మంగపేట, జూలై 9 : షికారు కోసం అడవికి వెళ్లి దారి తప్పిన ఇద్దరు యువకులు ఎట్టకేలకు సురక్షితంగా ఇంటికి చేరారు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని కమలాపురానికి చెందిన దినేశ్, రేసెన్ సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలోని అడవిలోకి షికారుకు వెళ్లారు. భారీ వర్షం కురియడంతో ఎర్రవాగు ప్రవాహం పెరిగింది. మరోవైపు చీకటి పడింది. దీంతో వారు వంతెన వద్దకు చేరుకునే తోవను మర్చిపోయి ఆందోళనలో పడ్డారు. ఈక్రమంలో 100కు డయల్ చేసి అడవిలో తోవ తప్పిన విషయాన్ని తెలిపారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది కమలాపురానికి చేరుకొని ఎర్రవాగు వంతెన మీదుగా అటవీ ప్రాంతానికి వెళ్లారు. వారి ఆచూకీ తెలుసుకొని గ్రామానికి సురక్షితంగా తీసుకురావడం తో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.