అకాల వర్షాలతో ఏటూరునాగారం మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మొలకెత్తడంతో రైతులు తిరగబోస్తూ ఆరబె ట్టుకుంటున్నారు. నింపిన ధాన్యం బస్తాలు నీటిలో కొంత మేరకు మునక పట్టడంతో వాటిని సైతం తిరగల వేస్తున్నారు. వర్షాలతో దారులు బురదగా మారి కేంద్రాల్లోకి లారీలు లోడింగ్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఎప్పుడు వర్షం పడుతుం దోతెలియక అయోమయంలో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ఇక తరచూ కురుస్తున్న వర్షాలకు తాలు, ధాన్యం తడిసి కొన్ని కేంద్రాలు కంపు కొడుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసుకోలేక ఓపిక నశించిన కొందరు రైతులు సీడ్ వ్యాపారులు, దళారులకు విక్రయించుకుంటున్నట్లు తెలుస్తోంది.
మండలంలో జీసీ సీ, పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గోగుపల్లిలో వాగు ఒడ్డు వెంట ఏర్పాటు చేసిన కేంద్రంలోకి వరద రావడంతో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఇక్కడ నిల్వ చేసిన ధాన్యాన్ని కొందరు రైతులు ఇక గురువారం మరో చోటుకు తరలించి ఎండబెట్టుకున్నారు. సెంటర్స్ స్థలం ఎగుడు దిగుడుగా ఉండడంతో నీళ్లు నిలిచి చిత్తడిగా మారుతున్నాయి. దీంతో నీటిని పంపించేందుకు జేసీబీలతో కాల్వలు తీసుకోవా ల్సి వస్తున్నది.
కేంద్రాలకు స్థలం లేకపోవడంతో రైతుల భూములకు ఎంతో కొంత చెల్లించి సెంటర్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. వర్షాలు పడడంతో తడిసిన బస్తాలను మిల్లులకు నేరుగా పంపిస్తున్నట్లు సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. అదేవిధంగా దంతాలపల్లి మండలంలోని పెద్దముప్పారం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాల్లో మొలకలు వచ్చాయి. కాగా, గోగుపల్లి వరదలో తడిసిన 20 మంది రైతులకు సంబంధించి రెండు లారీల లోడు ధాన్యాన్ని మిల్లులకు పంపించినట్లు డీటీ రాహుల్ తెలిపారు.