హనుమకొండ, సెప్టెంబర్ 29 : పల్లెల్లో స్థానిక ఎన్నికల సమరానికి ముహూర్తం ఖరారైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎలక్షన్స్‌కు తెరలేచింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. దీంతో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. కాగా, ఆయా స్థానాలకు సంబంధించి ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారైన విషయం తెలిసిందే. అయితే మొదట రెండు విడతల్లో ప్రాదేశికం (జడ్పీటీసీ, ఎంపీటీసీ), ఆ తర్వాత మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలోని అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణ కు సన్నద్ధమవుతున్నది.
ఇప్పటికే ఓటరు జాబితా, పోలింగ్ స్టేష న్ల సామగ్రిని సమకూర్చుకోవడంతో పాటు రిటర్నింగ్, అసిస్టెం ట్ రిటర్నింగ్, ప్రిసైడింగ్ ఆఫీసర్లకు మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ పూర్తి చేశారు. ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్లను ఇప్పటికే సిద్ధం చేశారు. అక్టోబర్ 9న మొదటి విడత ప్రాదేశిక ఎన్నికల నోటీఫికేషన్ విడుదల కానుండగా, అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రెండో విడతకు 13న, అలాగే జీపీలకు 17, 21, 25 తేదీల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు 23, 27 తేదీల్లో, జీపీలకు అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పోలింగ్ జరగనుంది. సర్పంచ్, వార్డు మెంబర్ల ఓట్ల లెక్కింపు అదే రోజు జరగనుండగా, జడ్పీటీసీ, ఎంపీటీసీల లెక్కింపు నవంబర్ 11న చేపట్టనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు ఆశావహులు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు. దసరా పండుగను సైతం వినియోగించుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా లేనిచోట ఆశావహులు తమ భార్యలను రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటి నుంచే ఆయా పార్టీల పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులను ప్రసన్నం చేసుకొని ఎలాగైనా పోటీలో నిలిచేందుకు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కుస్తీపడుతున్నారు. ఓటర్లు సైతం ఎవరికి మద్దతివ్వాలని అంశంపై చర్చించుకుంటుండంతో గ్రామాల్లో దసరాతో పాటు ఎన్నికల సందడి జోరందుకుంది.