సుబేదారి, డిసెంబర్ 5 : యూత్ కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు వరంగల్ తూర్పులో చిచ్చురేపాయి. ఇంతకాలం మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మధ్య అంతర్గతంగా ఉన్న వర్గపోరు ఒక్కసారిగా బహిర్గతమైంది. యూత్ కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో సారయ్య వర్గీయుడు గెలువడం కొండా దంపతులకు షాక్ తగలడంతో పాటు ఆనందోత్సాహాలపై వాట్సాప్ గ్రూప్‌లో పెట్టిన పోస్టుతో కొండా అనుచరులు రెచ్చిపోవడం, దీనికి అధికారం అండతో ఓ ఇన్స్పెక్టర్ సదరు యువకుడిపై ప్రతాపం చూపడం చర్చనీయాంశమైంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఎన్నికల ఫలితాల్లో ఎమ్మెల్సీ సారయ్య అనుచరుడు గెలుపొందడంతో సారయ్య వర్గానికి చెందిన వరంగల్ లేబర్‌కాలనీకి చెందిన యూత్ కాంగ్రెస్ కార్యకర్త వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన లేబర్‌కాలనీకి చెందిన కొండా వర్గానికి చెందిన నలుగురు కార్యకర్తలు సదరు యువకుడిని బెదిరించారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో అతడికి ఫోన్ చేసి ‘దమ్ముంటే చూసుకుందాం రా.. శివనగర్‌కి రా.. ఇక్కడే ఉన్నాం’ అనడంతో అతడు వెంటనే ఇంటినుంచి మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో తెలంగాణ జంక్షన్లో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు.
పోలీసులు ఇరువురిని రాత్రి ఒంటి గంట సమయంలో మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కొద్దిసేపటికి స్టేషన్‌కు వచ్చిన ఇన్స్పెక్టర్.. కొండా అనుచరులను పంపించి, సారయ్య అనుచరుడిని మాత్రం స్టేషన్‌పైకి తీసుకెళ్లి చితకబాదినట్లు తెలిసింది. సదరు యువకుడు తనకు రెండు రోజుల్లో పెళ్లి ఉందని చెప్పినా కనికరం లేకుండా ‘వాట్సాప్ పోస్ట్ ఎందుకు పెట్టావురా’ అని సదరు ఇన్స్పెక్టర్ ప్రశ్నిస్తూ కొట్టి, తెల్లవారుజామున 3గంటలకు వదిలిపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనతో తూర్పులో కొండా, సారయ్య వర్గాల్లో ఒక్కసారిగా విబేధాలు భగ్గుమన్నాయి.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోలీసు అధికారులు హద్దు మీరి ప్రవర్తిస్తున్నట్లు తాజా సంఘటన స్పష్టంచేస్తోంది. ఇటీవలే మంత్రి అనుచరుడి ఆదేశాల మేరకు పలువురిని స్టేషన్లో బంధించి కొట్టిన సంఘటనలు ఉండగా, సెటిల్మెంట్లకు కొందరు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో ఇటీవల తూర్పులో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు కూడా పడింది. అయినా కూడా ఆ ఏరియా పోలీసుల్లో మార్పు రావడం లేదు. మంత్రి ప్రధాన అనుచరుడి ఆదేశాల మేరకే పనిచేస్తారనేది తాజాగా సారయ్య వర్గం యువకుడికి ఇచ్చిన పోలీస్ ట్రీట్మెంట్ తీరును బట్టి మరోసారి తెలుస్తోంది. అక్కడ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పి, మాజీ రౌడీషీటర్ గుప్పిట్లో పోలీసింగ్ నడుస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.