Indiramma Illu | పర్వతగిరి, జూన్ 16: అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదని ఓ యువకుడు నిరసనకు దిగాడు. ఊరిలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువు కొమ్ము తండాలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే.. చెరువుకొమ్ము తండాకు చెందిన ధరావత్ సుమన్ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గతంలో అతని ఇల్లు కాలిపోయింది. దీంతో తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చెప్పిన వారికే ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తుండటపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఊరిలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళన చేశాడు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదని.. కాంగ్రెస్ నాయకులు చెప్పగానే అనర్హులకు జాబితాలో చోటు దక్కిందని మండిపడ్డాడు. ఇందిరమ్మ ఇల్లు కేటాయించకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని బెదిరించాడు.
ధరావత్ సుమన్ వాటర్ ట్యాంక్‌పైకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని.. అతన్ని సముదాయించి కిందకు దించారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.