ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 11, 2020 , 00:19:53

ఏడాది కిందట తల్లి.. ఇప్పుడు తండ్రి మృతి

ఏడాది కిందట తల్లి.. ఇప్పుడు తండ్రి మృతి

  • అనాథలైన చిన్నారులు 
  • ట్విట్టర్‌ ద్వారా చిన్నారుల వివరాలు అడిగిన మంత్రి కేటీఆర్‌
  • చిన్నారుల చదువుకు పూర్తి భరోసా కల్పిస్తామని ప్రభుత్వ విప్‌ హామీ 

మోటకొండూర్‌: ఏడాది కిందట తల్లి.. బుధవారం రాత్రి తండ్రి మరణించడంతో ఇద్దరు చిన్నారులు అనాథలైన ఘటన మండలంలోని మాటూరు గ్రామంలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బైరపాక నవీన్‌, రేణుకలు పదేండ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం..కూతురు అస్మిక(9), కుమారుడు హర్ష(7). పిల్లలతో కలిసి వీరు నాలుగేండ్ల కిందట జీవనోపాధి కోసం హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు వెళ్లారు. నవీన్‌ వృత్తిరీత్యా పెయింటింగ్‌ పని చేస్తుండగా, భార్య రేణుక రోజువారీ కూలీ పని చేస్తూ జీవనం సాగించేవారు. ఏడాది కిందట రేణుక(29) అనారోగ్యంతో మృతి చెందింది. పెయింటింగ్‌ చేస్తూ పిల్లలతో నవీన్‌ ఉప్పల్‌లోనే నివాసం ఉండేవాడు. బుధవారం రాత్రి నవీన్‌కు ఆకస్మికంగా గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందాడు. దీంతో తల్లిదండ్రులు మరణించడంతో చిన్నారులు అనాథలయ్యారు. చిన్నారుల రోదనలతో స్థానికులంతా చలించిపోయారు.

చిన్నారుల చదువు బాధ్యత నాదే : ప్రభుత్వ విప్‌

తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైన చిన్నారులు అస్మిక, హర్షల చదువుకు వారి బంధువులు ఒప్పుకుంటే పూర్తి బాధ్యత తీసుకొని చదివిస్తామని ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఫోన్‌ ద్వారా బంధువులకు హామీ ఇచ్చారు. చిన్నారులను హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ విక్టోరియా మెమోరియల్‌ హోంలో చేర్పించి చదివిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ పోతిరెడ్డి స్వప్నాస్కైలాబ్‌రెడ్డి మాట్లాడుతూ..అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు ముందుకురావాలని కోరారు. 

చిన్నారుల కుటుంబానికి కేటీఆర్‌ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ మోటకొండూర్‌: తల్లిదండ్రులు కోల్పోయి ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారని యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్‌ మండలంలోని మాటూరు గ్రామానికి చెందిన యువకుడు నేరుగా ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా సందేశం పంపించాడు. స్పందించిన మంత్రి కేటీఆర్‌ చిన్నారుల పూర్తి వివరాలను పంపించాలని రీ ట్వీట్‌ చేశారు. కాగా, చిన్నారుల పూర్తి వివరాలతోపాటు చిన్నారుల మేనమామ ఫోన్‌ నంబర్‌ను ట్విట్టర్‌ ద్వారా మళ్లీ మంత్రి కేటీఆర్‌కు పంపారు. దీంతో మంత్రి కార్యాలయం నుంచి చిన్నారుల మేనమామకు ఫోన్‌ వచ్చింది. ఫోన్‌లో మంత్రి కేటీఆర్‌ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని, చిన్నారుల తల్లిదండ్రుల మరణాల గురించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

VIDEOS

logo