Tamil Nadu : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనుండటంతో తమిళనాడు (Tamil Nadu) లో కోలాహలం మొదలైంది. పార్టీలు వ్యూహరచనల్లో బిజీబిజీగా ఉన్నాయి. పొత్తులపై, ఎత్తులకు పైఎత్తులపై తీవ్రంగా కసరత్తు జరుపుతున్నాయి. ఈ క్రమంలో అధికార డీఎంకే (DMK), కాంగ్రెస్ పార్టీ (Congress Party) ల మధ్య సీట్ల పంపకంపై ప్రాథమికంగా చర్చలు మొదలయ్యాయి. ఏ క్షణంలోనైనా ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉండడంతో ఇప్పటి నుంచే సీట్ల పంపకంపై ఇరుపార్టీలు చర్చలు జరుపుతున్నాయి.
ఏఐసీసీ తమిళనాడు ఇన్‌ఛార్జి గిరీష్ చోదంకర్, టీఎన్‌సీసీ చీఫ్ సెల్వపెరుంతగై, ఏఐసీసీ కో ఇన్‌ఛార్జి నివేదితా ఆల్వా.. డీఎంకే రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు నేతృత్వంలోని ప్యానెల్‌తో చర్చలు ప్రారంభించారు. కాగా తమిళనాడులో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 25 స్థానాలకు పోటీ చేసింది. ఈసారి కనీసం 35 స్థానాలు తమకు కేటాయించాలని, రెండు రాజ్యసభ స్థానాలు కూడా ఇవ్వాలని ఆ పార్టీ కోరుతొంది. డీఎంకే మాత్రం 27, 28 అసెంబ్లీ స్థానాలు, ఒక రాజ్యసభ సీటును ఆఫర్ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
ఒకవేళ డీఎంకే, కాంగ్రెస్‌ల మధ్య సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం కుదరకపోతే తమిళనాడులో కొత్త పొత్తులు చిగురించే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకేతో కలిసి వెళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు విజయ్ పార్టీ కూడా కాంగ్రెస్‌తో కలిసి వెళ్లే అంశంపై సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై విజయ్ నేరుగా స్పందించనప్పటికీ.. ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ మాత్రం ఇప్పటికే హింట్ ఇచ్చారు.
కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నారని, నిర్ణయం మాత్రం కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ ఆఫర్‌ను కాంగ్రెస్ నేతలు తోసిపుచ్చినప్పటికీ.. డీఎంకేతో పొత్తు విఫలమైతే టీవీకేతో కలిసి వెళ్లే అంశాన్ని కొట్టిపారేయలేమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదే జరిగితే చిరకాల మిత్రులుగా, ఇండియా కూటమి భాగస్వాములుగా ఉన్న డీఎంకే, కాంగ్రెస్‌ల మధ్య దూరం పెరిగే అవకాశం ఉందన్నారు.