– చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఆందోళన
– విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
– అధికారులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్న రైతులు
కోదాడ, అక్టోబర్ 03 : కాలిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను సకాలంలో మార్చకపోవడం, నిరంతర విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయంటూ ఆగ్రహించిన రైతులు శనివారం కోదాడ విద్యుత్ సబ్స్టేషన్ బైఠాయించి నిరసన తెలిపారు. సిపిఐ మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు ఆధ్వర్యంలో తమ్మర, గణపవరం, ద్వారకుంట, యతిరాజపురం తండా గ్రామాలకు చెందిన రైతులు సబ్స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు బయటకు వెళ్లకుండా అడ్డుకుని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు మాట్లాడుతూ.. విద్యుత్ అధికారులు ఎడాపెడా కోతలు విధిస్తుండటంతో పాటు కాలిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఇవ్వడానికి నెలల తరబడి తిప్పించుకుంటున్నారని మండిపడ్డారు.
అరకొరగా ఇస్తున్న ట్రాన్స్ఫార్మర్లు కూడా నాణ్యత లేకపోవడంతో అమర్చిన కొద్ది రోజులకే కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు పొట్టదశకు వచ్చి చేతికి అందే సమయంలో నీళ్లు లేక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన ట్రాన్స్ఫార్మర్లను వెంటనే సరఫరా చేయాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాయపూడి కాటమరాజు,బత్తినేని శ్రీను, వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, బండ్ల రంగయ్య, శ్రీరామ్ శ్రీను,నన్నే సాహెబ్, ముండ్రా సతీష్, మంగ్య, కాసాని రాంబాబు పాల్గొన్నారు.