Plant Based Proteins | కండరాల పెరుగుదలకు వ్యాయామాలు చేసే వారు, ప్రతిరోజూ జిమ్ కు వెళ్లే వారు ఎక్కువగా జంతు ఆధారిత ప్రోటీన్ లపై ఆధారపడుతుంటారు. కండరాల పెరుగుదలకు ఎక్కువగా గుడ్లను, చికెన్ బ్రెస్ట్ వంటి వాటిని తీసుకుంటూ ఉంటారు. అయితే కండరాల పెరుగుదలకు కేవలం జంతు ఆధారిత ప్రోటీన్ లపై మాత్రమే కాకుండా మొక్క ఆధారిత ప్రోటీన్ లపై కూడా ఆధారపడవచ్చు. శాకాహారులు మాంసాహారాన్ని తీసుకోలేరు. అలాగే కొందరు వీగన్ ఆహారాలను మాత్రమే తీసుకుంటారు. అలాంటి వారు మొక్క ఆధారిత ప్రోటీన్ లను తీసుకోవచ్చు. ఇవి కూడా కండరాల పెరుగుదలకు అవసరమయ్యే ప్రోటీన్ లను అందిస్తాయి. కండరాల పెరుగుదలకు తోడ్పడే శాకాహార ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొక్క ఆధారిత ప్రోటీన్, సంక్లిష్ట కార్బొహైడ్రేట్స్ ను సమృద్దిగా కలిగి ఉండే వాటిల్లో కాయధాన్యాలు కూడా ఒకటి. కండరాల మరమ్మత్తుకు అవసరమయైన ఆమైనో ఆమ్లాలను అందిస్తాయి. కాయ ధాన్యాలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు వ్యాయామాలకు కావల్సిన స్థిరమైన శక్తి కూడా లభిస్తుంది. తెల్ల శనగలు( కాబూలీ శనగలు) ప్రోటీన్ కు శక్తివంతమైన వనరు అని చెప్పవచ్చు. వీటిలో ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు అనేకం ఉంటాయి. ఇవి కండరాల సంకోచానికి, శక్తిని ఉత్పత్తి చేయడంలో ఎంతో సహాయపడతాయి. వీటిని ఉడికించి తీసుకోవడం ద్వారా శరీరానికి కావల్సిన ప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి.
కండరాల పెరుగుదలకు అవసరమయ్యే ప్రోటీన్ ను అత్యధికంగా కలిగి ఉండే వాటిల్లో కినోవా ఒకటి. వీటిలో అతి ముఖ్యమైన తొమ్మిది అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. కండరాల పెరుగుదలకు, మరమ్మత్తులకు ఇవి మద్దతు ఇస్తాయి. కినోవాను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు శరీరానికి కావల్సిన ఇతర ఖనిజాలు కూడా లభిస్తాయి. ఇక ప్రోటీన్ తో పాటు క్యాల్షియంను కూడా కలిగి ఉండే వాటిల్లో పెరుగు ఒకటి. దీనిలో నెమ్మదిగా జీర్ణమయ్యే కేసైన్ అపే ప్రోటీన్ ఉంటుంది. ఇది రాత్రిపూట కండరాల విచ్ఛిన్నతను నివారించడంలో సహాయపడుతుంది. తీవ్రమైన వ్యాయామాలు చేసిన తరువాత త్వరగా కోలుకోవడంలో ఇది ఎంతో దోహదపడుతుంది. అదేవిధంగా పనీర్ ను తీసుకోవడం ద్వారా కూడా తగినంత ప్రోటీన్ ను పొందవచ్చు. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. కండరాల పెరుగుదలకు, మరమ్మత్తుకు ఇవి ఎంతో తోడ్పడతాయి.
సోయాబీన్స్ నుండి తయారు చేసే టోఫు కూడా ప్రోటీన్ ను కలిగి ఉంటుంది. దీనిలో ప్రోటీన్ తో పాటు క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. కండరాలను బలంగా తయారు చేయడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. అదే విధంగా బాదంపప్పు, వాల్నట్స్, చియా, అవిసె గింజలు కూడా ప్రోటీన్ తో పాటు మెగ్నీషియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను, ఇతర పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కండరాల పనితీరు మెరుగుపడుతుంది. ఇటువంటి మొక్క ఆధారిత ప్రోటీన్ లను తీసుకోవడం ద్వారా కూడా శరీరానికి కావల్సిన ప్రోటీన్ ను పొందవచ్చు. కండరాల పెరుగుదలకు వ్యాయామం చేసే వారు ఈ ఆహారాలను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.