్లే సమయంలో ఇంటి దగ్గరినుంచి దవాఖానకు, తిరిగి ఇంటికి చేరవేస్తుంది. ఆటోల కోసం వేచిచూడటం, కుదుపులతో కూడిన ప్రయాణం చేసే బాధ తప్పింది. కరోనా సమయంలో 102 వాహనాలు అందించిన సేవలు వెలకట్టలేనివి.

- సుమలత, గర్భిణి, వెల్లంకి 

102 వాహనాలను సద్వినియోగం చేసుకోవాలి..

ప్రభుత్వం గ్రామీణ ప్రాంత గర్భిణులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి 102 వాహనాలను ఏర్పాటు చేసింది. గర్భిణి ప్రసవం కోసం, చెకప్‌ కోసం వచ్చిన వారిని ఉచితంగా ఇంటివరకు చేరుస్తుంది. ఈ వాహనాల వల్ల మహిళలు దవాఖానల్లో నిరీక్షించి ఇబ్బంది పడేబాధలు తప్పాయి. గర్భిణులందరూ 102 వాహనాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి.

- డా విజయలక్ష్మి, సూపరింటెండెంట్‌ ఏరియా దవాఖాన, రామన్నపేట

12గంటలు అందుబాటులో ఉంటాం..

102 సేవలపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి వ్యయ ప్రయాసాలు లేకుండా ఆరోగ్య సేవలు పొందుతున్నామనే సంతృప్తి వాళ్లలో కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గర్భిణులను నెలకు సుమారుగా 300 మందిని పీహెచ్‌సీలకు తీసుకువచ్చి చెకప్‌ అనంతరం వారి ఇండ్లవద్ద చేర్చుతున్నాం. 12 గంటలు అందుబాటులో ఉండి 150 ట్రిప్పుల వరకు చేస్తాను.

- బి.నాగరాజు, పైలెట్‌

VIDEOS

logo