కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం యాసంగి రైతులకు శాపంగా మారుతున్నది. పాలకులకు సరైన ప్రణాళిక.. ముం దుచూపు లేక చిన్నా, పెద్ద సాగునీటి జలవనరులు ఎండిపోతుండగా, ఆయకట్టు రైతుల ఆశలు అడుగంటిపోతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చివరి దశలో ఉన్న పంటలకు జీవిగంజి పోయలేక, ఎండుతున్న పంటలను చూసి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
-జయశంకర్ భూపాలపల్లి, మార్చి 14 (నమస్తే తెలంగాణ)
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జల వనరులు అడుగంటిపోతుండడంతో రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. జిల్లా లో 586 చెరువులుండగా 55,301 ఎకరాల ఆయకట్టు ఉన్నది. వీటిలో 365 చెరువుల్లో 20 శాతం వరకు నీరు అడుగంటింది. భూపాలపల్లి డివిజన్లో పది చెక్‌డ్యాం లు ఉండగా మొగుళ్లపల్లి మండలంలోని మూడు చెక్ డ్యాంలలో మాత్రమే 25 శాతం నీళ్లు ఉన్నాయి. అలాగే గణపసముద్రం, భీంఘన్‌పూర్ చెరువుల్లో మాత్రమే నీరు పుష్కలంగా ఉండి రైతులను ఆదుకుంటున్నాయి. అలాగే కాటారం డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో 70 చెరువులుండగా 42 చెరువులు పూర్తిగా నీరు లేక ఖాళీగా ఉన్నాయి. 28 చెరువులు 25 శాతం నీటితో ఉన్నాయి. ఈ డివిజన్లో ఎలాంటి చెక్‌డ్యాంలు లేవు.
జిల్లాలోని చలివాగు వెంట నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్లను సర్కారు గాలికి వదిలేసింది. చెల్పూర్, మోరంచపల్లి, ఒడితెల, నైన్పాక, సుబ్బక్కపల్లిలోని లిఫ్ట్ ఇరిగేషన్లు నిరుపయోగంగా ఉంటున్నాయి. మోరంచపల్లి గ్రామంలో వరదలకు నీట మునిగిన లిప్టు ఇరిగేషన్ మోటర్లకు ప్రభుత్వం మరమ్మతు చేయించకపోవడంతో రైతులు నాలుగు సీజన్లు పంటలను కోల్పోయారు. ఇటీవలే లిఫ్టుకు మరమ్మతు చేయించినా, అప్పటికే రైతులు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని పంటలు వేయలేదు. మిగిలిన లిఫ్ట్‌లకు సైతం మరమ్మతు చేయిస్తే మోరంచ ద్వారా వచ్చే నీటితో సుమారు 2 వేల ఎకరాలకు పైగా పంటలు సాగయ్యేవని రైతులు చెబుతున్నారు.
ఇక చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించింది. 14 చెరువులు నింపి 45,74 2ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టు పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం 70శాతం పూర్తి చేసింది. పలు అనుమతుల్లో జా ప్యం జరగడంతో మిగిలిన 30శాతం పను లు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో పనులు పూర్తి కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును ఫాస్టాగ్ ప్రాజెక్టుగా చేపట్టి పూర్తి చేస్తామని మంత్రులు చెప్పిన మాటలకు ఏడాది దాటింది. చెరువుల మరమ్మతు కొనసాగుతూనే ఉన్నది. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయిస్తే యాసంగిలో 45,742 ఎకరాలకు సాగునీరు అందేది.
డీబీఎం -38 కాల్వతో రేగొండ, గోరికొత్తపల్లి, చిట్యాల, టేకుమట్ల మండలాలకు చెందిన సుమారు 45వేల ఎకరాలు సాగులోకి వచ్చేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డీబీఎం-38 కాల్వకు మరమ్మతు చేయించి సాగునీరు అందించింది. అప్పటి నుంచి డీబీఎం కాల్వ నీరు లేక నిరుపయోగంగా మారింది. ప్రభుత్వం ఈ కాల్వలకు మరమ్మతు చేయించి నీరు అందిస్తే 45వేల ఎకరాలు సాగులోకి వచ్చేది. బావులు, బోర్లలో నీళ్లు పుష్కలంగా ఉండేవి.
కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం రిపేర్ చేయకుండా పక్కన పెట్టడంతో నీరు కిందికి వెళ్లి గోదావరి ఎడారిలా మారింది. అక్టోబర్ 2023 నుంచి ఇప్పటి వరకు 2,861 టీఎంసీల నీరు దిగువకు వృథాగా వెళ్లిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తే మల్హర్, కాటారం, టేకుమట్ల, చిట్యాల మండలాల్లో నీళ్లు పుష్కలంగా ఉండేవి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు సాగునీటికి తండ్లాడుతున్నారు.