కాటారం, ఏప్రిల్ 17: తాగు నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని తెనుగువాడ మహిళలు గురువారం ఖాళీ బిందెలతో కాటారం-మంథని ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా తాగునీరు రావడం లేదని, బోర్లు కూడా పని చేయక తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నామన్నారు. అధికారులు, పంచాయతీ సిబ్బందికి విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనతో సుమారు 2 గంటల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఆర్డబ్ల్యూ ఏఈ రాజశేఖర్ ఘటనా స్థలానికి చేరుకొని 48 గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో అన్నవేన సమ్మయ్య, సురేశ్, రవి, శ్రీను, నరేశ్, శ్రీధర్, రజిత, లక్ష్మీనారాయణ, మొగిళితోపాటు పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.