స్టేషన్‌ఘన్‌పూర్, డిసెంబర్ 10 : కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇంటిని తనకు కేటాయించినప్పటికీ మరొకరికి ఇచ్చారంటూ ఓ మహిళ ఇంటి లోపల గడియ పెట్టుకుని నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘ టన మంగళవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే ఐదేళ్ల క్రితం రా ఘవాపూర్లో 40 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి 33 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగిలిన వాటిలో నాలుగింటిని నాలుగు రోజుల క్రితం, మిగిలిన మూడింటిని మంగళవారం తహసీల్దార్, ఆర్ఐ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన రావుల శ్రీనివాస్, రజిత దంపతులు అక్కడకు చేరుకొని తమ పేరు మొదటి లిస్టులోనే వచ్చినప్పటికీ ఇల్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ డబుల్ బెడ్రూం ఇంట్లోకి వెళ్లిన రజిత లోపల గడియ పెట్టుకుని ఇల్లు ఇస్తారా? లేదంటే ఆత్మహత్య చేసుకోవాలా? అంటూ బెదిరించింది. దీంతో అక్కడికి పోలీసులు, రెవెన్యూ అధికారులు చేరుకుని బుధవారం ఈ సమస్యను పరిష్కరిస్తామని హమీ ఇవ్వడంతో రజిత బయటకు వచ్చింది.
కాగా, ఏడు ఇళ్లను రూ. 3 లక్షల చొప్పున నాయకులు, అధికారులు తీసుకొని అనర్హులకు పంపిణీ చేశారని బాధితురాలు ఆరోపించింది. వాటిని రద్దు చేసి గ్రామసభ ద్వారా తిరిగి లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేసింది. నిరుపేదలైన స్థానికులకు కాకుండా, బతకడానికి వచ్చిన వారికి పంపిణీ చేయడం ఎంత వరకు సమంజసమని రజిత అధికారులను ప్రశ్నించింది.