జిల్లాలో యాసంగి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే పలు చోట్ల విచిత్రంగా ఓవైపు వరికోతలు ఇంకా కొనసాగుతుండగా మరోవైపు ఏకంగా వరినాట్లు ఊపందుకున్నాయి. ఎక్కువ మంది రైతులు వరిపైపే మొగ్గు చూపుతుండగా ఆ తర్వాత మక్కకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నిన్నమొన్నటిదాకా ఎన్నికల ముచ్చట్లలో మునిగి తేలిన రైతులు, ఇప్పుడు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ యేడు వర్షాలు తక్కువే పడినా ఒకేసారి కురిసిన భారీ వర్షాలు, ప్రాజెక్టుల నుంచి వచ్చిన నీటితో చెరువులు పూర్తిస్థాయిలో నిండి కళకళలాడుతున్నాయి. ఇక ఎరువులు, విత్తనాలు సైతం పుష్కలంగా అందుబాటులో ఉండడంతో అన్నదాతలు నిశ్చింతగా వ్యవసాయ పనుల్లో బిజీ అవుతున్నారు.
హనుమకొండ సబర్బన్, డిసెంబర్ 14 : జిల్లాలో యాసంగి సాగు పనులు ఇప్పుడే జోరందుకుంటున్నాయి. ఓవైపు ఇంకా వరికోతలు కొనసాగుతున్నా మరోవైపు వరినాట్లు మొదలయ్యాయి. ఈ సారి కూడా వరిని ప్రధాన పంటగా వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. రెండో ప్రధాన పంటగా మొక్కజొన్న వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈసారి వర్షాలు తక్కువే పడినా ఒకేసారి కురిసిన భారీ వర్షాలతో అన్ని చెరువులూ పూర్తి స్థాయిలో నిండి కళకళలాడుతున్నాయి. దీనికి తోడు వ్యవసాయానికి ప్రధాన అయువుపట్టుగా ఉన్న ఎస్సారెస్పీ, దేవాదుల ప్రాజెక్టుల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. భూగర్భ జలాలు కూడా పుష్కలంగా ఉండడంతో బావులు, బోర్ల ద్వారా వచ్చే నీటితో రైతులు యాసంగి పంటకు సరిపడా సాగునీరు అందనుంది. హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి, కమలాపూర్, హసన్పర్తి, దామెర, భీమదేవరపల్లి, వేలేరు, ధర్మసాగర్, ఐనవోలు, హనుమకొండ, నడికూడ మంలాలాల్లో వరి కోతలు పూర్తయి నార్లు పోసుకుని పొలాలు దున్నే పనిలో ఉన్నారు. ముందస్తుగా నారు పోసుకున్న రైతులు ఏకంగా నాట్లు వేస్తున్నారు. ఇక పరకాల, శాయంపేట, ఆత్మకూర్ మండలాల్లో ఇంకా వరి కోతలు, దాన్యం తరలింపు వంటి పనులు కొనసాగుతున్నాయి. పత్తి చేన్లు పూర్తి చేసిన రైతులు మక్క పంటను కూడా వేస్తున్నారు. మరోవైపు ఇతర పప్పు దినుసుల పంటలను కూడా వేసుకుంటున్నారు.
యాసంగి పంటల సాగుకు సంబంధించి ఎరువుల విషయంలోఎలాంటి ఢోకా లేకుండా గత ప్రభుత్వమే చర్యలు తీసుకున్నది. అవసరాలకు మించి ఎరువులు తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ వద్ద నిల్వలు ఉన్నాయి. ముందస్తు ప్రణాళికతో అన్ని రకాల ఎరువులను గోదాముల్లో నిల్వ ఉంచారు. ప్రస్తుతం ఉన్న నిల్వలు యాసంగి సాగు కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తానికి సరిపోయే స్థాయిలో నిల్వ ఉంచారు. యూరియా 7006 మెట్రిక్ టన్నులు, డీఏపీ 424 మెట్రిక్ టన్నులు, ఇతర కాంప్లెక్స్ ఎరువులు 310 మెట్రిక్ టన్నులు నిల్వ ఉన్నాయి. పంట దిగుబడిలో అత్యంత ప్రాముఖ్యత ఉండే పోటాష్ను సైతం అందుబాటులో ఉంచారు. జిల్లాలో మొత్తంగా చూస్తే 7741.405 మెట్రిక్ టన్నుల ఎరువులు బఫర్ నిల్వలుగా అందుబాటులో ఉన్నాయి.
హనుమకొండ డివిజన్ పరిధిలో వరి నాట్లు ఇప్పటికే మొదలయ్యా యి. పరకాల డివిజన్లో ఇంకా వరి కోతలు నడుస్తున్నాయి. జనవరి చివరి వరకు వరి నాట్లు పూర్తయ్యే అవకాశముంది. ఈసారి కూడా రైతులు పెద్ద ఎత్తున వరి వైపే మొగ్గు చూపుతున్నారు. హనుమకొండ జిల్లాలో లక్షా 30 వేల ఎకరాల్లో వరి సాగవనుంది. 50వేల ఎకరాల వరకు మొక్కజొన్న వేస్తారు. ఇందుకు సంబంధించి అన్ని ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసి ఉంచాం. ఇప్పటికైతే సాగు నీటికి ఇబ్బంది లేదు.
యాసంగి సాగు కోసం జిల్లాలో ఎరువులు పుష్కలంగా బఫర్ నిల్వలుగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లా మొత్తానికి సరిపోయే స్టాక్ గోదాముల్లో నిల్వ చేసి ఉంచాం. రైతులు ఎరువుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి యేడాది మాదిరిగానే ముందస్తుగానే ఎరువుల ఇండెంటును పంపాము. రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులను అందుబాటులో ఉంచుతున్నాం. ప్రస్తుతం 77.41 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి.