జయశంకర్ భూపాలపల్లి : డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల జాబితాలో పేరు రాలేదని మనస్థాపంతో అనారోగ్యానికి గురై మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అద్దె ఇంటిలో నివసిస్తున్న తాటికొండ సమ్మక్క (55) అంబేద్కర్ చౌరస్తాలో పండ్ల దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెను గణపురం మండలం పరశురాం పల్లి గ్రామర్ చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసింది. సమ్మక్కకు సొంత ఇల్లు లేకపోవడంతో డబుల్ బెడ్ రూమ్ కోసం నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతోంది.
గతంలో ఎంపిక చేసిన జాబితాలో సమ్మక్క పేరు ఉండగా అనంతరం తయారు చేసిన జాబితాలో పేరు లేదంటూ కౌన్సిలర్లు చెప్పడంతో గత నెల రోజులుగా మనస్థాపంతో అనారోగ్యానికి గురైంది. ఆదివారం తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ సమ్మక్క సోమవారం ఉదయం మృతి చెందింది. దహన సంస్కారాలు నిర్వహించేందుకు అద్దె ఇంటి యజమాని నిరాకరించడంతో పరశురాంపల్లి లోని కుమార్తె ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.