కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా సింగరేణి గని కార్మికులకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కావడం లేదు. ఆరు గ్యారెంటీల పేరుతో అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి వాటిని నెరవేర్చక విఫలమైన రేవంత్ సర్కారు.. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా ఐఎన్టీయూసీ ప్రకటించిన హామీలనూ అటకెక్కించింది. హామీలిచ్చి సంవత్సరం గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్మికుల హక్కుల సాధన ప్రశ్నార్థకమైంది. కాగా బీఆర్ఎస్ హయాంలో టీబీజీకేఎస్ కొట్లాడి సాధించిన వారసత్వ ఉద్యోగాలు సహా ఇతర హక్కులను ఇప్పటికీ కార్మికులు అనుభవిస్తుండగా కేసీఆర్ పాలనను, చరిత్రాత్మక నిర్ణయాలను గుర్తుచేసుకుంటున్నారు.
– జయశంకర్ భూపాలపల్లి, జనవరి 1(నమస్తే తెలంగాణ)
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు, సింగరేణి కాలరీస్ కంపెనీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి ఏడాది గడుస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సింగరేణి సంస్థలో ఆరు డివిజన్లు కాంగ్రెస్ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టీయూసీ), ఐదు డివిజన్లు సీపీఐ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) గెలుచుకున్నాయి. ఐఎన్టీయూసీ ఎక్కువ స్థానాలు గెలిచినప్పటికీ ఓట్లు ఏఐటీయూసీకి అధికంగా రా వడంతో ఏఐటీయూసీ గుర్తిం పు కార్మిక సంఘంగా ఎన్నికైంది. కాగా, ప్రజలకు ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు ప్రకటించి విఫలమైన కాంగ్రెస్, సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ సైతం ఆరు గ్యారెంటీలు ప్రకటించి ఇప్పటివరకు ఒక్కటీ అమలు చేయలేకపోయింది. ప్రభుత్వం సైతం అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీ ఇచ్చిన గ్యారెంటీలపై దృష్టిసారించడం మరచింది. ఏఐటీయూసీ ఇచ్చిన ఎన్నికల హామీలు సైతం ఇప్పటివరకు అమలుకు నోచుకోలేకపోయాయి. దీంతో బొగ్గు గని కార్మికుల హక్కుల సాధన ప్రశ్నార్థకంగా మారింది.
గుర్తింపు ఎన్నికల సమయంలో ఐఎన్టీయూసీని గెలిపిస్తే ఆరు సింగరేణిలో గ్యారెంటీలను అమలు చేస్తామని ఐఎన్టీయూసీ నేతలతో పాటు కాంగ్రెస్ పెద్దలు సైతం బొగ్గు గనుల్లో పర్యటించి హామీలు గుప్పించారు. మరోవైపు ఏఐటీయూసీ సైతం 47 హామీలు ఇచ్చింది. ఎన్నికలు జరిగి ఏడాది గడిచినా ఎవరూ ఇచ్చిన హామీలపై నోరు మెదపడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ.. నూతన అండర్ గ్రౌం డ్ బొగ్గు గనులను ప్రారంభింపజేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, కార్మికులందరికీ సొంతింటి పథకం కింద 250 గజాల స్థలం, రూ.20 లక్షల వడ్డీ లేని రుణం ఇప్పిస్తామని, ప్రకృతికి విరుద్ధంగా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న సింగరేణి కార్మికులకు చెల్లించే అలవెన్స్‌ల (పెర్క్) ఆదాయంపై ఇన్‌కంటాక్స్ యాజమాన్యంతో కట్టిస్తామని, ఇప్పు డు ఉన్న అన్ని ఏరియా దవాఖానలను ఆధునీకరించి సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయిస్తామని, మహిళా కార్మికులకు అన్ని మౌలిక వసతులు కల్పించి గౌరవప్రదమైన ఉద్యోగం (అండర్ గ్రౌండ్లోకి దింపకుండా) సర్ఫేస్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని ప్రకటించారు.
సింగరేణి సంస్థలో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ గుర్తింపు సంఘంగా గెలువనప్పటికీ ఏఐటీయూసీ కంటే ఒక స్థానం ఎక్కువే గెలుచుకుంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినప్పటికీ సింగరేణి కార్మికులకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను ఇప్పటికీ అమలు చేయడం లేదు. కొత్త బొగ్గు గనుల ఏర్పాటు ఊసే లేదు. సంస్థలో బొగ్గు అన్వేషణ పనులు నిలిచిపోతే పట్టించుకునేవారు కరువయ్యారు. అలాగే ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రకటించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే బొగ్గు బ్లాకులను ప్రైవేటుకు అప్పగించడంపై కార్మికులు మండిపడుతున్నారు. కార్మికులకు సొంతింటి పథకం కింద 250 గజాల స్థలం, రూ.20 లక్షల వడ్డీలేని రుణం ఇప్పిస్తామని ముఖం చాటేశారు. పెర్క్ అలవెన్స్‌లపై ఆదాయపు పన్ను యాజమాన్యంతో కట్టిస్తామని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. అన్ని సింగరేణి ఆసుపత్రులను ఆధునీకరించి, ఒక సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు చేయిస్తామని చెప్పిన హామీ మరిచారు. కార్మికునికి, కార్మికుల కుటుంబ సభ్యులకు ఎలాంటి వ్యాధులు వచ్చినా హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లకు రెఫర్ చేస్తున్నారు. మహిళా కార్మికులకు సర్ఫేస్లోనే ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం మహిళా కార్మికులను సైతం గనుల్లోకి దింపేందుకు రంగం సిద్ధమవుతోంది. ఏఐటీయూసీ నాయకులు సైతం ఐఎన్టీయూసీ నాయకులను ఏ మాత్రం తీసి పోలేదని, 47 హామీలు ఇచ్చి ఒక్క హామీని నెరవేర్చలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.
ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు సింగరేణిలో అధికారంలో ఉండి ఏడాది కాలంలో ఒక్క హక్కు సాధించలేదు. కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ యూనియన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు పాతరేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఐఎన్టీయూసీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై నోరు మెదపడం లేదు. ఏడాది కాలంగా రెండు సంఘాలు, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో కార్మికుల హక్కుల సాధన ప్రశ్నార్థకంగా మారింది. గనుల్లోకి అమ్మాయిలను దింపేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అందరినీ గోదావరిఖనిలో రెండు గనులను ఎంపిక చేసి దింపే ఆలోచనలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు సింగరేణిలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేయడం లేదు.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు
సింగరేణి సంస్థలో బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సాధించిన హక్కులనే నేడు కార్మికులు అనుభవిస్తున్నారు. ఏఐటీయూసీ పోగొట్టిన వారసత్వపు ఉద్యోగాల హక్కులను కేసీఆర్ మళ్లీ తీసుకురావడంతో సింగరేణిలో యువ కార్మికులు పెరిగిపోతున్నారు. నాడు టీబీజీకేఎస్ సాధించిన హక్కులను గుర్తు చేసుకుంటున్నారు.